Skip to main content

Jobs: సీపీసీహెచ్‌ లేకున్నా.. పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. నేడే చివరి తేదీ

మిడ్‌ లెవల్‌ హెల్త్‌ వర్కర్స్‌ పోస్టులకు బీఎస్సీ (నర్సింగ్‌) కోర్సులో సర్టిఫికెట్‌ ప్రోగ్రాం ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) పూర్తి చేయని వారిని సైతం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.
Jobs
సీపీసీహెచ్‌ లేకున్నా.. పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. నేడే చివరి తేదీ

దరఖాస్తుల సమర్పణకు నవంబర్‌ 6వ తేదీ చివరి రోజు అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సీపీసీహెచ్‌ లేని వారికి సంబంధించిన మెరిట్‌ జాబితాను మాత్రం తమ ఆదేశాల తరువాతే ప్రకటించాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్ తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. బీఎస్సీ (నర్సింగ్‌) కోర్సులో సర్టిఫికెట్‌ ప్రోగ్రాం ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) పూర్తి చేసిన వారు మాత్రమే మిడ్‌ లెవల్‌ హెల్త్‌ వర్కర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ప్రకటనను సవాలు చేస్తూ ఏపీ నర్సింగ్‌ సంక్షేమ సంఘం హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిల్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ అసనుద్దీన్ ధర్మాసనం విచారణ జరిపింది. బీఎస్‌సీ (నర్సింగ్‌) కోర్సులో సీపీసీహెచ్‌ను 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారని పిటిషనర్‌ సంఘం తరఫు న్యాయవాది తెలిపారు. 2019కి ముందు ఈ ప్రోగ్రాం లేదని, ప్రోగ్రాం తీసుకొచ్చిన తరువాత జరుగుతున్న మొదటి రిక్రూట్‌మెంట్‌ ఇదేనని వివరించారు. 2019కి ముందు బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చేసిన వారు మిడ్‌ లెవల్‌ హెల్త్‌ వర్కర్స్‌ పోస్టుల భర్తీకి అనర్హులవుతారని, ఇది ఏకపక్ష నిర్ణయమని, అందువల్ల ఇందులో జోక్యం చేసుకుని, సీపీసీహెచ్‌ లేని వారు సైతం దరఖాస్తు చేసుకునే అనుమతినివ్వాలని కోరారు. నవంబర్‌ 6వ తేదీనే దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అని, ఇప్పుడు దరఖాస్తుల సమర్పణకు అనుమతివ్వకపోతే తమ ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని చెప్పారు. పూర్తి వివరాల సమర్పణకు గడువు కావాలని సహాయ ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ వర్కర్స్‌ పోస్టుల భర్తీకి సంబంధించి సీపీసీహెచ్‌ లేని వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినివ్వాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్‌ 8కి వాయిదా వేసింది.

చదవండి: 

EAMCET: కౌన్సెలింగ్‌లో వీటిని పరిశీలించాలి

Good News: నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త

AIIMS New Delhi: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 678 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 06 Nov 2021 11:33AM

Photo Stories