SEAS Survey Exams: విద్యార్థులకు నిర్వహించే సీస్ సర్వే పరీక్షల ఏర్పాట్లు పూర్తి
సాక్షి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో నిర్వహించే సీస్(స్టేట్ ఎడ్యుకేషనల్ అచీమ్‌మెంట్ సర్వే) సర్వే పరీక్షకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని 1361 పాఠశాలలకు సంబంధించి 3,6,9 తరగతులు చదివే 33,690 మంది విద్యార్థులు నేడు(నవంబర్ 3వ తేదీన) పరీక్ష రాయనున్నారు. ఇందుకు సంబంధించిన పరీక్ష పేపర్లు జిల్లాకు చేరాయి. వీటిని ఆయా కాంప్లెక్స్‌ల ద్వారా పాఠశాలకు కూడా చేరవేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
➤ Employment Offer: వీరికి మాత్రమే సబార్డినేట్ పోస్టులు.. కానీ..!
1499 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల నియామకం
సీస్ సర్వే పరీక్ష నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 1361 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసింది. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు నిర్వహించే సర్వేకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ల నియామకం కూడా పూర్తి చేశారు. వీరితోపాటు మరో 68 మంది బ్లాక్ కో ఆర్డినేటర్లును కూడా నియమించారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ , ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 1499 మంది విద్యార్థులను విద్యాశాఖ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా నియమించి వీరికి శిక్షణను కూడా పూర్తి చేశారు.
పర్యవేక్షలు వీరే...
జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో డీసీఈబీ సెక్రటరీ, సమగ్రశిక్ష ఏఎంఓ, డైట్ లెక్చరర్లు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను పరిశీలిస్తారు. మండలస్థాయిలో ఎంఈఓ–1, ఎంఈఓ–2, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సర్వే పరీక్ష నిర్వహణ పర్యవేక్షిస్తారు.
➤ School Inspection: ఈ విద్యార్థులపై ఉపాధ్యాయుల శ్రద్ధ ప్రత్యేకంగా ఉండాలి..
పరీక్ష జరిగే విధానం..
సీస్ సర్వేలో భాగంగా మూడు, ఆరు, తొమ్మిది తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఓఎంఆర్ విధానంలో ఉంటుంది. మూడు, ఆరు తరగతుల విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీపై పరీక్ష ఉంటుంది. 6, 9వ తరగతి విద్యార్థులకు గతేడాది సిలబస్‌పై పరీక్ష ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఉదయం 10.30 గంటలకు పరీక్షను ప్రారంభిస్తారు.
➤ Telugu Talent Test: తెలుగు ప్రతిభ పరీక్షలో మరుపాక విద్యార్థి ద్వితియ స్థానం..
మూడో తరగతి విద్యార్థులకు గంట, ఆరో తరగతి వారికి గంట 15 నిమిషాలు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఒకటిన్నర గంట సమయాన్ని పరీక్ష రాయడానికి కేటాయిస్తారు. ప్రతి తరగతికి ఒక్కో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌ను నియమించారు. వీరితోపాటు హెచ్‌ఎంలు కూడా పర్యవేక్షించనున్నారు.
సామర్థ్యాల అంచనా కోసం...
సీస్ సర్వేలో భాగంగా నిర్వహించే పరీక్ష ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల అంచనా వేసేందుకు వీలవుతుంది. సర్వే ఫలితాలను బట్టి బోధన అభ్యసనాలను పెంపొందించేందుకు ప్రణాళికలను రూపొందించొచ్చు. జిల్లావ్యాప్తంగా 1361 స్కూళ్లలో 33690 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
– అంబవరం ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి.
➤ KL University: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష వివరాలు
ఏర్పాట్లు పూర్తి...
సీస్ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా వచ్చాయి. పరీక్ష స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించాలి. ఉపాధ్యాయులు పిల్లలకు సహకారం అందించకూడదు. ఫీల్ట్ ఇన్వెస్టిగేటర్లు, ప్రధానోపాధ్యాయులు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి వెళేందుకు అనుమతి ఉంటుంది. సీస్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి.
– ఎద్దుల రాఘవరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి