Skip to main content

UPSC Civils-2023 Notification: 1,105 పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే..

యూపీఎస్‌సీ.. సివిల్స్‌ ఎగ్జామ్‌..పరిచయం అక్కర్లేని పరీక్ష! ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి..అత్యున్నత సర్వీసులకు మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసే.. పరీక్ష! తాజాగా..యూపీఎస్‌సీ సివిల్స్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1,105 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో..సివిల్స్‌æ ఎంపిక విధానం, పోస్ట్‌ల సంఖ్య, భర్తీ చేయనున్న సర్వీసులు, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు..
UPSC Civils-2023 Notification and preparation guidance
  • సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌-2023 నోటిఫికేషన్‌ 
  • 1,105 పోస్ట్‌లు భర్తీ చేయనున్న యూపీఎస్‌సీ
  • ఐఏఎస్, ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్‌ సహా 21 సర్వీసులు
  • ఈ ఏడాది కొత్తగా పాండిచ్చేరి పోలీస్‌ సర్వీస్‌
  • మే 28న తొలి దశ ప్రిలిమినరీ ఎగ్జామ్‌

21 సర్వీసులు..1,105 పోస్ట్‌లు

సివిల్స్‌ 2023 ద్వారా 21 సర్వీసుల్లో మొత్తం 1,105 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. గత ఏడాది సివిల్స్‌-2022 సవరణ నోటిఫికేషన్‌లో చేర్చిన ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. అదే విధంగా పాండిచ్చేరి పోలీస్‌ సర్వీస్‌ గ్రూప్‌-బిని ఈ ఏడాది నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గతేడాది కంటే పోస్ట్‌ల సంఖ్య పెరగడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. గత సంవత్సరం 1,011పోస్ట్‌లనే భర్తీ చేశారు. 

అర్హతలు

  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2023 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు మెయిన్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • వయసు: ఆగస్ట్‌ 1, 2023 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

అయిదు లక్షలకు పైగా

గత కొన్నేళ్లుగా సివిల్స్‌ తొలిదశ ప్రిలిమ్స్‌కు దాదాపు అయిదు లక్షల మంది హాజరవుతున్నారు. వాస్తవానికి దరఖాస్తులు పది లక్షలకు పైగా ఉంటున్నాయి. పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య మాత్రం 50 శాతానికి కొంచెం అటు, ఇటుగా ఉంటోంది. పోస్ట్‌ల సంఖ్యను.. పోటీ పడే వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే.. ఒక్కో పోస్ట్‌కు దాదాపు అయిదు వందల మంది పోటీ పడుతుంటారు. వీరిలో రెండో దశ మెయిన్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య.. 13 వేల వరకు ఉంటోంది. అంటే.. తొలి దశ ప్రిలిమ్స్‌లో రాణించడమే అత్యంత కీలకమైన ఘట్టంగా పేర్కొనొచ్చు.

దరఖాస్తు ఉపసంహరణకు నో ఛాన్స్‌

ఈ ఏడాది సివిల్స్‌లో దరఖాస్తు ఉపసంహరణ అవకాశాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు దరఖాస్తు దశలోనే ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత నెలకొంది. పరీక్ష రాయదలచుకున్న మాధ్యమం, ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌ పేర్కొనడం వంటి విషయాల్లో ముందుగానే పూర్తి స్పష్టత ఏర్పరచుకుని దరఖాస్తుకు ఉపక్రమించాలి.

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

  • సివిల్‌ సర్వీసెస్‌ ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. అవి.. 
  • ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌).

400 మార్కులకు ప్రిలిమ్స్‌

  • సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమ్స్‌ పరీక్ష రెండు పేపర్లలో నాలుగు వందల మార్కులకు నిర్వహిస్తారు. అవి..
  • పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌: 100 ప్రశ్నలు-200 మార్కులు.
  • పేపర్‌-2: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: 80 ప్రశ్నలు-200 మార్కులు; ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌తో నిర్వహిస్తారు.
  • ప్రిలిమ్స్‌ పేపర్‌-1(జనరల్‌ స్టడీస్‌)లో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులను సాధించిన వారిని రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. 
  • పేపర్‌-2లో కనీసం 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన కూడా ఉంది. 
  • ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు.. ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 13 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.

మెయిన్‌ ఏడు పేపర్లు..1750 మార్కులు

  • సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో రెండో దశ పరీక్ష మెయిన్‌లో రెండు లాంగ్వేజ్‌ పేపర్లు, ఒక జనరల్‌ ఎస్సే పేపర్, నాలుగు జనరల్‌ స్టడీస్‌ పేపర్లు, రెండు ఆప్షనల్‌ పేపర్లతో నిర్వహిస్తారు. అర్హత పేపర్లలో సాధించిన మార్కులను తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కానీ వీటిలో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధిస్తేనే మెయిన్‌ ఎగ్జామ్‌లోని మిగతా పేపర్లను మూల్యాంకన చేస్తారు. 
  • అర్హత పేపర్లు: పేపర్‌ ఏ-ఇండియన్‌ లాంగ్వేజ్‌ 300 మార్కులకు, పేపర్‌ బీ-ఇంగ్లిష్‌ 300 మార్కులకు ఉంటాయి. ఇండియన్‌ లాంగ్వేజ్, ఇంగ్లిష్‌ పేపర్లు కేవలం అర్హత పేపర్లే. ఇండియన్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి అభ్యర్థులు 21 భాషల్లో పరీక్ష రాయొచ్చు. ప్రతి పేపర్‌లోనూ తప్పనిసరిగా 25శాతం మార్కులు సాధించాలి.
  • మెయిన్‌.. ర్యాంకింగ్‌ పేపర్స్‌: పేపర్‌ 1 జనరల్‌ ఎస్సే(1)- 250 మార్కులు, పేపర్‌ 2 జనరల్‌ స్టడీస్‌-1(ఇండియన్‌ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ అండ్‌ జాగ్రఫీ ఆఫ్‌ ద వరల్డ్‌ అండ్‌ సొసైటీ) 250 మార్కులకు; పేపర్‌ 3 జనరల్‌ స్టడీస్‌-2(గవర్నెన్స్,కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్‌ జస్టిస్, అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌) 250 మార్కులకు; పేపర్‌-4 జనరల్‌ స్టడీస్‌-3(టెక్నాలజీ, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) 250 మార్కులకు; పేపర్‌-5 జనరల్‌ స్టడీస్‌-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్‌) 250 మార్కులకు; పేపర్‌-6 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-1 ,250 మార్కులకు; పేపర్‌-7 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-2, 250 మార్కులకు ఉంటాయి. 
  • మొత్తం ఏడు పేపర్లలో 1750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్‌ విధానంలో మెయిన్‌ పరీక్ష ఉంటుంది. మెయిన్‌లో అర్హత పేపర్లు కాకుండా.. మిగతా పేపర్లనే మెరిట్‌ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు.
  • మెయిన్‌ ఎగ్జామ్‌ తర్వాత చివరగా పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు.
  • మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు లేదా ముగ్గురిని(1:2 లేదా 1:3 నిష్పత్తిలో) పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. 
  • పర్సనాలిటీ టెస్ట్‌కు కేటాయించిన మార్కులు 275.
  • మెయిన్‌తోపాటు పర్సనాలిటీ టెస్ట్‌లోనూ చూపిన ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ప్రకటించి సర్వీసులు కేటాయిస్తారు.

ప్రిలిమ్స్‌ సన్నద్ధత

తొలిదశ ప్రిలిమ్స్‌లో పేపర్‌-1(జనరల్‌ స్టడీస్‌)లో.. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ ఇంటర్నేషనల్‌ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపర్‌ సీశాట్‌లో.. రీడింగ్‌ కాంప్రహెన్షన్, న్యూమరికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 
విద్యార్థులు బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్,పదోతరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్‌ అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. 

చ‌ద‌వండి: Civils Preliminary Examination Preparation: ముప్ఫై రోజుల్లో.. మెరిసేలా!

సమకాలీనంపై పట్టు

సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం.. గత మూడు, నాలుగేళ్లుగా కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కొంత పెరుగుతున్నాయి. అదేవిధంగా కరెంట్‌ అఫైర్స్‌ అంశాలను కోర్‌ టాపిక్స్‌తో అన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి.

విశ్లేషణాత్మక దృక్పథం

సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పూర్తిగా విశ్లేషణాత్మక దృక్పథంతో ఆయా సబ్జెక్ట్‌లను అధ్యయనం చేయాలి. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే ప్రిలిమ్స్‌ పరీక్షకు కూడా ఈ దృక్పథాన్ని అనుసరించాలి. ఫలితంగా ఒక విషయంపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్‌ ప్రిపరేషన్‌ను సులభతరం చేస్తుంది.

సమ్మిళిత అధ్యయనం

ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు ఒక సబ్జెక్ట్‌ను మరో సబ్జెక్ట్‌తో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఉదాహరణకు పాలిటీనే పరిగణనలోకి తీసుకుంటే.. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లులు.. అవి ఆర్థికంగా, సామాజికంగా ప్రభావం చూపిన పరిస్థితులను ఒకే సమయంలో చదివే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఈ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. గత అయిదారేళ్లుగా ప్రిలిమ్స్‌లో అడుగుతున్న ప్రశ్నల తీరును గమనిస్తే.. ప్రభుత్వం తీసుకున్న శాసన నిర్ణయాలు.. ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటున్నాయి.

వీటికి ప్రాధాన్యం

ప్రిలిమ్స్‌లో అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకాలజీ, జాగ్రఫీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి.

పేపర్‌-2(సీశాట్‌-ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)కు.. ఇలా

అర్హత పేపర్‌గానే పేర్కొంటున్న పేపర్‌-2 ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌పై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్‌లో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్‌-1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్‌ 2 కోసం అభ్యర్థులు బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్‌ దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్‌ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్, ప్రధానంగా అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి.

మెయిన్స్‌తో కలిపి

ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ సమయంలోనే మెయిన్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ప్రస్తుతం సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మెయిన్‌లో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్లు, ఎథిక్స్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్‌ జనరల్‌ స్టడీస్‌లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లను డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో చదివితే మెయిన్‌కు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఒక టాపిక్‌ను నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చదివితే.. ప్రిలిమ్స్‌లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.

ఇలా చేస్తే మేలు
సిలబస్‌పై స్పష్టత

ప్రిలిమ్స్‌ అభ్యర్థులు ముందుగా సిలబస్‌పై స్పష్టత ఏర్పరచుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. దీనిద్వారా సదరు అంశాలకు ఏ స్థాయిలో సమయం కేటాయించాలి? ఏ పుస్తకాలు చదవాలి? అనే విషయాలపైనా స్పష్టత వస్తుంది.

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

ప్రామాణిక పుస్తకాలు

అభ్యర్థులు పుస్తకాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. సిలబస్‌కు అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా ఒకట్రెండు పుస్తకాలకు పరిమితం అవడం మేలు. అదే విధంగా.. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ప్రశ్నల శైలిపైగా అవగాహన పెంచుకోవాలి.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌

నిర్దిష్ట సమయ పాలన పాటిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్‌ సాగించే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా వ్యవహరించాలి.ఒక సబ్జెక్ట్‌ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్‌ చదువుదాం అనే ధోరణి సరికాదు. 

రివిజన్‌కు ప్రాధాన్యం

అభ్యర్థులు సిలబస్‌ అంశాల అధ్యయనంతోపాటు వాటి రివిజన్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే సమయం కేటాయించాలి. అదేవిధంగా మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

పట్టు సాధించాల్సిన అంశాలు

  • చరిత్ర: ఆధునిక చరిత్ర; జాతీయోద్యమం; ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ-సామాజిక- ఆర్థిక చరిత్ర అంశాలు. 
  • పాలిటీ: రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, ముఖ్య రాజ్యాంగ సవరణలు, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్‌ జనరల్,పంచాయతీరాజ్‌ వ్యవస్థ: కేంద్ర-రాష్ట్ర సంబంధాలు; ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన అంశాలు. 
  • ఎకానమీ: ఆర్థికాభివృద్ధిలో సహజవనరులు-మూలధన వనరుల పాత్ర; ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం); ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక-సాంఘికాభివృద్ధి; పారిశ్రామిక తీర్మానాలు-వ్యవసాయ విధానం; నీతి అయోగ్‌; బ్యాంకింగ్‌ రంగం ప్రగతి-సంస్కరణలు; తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు; ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: పరీక్షకు ముందు ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు-కారకాలు; ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్‌ ప్రయోగాలు; ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు; ఏడాది కాలంలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు.

చ‌ద‌వండి: Science & Technology Preparation: సబ్జెక్ట్‌ ఒకటే అయినప్పటికి.. అడిగే ప్రశ్నల తీరులో భేదం...

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: ఫిబ్రవరి 22-28, 2023
  • ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: మే 28, 2023
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/
Published date : 13 Feb 2023 05:10PM

Photo Stories