Skip to main content

NEET-UG Re-Exam Tomorrow: ఆ విద్యార్థులకు రేపు మరోసారి నీట్‌-యూజీ పరీక్ష.. పకడ్బందీగా ఏర్పాట్లు

NEET-UG Re-Exam Tomorrow

దేశవ్యాప్తంగా నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. పరీక్షలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ,  పేప‌ర్ లీక్ అయ్యిందంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  మరోవైపు గ్రేస్‌ మార్కులు తొలగించిన విద్యార్ధులకు మళ్లీ నీట్‌ పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతుది.  గ్రేస్‌ మార్కులు తొలగించిన 1563 మంది విద్యార్ధులకు ఎన్టీఏ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ)రేపు మరోసారి నీట్‌ పరీక్షను నిర్వహించనుంది.

Anti-paper Leak Act : అమలులోకి పేపర్‌ లీక్‌ నిరోధక చట్టం.. జైలు శిక్ష, జరిమానాలు ఇలా..

ఇందుకు సంబంధించి ఇప్పటికే అడ్మిట్‌ ‍కార్డులను విడుదల చేసింది. రేపు జరగనున్న నీట్‌ రీ ఎగ్జామినేషన్‌ పరీక్షా కేంద్రాలకు NTA సహా, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఈసారి పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే5న, 571 నగరాల్లో నీట్‌-యూజీ 2024 పరీక్షను నిర్వహించారు. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, జూన్‌4న ఫలితాలు వెలువడ్డాయి.

ఇక అప్పటినుంచి నీట్‌పై వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు మారడంతోపాటు మేఘాలయా, హరియాణా, ఛత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లోని మొత్తం ఆరు ఎగ్జామ్‌ సెంటర్లలో ఓఎంఆర్‌ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌ ఇవ్వడం, తద్వారా పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు.

Neet Paper Leak Updates: 'నీట్‌' పేపర్‌ లీకేజీ.. పరీక్షకు 48 గంటల ముందే అమ్మకం

అయితే ఫలితాల్లో మొత్తం 67 మందికి 720కి 720 మార్కులు రావడం, ఫస్ట్ట్‌ ర్యాంకు సాధించిన 67 మందిలో గ్రేసు మార్కులతో ర్యాంకు సాధించడంతో వివాదం చెలరేగింది. దీంతో గ్రేస్‌ మార్కులు రద్దు చేసి మళ్లీ తిరిగి పరీక్ష నిర్వహిస్తామన్న ఎన్టీఏ సిఫార్సుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో రేపు నీట్‌ ఎగ్జామ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈనెల 30న ఫలితాలు వెల్లడికానున్నాయి.
 

Published date : 24 Jun 2024 08:56AM

Photo Stories