Schools: బడికి డుమ్మా..కుదరదమ్మా..
ఇంగ్లీషు మీడియంతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు పునాదులు వేశారు. విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడాలనే ఉద్దేశంతో డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు వసతుల కల్పన, మరోవైపు విద్యార్థుల హాజరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో 2,213 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,54,789 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం బడులో ఈసారి అడ్మిషన్లు పెరిగాయి. దీంతో విద్యార్థుల పాఠశాలకు సక్రమంగా హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారు.
చదవండి: Free Workbooks: విద్యార్థులకు ఉచితంగా వర్క్‌బుక్స్
అటెండెన్స్ యాప్‌లో నమోదు
విద్యార్థులను పర్యవేక్షించే బాధ్యతను హెచ్‌ఎంలు, వలంటీర్లకు అప్పగించారు. రోజూ విద్యార్థి హాజరును నమోదు చేసేందుకు ‘స్టూడెంట్ అటెండెన్స్ యాప్’తీసుకొచ్చారు. స్కూల్ నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు యాప్‌ను అనుసంధానం చేయడంతో బడికి రాని వారి వివరాలు అన్ని స్థాయిల్లోనూ తెలిసిపోతాయి. విద్యార్థుల కుటుంబాలు మ్యాపింగ్ చేయడం ద్వారా వారి వివరాలు సచివాలయాల్లోనూ ఉంటాయి.
ఎలాంటి సమాచారం లేకుండా వరుసగా మూడు రోజులు పాఠశాలకు వెళ్లకపోతే రారష్ట్‌ర అధికారుల నుంచి సచివాలయాలకు సమాచారం వెళ్తుంది. సంబంధిత వలంటీరు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి గైర్హాజరుపై ఆరా తీస్తారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడికి పంపేలా చూస్తారు. దీంతో పాఠశాలల్లో హాజరుశాతం మెరగువుతోంది. విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతోంది.
చదవండి: Best Schools: ఉత్తమ పాఠశాలగా ‘అబ్దుల్ కలాం’ హైస్కూల్