Skip to main content

Anganwadi Jobs: అంగన్‌వాడీలో టీచర్‌, ఆయా పోస్టులు ఖాళీ

వాంకిడి(ఆసిఫాబాద్‌): గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు శిశువులకు టీకాలు వేయడం, పోలియోను అరికట్టడంలో ముఖ్యపాత్ర పోషించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నారు.
Anganwadi teacher and helper posts are vacant news in telugu

అలాగే అంగన్‌వాడీ కేంద్రాలో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు.
సమీపంలోని కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఫలితంగా అంగన్‌వాడీ టీచర్లపై అదనపు భారం పడటంతోపాటు కేంద్రాలకు వచ్చేవారికి మెరుగైన సేవలందడం లేదు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఉన్న ఖాళీలతో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు నష్టం జరుగుతోంది.

మొత్తం 973 కేంద్రాలు

జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), జైనూర్‌, వాంకిడి ప్రాజెక్టుల్లో మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రానికి ఒక టీచర్‌, హెల్పర్‌ ఉండాలి. 973 కేంద్రాలకు ప్రస్తుతం 875 టీచర్లు, 702 మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. ఐదు ప్రాజెక్టుల్లో 98 టీచర్‌ పోస్టులు, 271 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి కచ్చితమైన ప్రకటన విడుదల కాకపోవడంతో భర్తీపై సందిగ్ధం నెలకొంది. వందల పోస్టులు ఖాళీగా ఉండటంతో దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో జైనూర్‌, సిర్పూర్‌(యూ), కెరమెరి, తిర్యాణి, లింగాపూర్‌ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్నారు. ఆయా మండలాల్లోని పీవీటీజీ ప్రాంతాల్లో చదువుకున్న మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. గత నిబంధనల ప్రకారం అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌, ఆయాగా పనిచేయాలంటే స్థానికతను ఆధారంగా తీసుకునేవారు.

చదవండి: Anganwadi jobs: అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు..10వ తరగతి అర్హతతో
వివాహ అనంతరం అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి చెందిన వారై ఉండాలి. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో చదువుకున్న మహిళలు తక్కువగా ఉండటంతో పోస్టులు భర్తీ కావడం లేదు. ఫలితంగా ఇన్‌చార్జీలతో నెట్టుకురావాల్సి వస్తోంది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేయాలంటే కనీస అర్హత ఇంటర్‌తో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారనే సమాచారం. విద్యార్హత కలిగి లేని గ్రామాల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది.
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీ విషయమై ఐసీడీఎస్‌ పీడీ భాస్కర్‌ను వివరణ కోరగా.. పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని స్పష్టం చేశారు. ఉత్తర్వులు రాగానే పత్రిక ప్రకటన జారీ చేస్తామన్నారు. జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల వారీగా టీచర్లు, ఆయా పోస్టుల ఖాళీల వివరాలను సంక్షేమశాఖ కమిషనర్‌కు పంపించామని వెల్లడించారు.

చదవండి: Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

ఉద్యోగాలు భర్తీ చేయాలి
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలు వెంటనే అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఏళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలల్లో సిబ్బంది లేక గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయాలి.
– బోగే ఉపేందర్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి

Published date : 18 Sep 2024 01:28PM

Photo Stories