Jobs: ఉద్యోగాలు ఇప్పిస్తామని.. రూ.1.93 కోట్లు వసూలు
బాధితుల నుంచి జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ అర్జీలు స్వీకరించారు. వారి గోడుని ఆలకించారు. నిర్దేశించిన గడువులోగా సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆయన ఆదేశించారు. మహిళల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా ఏఎస్పీ (క్రైం) ఎ.శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ పి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ బాలసుందరరావు అర్జీలు స్వీకరించారు.
టీచర్ పోస్టులు ఇప్పిస్తానని.. రూ.1.93 కోట్లు వసూలు
సుమారు ఐదేళ్లకుపైగా ప్రకాశం జిల్లా పొదిలి వాసితో నాకు పరిచయం ఉంది. సీబీసీఎన్‌సీ సంస్థలో ఎయిడెడ్ టీచర్ పోస్టులు ఇప్పిస్తానని అతను నమ్మించాడు. కృష్ణా జిల్లాలో పలుకుబడి ఉందని, సంస్థ కన్వీనర్ తెలుసునని, ఏడాదిలోపు పోస్టులు వస్తాయని చెప్పాడు. అతని మాటలు నమ్మి నా ద్వారా సుమారు 40 మంది రూ.1.93 కోట్లు దఫాల వారీగా అతనికి చెల్లించారు. ఏళ్లు గడిచినా పోస్టులు ఇప్పించలేదు. బాధితులు నా ఇంటికొచ్చి గొడవ చేయడంతో..రూ.20 లక్షలు వరకు కొందరికి చెల్లించాను. అయినప్పటికీ వారి నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో సదరు వ్యక్తిని నిలయదీగా.. నియమాక పత్రాలు అందజేశాడు. అవి నకిలీవని తేలింది. తిరిగి డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడు.
– బి.నాగమల్లేశ్వరరావు, రిటైర్డ్ టీచర్, రత్నపురి కాలనీ, గుంటూరు టౌన్.
జూనియర్ అసిస్టెంట్, హోంగార్డు ఉద్యోగాలిస్తానని..
సుమారు నాలుగేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఒకరు పరిచయమయ్యారు. వెలగపూడి సచివాలయంలో మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, పది హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 15 రోజుల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. దీంతో నా ద్వారా పలువురితో కలిసి అతనికి రూ.8.50 లక్షలు చెల్లించాం. ఏళ్లు గడిచినా ఉద్యోగాల్లేవు. తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడు. అతనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. బాధితుల్లో ఒకరు.. నామీద.. అలాగే మోసగించిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో మోసగించిన వ్యక్తిని వదిలేసి నన్ను అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది.
– కొండెపాటి రవీంద్రబాబు, అబ్బినేనిగుంటపాలెం, పెదనందిపాడు.