Skip to main content

Anti-paper Leak Act : అమలులోకి పేపర్‌ లీక్‌ నిరోధక చట్టం.. జైలు శిక్ష, జరిమానాలు ఇలా..

ExamLeakagePrevention   అమలులోకి పేపర్‌ లీక్‌ నిరోధక చట్టం.. జైలు శిక్ష, జరిమానాలు ఇలా  PublicExaminationsAct2024
Anti-paper Leak Act : అమలులోకి పేపర్‌ లీక్‌ నిరోధక చట్టం.. జైలు శిక్ష, జరిమానాలు ఇలా..

ఢిల్లీ: నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కేంద్రంపై తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పేపర్‌ లీకేజీలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను అమల్లోకి తెచ్చింది.

కాగా, పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌ 2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్‌ 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీన్ని చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు.

ఇక, గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశ్నించగా.. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read:  'నీట్‌' పేపర్‌ లీకేజీ.. పరీక్షకు 48 గంటల ముందే అమ్మకం

ఇదిలా ఉండగా, కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ సమయంలో దీనికి కారణమైన వారికి 5-10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక, ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్‌ లీకేజీ కేసులను ఈ చట్టానికి లోబడే కేసులు నమోదు చేయనున్నారు. 
 

Published date : 22 Jun 2024 10:50AM

Photo Stories