Skip to main content

JOSAA Counselling 2022 : జోసా కౌన్సెలింగ్‌ ముఖ్యమైన‌ తేదీలు ఇవే.. ఇలా చేయకపోతే మీ సీటు రద్దు..

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్స్‌(జీఎఫ్‌టీఐ)ల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ తదితర ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి కౌన్సెలింగ్‌ విధానమే.. జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ(జోసా).

23 ఐఐటీలు సహా మొత్తం 114 ఇన్‌స్టిట్యూట్స్‌లో సీట్ల భర్తీకి ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఈ ఏడాది ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్ 12వ తేదీ(సోమ‌వారం) నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో.. జోసా–2022 విధానం, ఐఐటీలు, నిట్‌లు సహా ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్న సీట్లు, కోర్సులు తదితర అంశాలపై విశ్లేషణ.. 

JEE Advanced 2022 Result : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. క్వాలిఫయింగ్‌ మార్కులు ఇంతేనా..?

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 ఉత్తీర్ణులు ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనొచ్చు. అదే విధంగా జేఈఈ మెయిన్‌ 2022(బీఈ/బీటెక్‌ పేపర్‌), జేఈఈ మెయిన్‌ బీఆర్క్‌/బీప్లాన్‌ పేపర్‌ ఉత్తీర్ణులు.. నిట్‌లు , ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకొని కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. 

సీట్ల కేటాయింపు ఇలా..

JEE
జోసా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ విధానంలో.. విద్యార్థులు ఎంచుకున్న ప్రాథమ్యాలు, వారి ర్యాంకు ఆధారంగా.. అర్హులకు ఆన్‌లైన్‌లోనే సీటు కేటాయిస్తారు. ఇలా సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే సీట్‌ యాక్సెప్టెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్దేశిత సీట్‌ యాక్సెప్టెన్స్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు.. సంబంధిత సర్టిఫికెట్లను కూడా అప్‌లోడ్‌ చేయాలి.

చదవండి: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

రిజిస్ట్రేషన్‌కి ఇవి తప్పనిసరి..
➤ జోసా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా..జోసా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని తమ వివరాలు పొందుపరచాలి. ఆ తర్వాత తమ ఆసక్తి మేరకు కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌ ప్రాథమ్యాలను ఆన్‌లైన్‌లోనే పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ప్రాథమ్యాలను పేర్కొనడాన్నే ఛాయిస్‌ ఫిల్లింగ్‌ అని పిలుస్తారు.
➤ ఆన్‌లైన్‌లో ప్రాథమ్యాలను పేర్కొన్న తర్వాత.. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌.. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది. 
➤ ఈ ప్రాథమ్యాల వరుస క్రమం ప్రకారం–అభ్యర్థులు పొందిన మార్కులు,ర్యాంకు,అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీటు ఖరారు చేస్తారు.

చదవండి: Best Engineering Branch: బీటెక్‌... కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక ఎలా

కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇలా..

Counselling

జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం ఆరు రౌండ్లలో పూర్తవుతుంది. అభ్యర్థులు మొదటి రౌండ్‌ నుంచి ఆరో రౌండ్‌ వరకు..కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మొదటి రౌండ్‌లో లభించిన సీటు, ఇన్‌స్టిట్యూట్‌పై ఆసక్తి లేకపోతే.. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు తమ దరఖాస్తును పరిగణించే విధంగా.. తదుపరి రౌండ్లలో కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. అభ్యర్థులకు.. ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్‌ అనే.. మూడు అవకాశాలు అందుబాటులో ఉంటాయి. 
ఫ్రీజ్ : విద్యార్థులు తొలి రౌండ్‌లోనే తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్, కోర్సుతో సంతృప్తి చెందితే.. ఫ్రీజ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో తదుపరి రౌండ్లకు విద్యార్థుల ఛాయిస్‌లను పరిగణనలోకి తీసుకోరు. తొలిదశలో సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌లోనే సీట్‌ యాక్సెప్టెన్స్‌ తెలియజేయాల్సి ఉంటుంది. 
ఫ్లోట్ : మొదటి రౌండ్‌లో వచ్చిన సీటు నచ్చకపోతే.. మరింత మంచి ఇన్‌స్టిట్యూట్‌ లేదా బ్రాంచ్‌ కోసం ఆసక్తి చూపితే ఫ్లోటింగ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫలితంగా ఆ విద్యార్థి ప్రాథమ్యాలను తదుపరి రౌండ్లకు పరిగణనలోకి తీసుకుంటారు. 
స్లైడ్ : మొదటి రౌండ్‌లోనే నిర్దిష్టంగా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక బ్రాంచ్‌లో సీటు వచ్చిన విద్యార్థి.. అదే ఇన్‌స్టిట్యూట్‌లో మరో బ్రాంచ్‌లో సీటు కోరుకుంటే.. స్లైడింగ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
    ఇలా ఫ్లోటింగ్, స్లైడింగ్‌ ఆప్షన్‌లు పేర్కొనడం వల్ల అభ్యర్థులకు చివరగా కేటాయించిన సీట్లే ఖరారవుతాయి. తొలి దశలో లేదా అంతకుముందు దశల్లో వచ్చిన సీట్లు రద్దవుతాయి.

చదవండి: ఎన్‌ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు

రిజిస్ట్రేషన్‌ నుంచి ఛాయిస్‌ ఫిల్లింగ్‌ వరకు ఇలా..

JEE Counselling type

జోసా ప్రక్రియలో భాగంగా విద్యార్థులు ముందుగా జోసా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, లాగిన్‌–ఐడీ, పాస్‌వర్డ్‌లను క్రియేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రోగ్రామ్‌లు, సీట్ల, తమకు వచ్చిన ర్యాంకు బేరీజు వేసుకుంటూ.. తమ ఆసక్తికి అనుగుణంగా ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఇలా ఆన్‌లైన్‌లో నిర్దేశిత గడువు తేదీలోగా ఛాయిస్‌ ఫిల్లింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులకు.. ముందుగా.. వారిచ్చిన ప్రాథమ్యాల ఆధారంగా మాక్‌ సీట్‌ అలొకేషన్‌(నమూనా సీటు కేటాయింపు) వివరాలను అందుబాటులో ఉంచుతారు. అంటే.. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీటు వచ్చే అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, బ్రాంచ్‌ల వివరాలు తెలుస్తాయి. 
➤ మాక్‌ సీట్‌ అలొకేషన్‌ జాబితాను చూసుకున్న విద్యార్థులు.. తమ ర్యాంకుకు ఇంకా మంచి ఇన్‌స్టిట్యూట్‌లో సీటు వస్తుందనుకుంటే.. తమ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇలా.. ఈ ఏడాది రెండుసార్లు మాక్‌ సీట్‌ అలొకేషన్‌ జాబితాను అందుబాటులో ఉంచనున్నారు.

Jee Advanced 2022: ఇన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం

ఇలా చేయకపోతే సీటు రద్దు..
జోసా ప్రక్రియలో తమకు కేటాయించిన సీటుకు యాక్సెప్టెన్స్‌ ఇవ్వకపోతే సీటు రద్దవుతుంది. ప్రతి రౌండ్‌ సీట్‌ అలొకేషన్‌ తర్వాత నిర్దిష్ట గడువులోగా విద్యార్థులు తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌కు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. 

యాక్సెప్ట్, విత్‌డ్రా అవకాశం..
జోసా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో.. యాక్సెప్ట్, విత్‌ డ్రా అవకాశం కూడా ఉంది. తమ ప్రాథమ్యాల ప్రకారం–సీట్లు లభించిన విద్యార్థులు..ప్రతి రౌండ్‌ తర్వాత సీటు యాక్సప్టెన్స్‌ లేదా ఉపసంహరణ విషయాన్ని స్పష్టం చేయాలి. మొత్తం ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌లో అయిదో రౌండ్‌ వరకే ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చివరి రౌండ్‌(ఆరో రౌండ్‌)లో ఈ ఉపసంహరణ అవకాశం ఉండదు.

చదవండి: JEE-Advanced 2022: జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2022 ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

సీట్‌ యాక్సప్టెన్స్‌ ఫీజు : 
జోసా కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా సీట్‌ యాక్సప్టెన్స్‌ ఫీజును చెల్లించాలి. దీన్ని కూడా ఆన్‌లైన్‌ విధానంలో నెట్‌ బ్యాంకింగ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ లేదా ఎస్‌బీఐ ఈ–చలాన్‌ రూపంలో మాత్రమే చెల్లించాలి. తర్వాత దశలో చివరగా తాము ప్రవేశం పొందిన ఇన్‌స్టిట్యూట్‌కు అనుగుణంగా అకడెమిక్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అకడెమిక్‌ ఫీజుల్లోంచి అప్పటికే చెల్లించిన యాక్సప్టెన్స్‌ ఫీజును మినహాయిస్తారు.

ఐఐటీల్లో ఇంజనీరింగ్‌పై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి

23 ఐఐటీలు.. 16,598 సీట్లు : 
☛ మొత్తం 23 ఐఐటీల్లో 16,598 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది కూడా మహిళా విద్యార్థులకు 20 శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు కేటాయించనున్నారు. 
☛ జేఈఈ–మెయిన్‌ ర్యాంకుతో సీట్ల భర్తీ చేసే 31 ఎన్‌ఐటీలలో..23,994 సీట్లు, 26 ట్రిపుల్‌ ఐటీల్లో 7,126సీట్లు,33ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో 6,759సీట్లు అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్‌ టెక్నికల్‌ కోర్సులు ఇవే..
ఐఐటీల్లో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, మెటలర్జికల్‌ వంటి కోర్సులతోపాటు లేటెస్ట్‌ టెక్‌ బ్రాంచ్‌లుగా పేరు పొందుతున్న ఏఐ అండ్‌ ఎంల్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌ వంటివి కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటితోపాటు ఇటీవల కాలంలో పలు ఐఐటీలు మెడిటెక్‌ కోర్సులను కూడా అందిస్తున్నాయి. బయోటెక్నాలజీ, బయోమెడికల్‌ ఇంజనీరింగ్, బయోసైన్స్‌ వంటి కోర్సులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే దాదాపు 30కి పైగా బ్రాంచ్‌లతో ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

చదవండి: JEE Advanced: జేఈఈ అడ్వాన్స్ డ్‌లో ఈ మార్కులొసై సీటు గ్యారెంటీ..

జోసా–2022.. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ముఖ్య తేదీలు ఇవే..:JEE imp dates
☛ సెప్టెంబర్ 12 : జోసా వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రక్రియ ప్రారంభం. 
☛ సెప్టెంబర్ 18 : మాక్‌ సీట్‌ అలొకేషన్‌(సీట్ల కేటాయింపు నమూనా జాబితా) –1 విడుదల (సెప్టెంబర్‌ 18 రాత్రి పది గంటల వరకు అభ్యర్థులు పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా దీన్ని విడుదల చేస్తారు).
☛ సెప్టెంబర్ 20 : మాక్‌ సీట్‌ అలొకేషన్‌(సీట్ల కేటాయింపు నమూనా జాబితా)–2 విడుదల(ఈ జాబితాను సెప్టెంబర్‌ 19 సాయంత్రం అయిదు గంటల వరకు పేర్కొన్న ప్రాథ్యమాల ఆధారంగా వెల్లడించనున్నారు).
☛ సెప్టెంబర్ 21 : ఛాయిస్‌ ఫిల్లింగ్, క్యాండిడేట్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ. 
☛ సెప్టెంబర్ 22 : వివరాల పునర్‌ సమీక్ష, పరిశీలన.
☛ సెప్టెంబర్ 23 : మొదటి రౌండ్‌ సీట్ల కేటాయింపు.
☛ సెప్టెంబర్‌ 23–26 : మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయాలి. అదే విధంగా యాక్సప్టెన్స్‌ ఫీజును చెల్లించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. 
☛ సెప్టెంబర్ 28 : రెండో దశ సీట్ల కేటాయింపు
☛ సెప్టెంబర్‌ 28–అక్టోబర్ 1 : రెండో రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్ల అప్‌లోడ్‌. రెండో రౌండ్‌లో పొందిన సీటు విషయంలో ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నుంచి విరమించుకునే అవకాశం.
☛ అక్టోబర్‌–3 : మూడో రౌండ్‌ సీట్ల కేటాయింపు.
☛ అక్టోబర్‌ 3–6 : మూడో రౌండ్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌.
☛ అక్టోబర్‌ 5–7 : మూడో రౌండ్‌ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నుంచి ఉపసంహరణ.
☛ అక్టోబర్ 8 : నాలుగో రౌండ్‌ సీట్ల కేటాయింపు.
☛ అక్టోబర్‌ 8–10 : నాలుగో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు పేమెంట్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌. 
☛ అక్టోబర్‌ 8–11 : నాలుగో రౌండ్‌ తర్వాత సీటు ఉపసంహరణ లేదా కౌన్సెలింగ్‌ నుంచి ఉపసంహరణ అవకాశం.
☛ అక్టోబర్ 12 : అయిదో రౌండ్‌ సీట్ల కేటాయింపు.
☛ అక్టోబర్‌ 12–14 : అయిదో రౌండ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, డాక్యుమెంట్‌ అప్‌లోడ్, ఫీజు పేమెంట్‌. 
☛ అక్టోబర్‌ 12–15 : అయిదో రౌండ్‌ తర్వాత సీటు విత్‌డ్రా లేదా కౌన్సెలింగ్‌ నుంచి ఉపసంహరణ అవకాశం.
☛ అక్టోబర్‌16 : ఆరో రౌండ్‌(చివరి రౌండ్‌) సీట్ల కేటాయింపు.
☛ అక్టోబర్‌16–17 : ఆరో రౌండ్‌లో పొందిన సీటుకు సంబంధించి ఆన్‌లైన్‌ రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు.
వెబ్‌సైట్‌: https://josaa.nic.in

JOSAA Counselling 2022 : ఆప్షన్స్‌ ఇచ్చే టైమ్‌లో ఈ చిన్న పొరపాట్లు చేయ‌కండిలా.. ఎందుకంటే..?

Published date : 12 Sep 2022 05:14PM

Photo Stories