Job Notification: ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి: విద్యార్థి సంఘాలు
ఈమేరకు సెప్టెంబర్ 7న ఈ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు నుంచి నిర్వహించిన చలో ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వందలమంది విద్యార్థులు ప్రగతిభవన్ ను ముట్టడించడానికి ర్యాలీగా వెళ్తుండగా ఇందిరాపార్కు చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ విద్యార్థులను పోలీసు లు బలవంతంగా అరెస్ట్‌చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దీంతో విద్యార్థి సంఘ నేతలు, పోలీసుల మధ్య వాగి్వవాదం, తోపులాట జరగడంతో ఇందిరాపార్కు చౌరస్తాలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ విద్య పరిరక్షణ, ఖాళీ ఉద్యోగాల భర్తీ, జాబ్ కేలండర్ విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌స్టాలిన్, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌లు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం జీవో 25ను జారీ చేసి 3,750 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి కుట్రచేస్తోందని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు.. జీవో 46ను తుంగలోతొక్కి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, వీటిని తక్షణమే నియంత్రించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.3,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని ప్రగతిభవన్ గడీల గోడలను పగలగొడతామని హెచ్చరించారు. ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తున్న అశోక్‌స్టాలిన్ కాలికి గాయాలు కావడంతో అయన్ను పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు.