Skip to main content

Big Good News For Anganwadi Workers : అంగన్వాడీ ఉద్యోగుల‌కు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. రూ.40 వేలకు పెంచుతూ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అంగన్వాడీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచుతూ కీల‌క నిర్ణయం తీసుకుంది.
ap cm ys jagan    Andhra Pradesh Government Announcement  Retirement Age Increase from 60 to 62 for Anganwadi Employees

అలాగే అంగన్వాడీల పదవీ విరమణ సెటిల్మెంట్ ను లక్ష రూపాయలకు పెంచింది. దీంతో పాటు.. అంగన్వాడీ సహాయకుల పదవీ విరమణ వయస్సును కూడా 62 ఏళ్ల‌కు పెంచిన ప్రభుత్వం, సెటిల్మెంట్ ను రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం కీల‌క ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల‌ మరి కొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి అంగన్వాడీ ఉద్యోగుల‌కు అనుకులంగా ఉంటూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం మంచి నిర్ణ‌యాలు తీసుకుంటూ.. వ‌స్తుంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందు, అంటే గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ అంగన్‌వాడీ వర్కర్ల జీతం నెలకు రూ.7 వేలు, హెల్పర్లకు రూ.4,500 మాత్రమే. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి మూడు వారాల్లోనే వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నంబర్‌ 18 జారీ చేసింది. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు నెలకు రూ. 11,500కు, హెల్పర్లకు రూ. 7 వేలకు పెంచుతూ 2019 జూన్‌ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ప్రభుత్వం అదనంగా అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు చెల్లిస్తోంది.  

సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని..

ap anganwadi jobs news

2013 నుంచి అంగన్‌వాడీలకు పదోన్నతులు లేవు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్‌–2 సూపర్‌ వైజర్‌ పోస్టులను భర్తీ చేసింది. ఈ సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. అంగన్‌వాడీ వర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు కూడా ఇచ్చింది. 56,984 స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలుకు రూ. 85.47 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అదనంగా 1 జీబీ డేటా కూడా ఇస్తోంది.  

అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి..
రూ. 16 కోట్ల ఖర్చుతో ఒక్కో అంగన్‌వాడీ వర్కర్‌కు, హెల్పర్‌కు 6 చొప్పున యూనిఫాం శారీలు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి పర్యవేక్షించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, బీమా సౌకర్యం కల్పించి భరోసా ఇస్తున్నారు. పదవి విరమణ సమయంలో ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది.  

అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ..
నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ నాణ్యంగా కనీస మౌలిక సదుపాయాలను అందించేలా చర్యలు చేపట్టింది. 10,932 అంగన్‌వాడీ కేంద్రాలు (సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోకి రీలొకేట్‌ అయినవి) మౌలిక సదుపాయాలు, తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో రూ. 500 కోట్లతో మిగిలిన 45,000 అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనుల్లో భాగంగా అంగన్‌వాడీ భవనాలకు రిపేర్లు, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌ ఉపకరణాలు, రంగులు, రక్షిత తాగునీరు, గోడలపై బొమ్మలు తదితర పనులు చేపడుతున్నారు. 

అంగన్‌వాడీ వర్కర్లకు..
స్మార్ట్‌ టీవీల ఏర్పాటుతో పాటు పిల్లల్లో నేర్చుకునే విధానాలను మెరుగుపరచడానికి ప్రత్యేక కిట్లు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని 8.5 లక్షల మంది పిల్లలకు ఈ కిట్లను ప్రభుత్వం ఇస్తోంది. దీంతోపాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. అంగన్‌వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమాల ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పిల్లల ఎదుగుదలను పరిశీలించేందుకు రూ.16.04 కోట్ల ఖర్చుతో 19,236 పరికరాలను అంగన్‌వాడీ స్కూళ్లకు ప్రభుత్వం అందిస్తోంది. గ్రోత్‌ మానిటరింగ్‌ పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది.   

గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా టేక్‌ హోం రేషన్‌ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇలా చెప్పుకుంటా పోతే.. అంగన్వాడీ ఉద్యోగుల‌కు ఈ వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం చేసిన మేలు ఏఏ ప్ర‌భుత్వం చేయ‌లేదు అని గ‌ర్వంగా చెప్ప‌గ‌లరు ఈ ఉద్యోగులు.

రూ.3000లకు పెంచుతూ ..
ఆంధ్ర‌ప్ర‌దశ్‌ ప్రభుత్వం పెన్షన్‌దారులకు మ‌రో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్‌ మొత్తాన్ని రూ.3000లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్‌ అమలులోకి రానుంది. ఏపీలో పెన్షన్‌దారులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను రూ.3వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబ‌ర్ 21వ తేదీన‌ గురువారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి రూ.3వేల పెన్షన్‌ అమలులోకి రానుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్నది.

Published date : 22 Dec 2023 06:07PM

Photo Stories