Skip to main content

Fake Jobs: ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారా...జర వీళ్లతో జాగ్రత్త...!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకు చాలా డిమాండ్‌ ఉంది. చాలా మంది నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో వివిధ రూపాలలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటారు.

ఈ తరుణంలో కొందరు కేటుగాళ్లు టెక్నాలజీ ఉపయోగించుకొని నిరుద్యోగులను బురిడి కొట్టించేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వీరి మాయలో పడి చాలా మంది లక్షల రూపాయలు పొగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. వీళ్లు చేసే స్కామ్‌లను గుర్తించండిలా..

స్కామ్‌లను ఇలా గుర్తించవచ్చు..
➤ సంభాషణల్లోనే ఇంటర్వ్యూ అంటూ, ఆ వెంటనే ఉద్యోగం వస్తుందని త్వరపెడతారు. 
➤ మెసేజ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు చేస్తారు. ∙నిజానికి ఏ కంపెనీలు ఉద్యోగం పేరిట డబ్బు అడగవు.సెక్యూరిటీ డిపాజిట్‌ లేదా సర్వీస్‌ ఫీజు చెల్లించమని కోరవు. 
➤ అనేక స్కామ్‌ ఇ–మెయిల్‌లు నిజమైన కంపెనీల నుంచి వచ్చినట్లు కనిపిస్తాయి. కానీ, అవి వృత్తి పరమైనవి కావు. 
➤ వారి అధికారిక డొమైన్‌ ఇ–మెయిల్‌లకు బదులు గూగుల్‌/యాహూ ఖాతాల నుండి మెయిల్స్‌ వస్తాయి.
➤ ఉదాహరణకు: jobs@bankofamerica.com కు బదులు  jobs@bankof-america.com ఇలా ఏదో ఒక లెటర్‌ తేడాతో ఇ–మెయిల్‌ ఉంటుంది. విరామచిహ్నాలు, కామాలు, పుల్‌స్టాప్‌లు, పేరాలు, వ్యాకరణ దోషాలు.. వంటివి ఉంటాయి.  ఇ–మెయిల్‌ ఐడీ కూడా నకిలీది ఇవ్వచ్చు. 
➤ తనిఖీ సాకుతో మన వ్యక్తిగత సమాచారాన్ని (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్‌ కాపీలు) ఇవ్వమని అడిగితే, చట్టబద్ధమైన ఇ–మెయిల్‌ ఐడికి మాత్రమే పంపించామా లేదా అనేది నిర్ధారించుకోవాలి.

కొన్ని ఆన్‌లైన్‌ జాబ్‌ స్కామ్‌లు..
➤ అర్హత లేకపోయినా అధికారిక ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారానే ఉద్యోగం పొందవచ్చని చెబుతారు. సులభమైన ఆఫీసు పనిని ఇంటి నుంచే చేయవచ్చని ఆఫర్‌ చేస్తారు. 
➤ పెనాల్టీ క్లాజ్‌ ఉన్న సాధారణ డేటా ఎంట్రీ ఉద్యోగం చేయడానికి ఒప్పంద పత్రంపై సంతకం చేయమని, ఇరకాటంలో పెడతారు. ∙కొన్ని సాధారణ పనుల ద్వారానే (ఫాలో, లైక్, షేర్, కామెంట్‌..) ఆదాయం పొందవచ్చనే ఆఫర్‌ ద్వారా ఆకర్షణకు లోనుచేస్తారు. 
➤ విదేశాలలో విద్య/ఉద్యోగం.. వీసా గ్యారెంటీతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తారు.

జాబ్‌ స్కామ్‌లో చిక్కుకోకుండా ఉండాలంటే.. 
ఫీజు కోసం అంటూ ముందస్తుగా డబ్బు చెల్లించవద్దు. ఇంటి నుంచి ఆన్‌లైన్‌ వర్క్‌ చేయడానికి మీరు డబ్బు చెల్లించని పనిని తీసుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంపించవద్దు. ఒక చిన్న పని కోసం కంపెనీ పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్‌ చేస్తుందంటే, అస్సలు నమ్మద్దు. ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఇవ్వద్దు. అలా ఇచ్చే సందర్భాలలో ఆ కంపెనీలలో పని చేసే, మీతో పాటు చదువుకున్న స్నేహితుల సూచనలు తీసుకోవడం మంచిది.
                                             – అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

Published date : 23 Sep 2021 02:19PM

Photo Stories