Skip to main content

Inspirational Success Story : మాది నిరుపేద కుటుంబం.. కోచింగ్‌కు డ‌బ్బులు లేవు.. ఇలా చ‌దివి 7 గ‌వ‌ర్న‌మెంట్ జాబ్‌లు కొట్టానిలా.. కానీ..

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో ఒక ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌స్తే చాలు.. లైఫ్ సెట్ అయిన‌ట్టే ఆలోచ‌న‌లో ఎంతో మంది యువ‌త ఉంటారు. ఈ యువ‌కుడు మాత్రం... ఒకటి కాదు..రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పోయ్యేలా చేశాడు.
Santhosh Success Story

ఇత‌నే తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడకు చెందిన సంతోష్. ఈ నేప‌థ్యంలో సంతోష్ స‌క్సెస్ స్టోరీ మీకోసం... 

కుటుంబ నేప‌థ్యం :
సంతోష్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడకు చెందిన వారు.   తల్లిడంద్రులు లచ్చన్న, రాజవ్వలు. వీరిది నిరుపేద కుటుంబం. తమకున్న చిన్నపాటి వ్యవసాయ భూమిని సాగు చేసి కుమారుడు సంతోష్‌ను చదివించాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా సంతోష్ సైతం కష్టపడి చదువుకున్నాడు.

ఫెయిల్ అయినా కూడా ... ఎక్క‌డ నిరాశ చెందకుండా..
సంతోష్.. ప్రభుత్వ ఉద్యోగ వేటలో కొన్నిసార్లు ఫెయిల్ అయినా.. ఏమాత్రం నిరాశ చెందకుండా మరోసారి ప్రయత్నించాడు. ఇలా.. 2023లో రైల్వేలో పాయింట్‌మెన్, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్, 2024లో గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జూనియ‌ర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు. ఇలా వ‌రుస‌గా ఏడు ఉద్యోగాలు సాధించిన సంతోష్.. నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు.

ఈ ఏడు ఉద్యోగాల్లో నేను జాయిన్ అయ్యే ఉద్యోగం ఇదే..
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ తాజాగా విడుద‌ల చేసిన‌ జూనియర్ లెక్చరర్ ఫ‌లితాల్లో JL ఉద్యోగంకు ఎంపిక‌య్యా. అయితే సంతోష్ మాత్రం JL ఉద్యోగంలో జాయిన్ అవుతాన‌ని తెలిపారు.

ఎలాంటి కోచింగ్ లేకుండానే.. సొంత ప్రిపరేషన్‌తోనే.. 
సంతోష్.. కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలోనే...ఎంతో క‌ష్టపడి చదివి ఈ ఏడు ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను సాధించాడు. ఒక్క ఉద్యోగం సాధించటమే కష్టమనుకునే ఈ రోజుల్లో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.

ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు వేయట్లేదని.. అడపాదడపా వేసినా ఒకటి రెండు మార్కులతోనే జాబ్ మిస్సవుతోందని నిరాశతో ప్రైవేటు రంగంవైపు కొందరు యువత మొగ్గు చూపుతారు. అటువంటి ఈ రోజుల్లో.. ఓటమి ఎదురైనా ఎలాంటి అసంతృప్తి చెందకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి విజయం సాధించాడు సంతోష‌స్‌. ఎలాంటి కోచింగ్ లేకుండా.. సొంత ప్రిపరేషన్‌తోనే ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.

Published date : 01 Nov 2024 02:15PM

Photo Stories