Polity for Groups Exams : గ్రూప్స్ పరీక్షల్లో అత్యంత కీలకం.. గాంధీజీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం
భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం
నెహ్రూ నివేదిక (1928)
భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ 1927 నవంబర్‌లో బ్రిటన్ ఎగువసభలో మాట్లాడుతూ ‘అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపోందించగలరా?’ అని సవాలు విసిరారు. ఈ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928 మే 19న బొంబాయిలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. 1928 ఆగస్టు 10న రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని నియమించింది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దీనికి కార్యదర్శిగా పనిచేశారు.
ముఖ్యాంశాలు
☛ భారతదేశానికి డొమినియన్ (స్వయంప్రతి పత్తి) ఇవ్వడం.
☛ భాషాప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే అంశాల ఆధారంగా దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం.
☛ కార్యనిర్వాహక శాఖ.. శాసన శాఖకు బాధ్యత వహించడం.
☛ అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసనమండళ్లలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానా లను కేటాయించడం.
☛ 19 ప్రాథమిక హక్కులను కల్పించడం.
గమనిక: మొదటిసారిగా ప్రాథమిక హక్కులను సూచించింది – నెహ్రూ రిపోర్టు.
1929లో బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సైమన్ కమిషన్ నివేదిక, భారత్‌లో రాజ్యాంగపరమైన సంస్కరణలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశారు. నాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్ సే మెక్‌డొనాల్డ్ చొరవతో రాజప్రతినిధి (వైస్రాయ్) ఇర్విన్‌ను ఇంగ్లండ్‌కు రప్పించారు. భారతీయుల సమస్యల గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇందులో ΄ాల్గొనడానికి అన్ని పార్టీలు, వర్గాలకు ఆహ్వానం వస్తుందని మెక్‌డొనాల్డ్ ఒక ప్రకటన చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం
1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్‌లో జరిగింది. ఇందులో 89 మంది ప్రముఖ రాజ నీతిజ్ఞులు పాల్గొన్నారు. కానీ భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. ఈ సమావేశంలో ‘భావి భారత రాజ్యాంగం సమాఖ్యగా ఉండాలా? లేదా ఏక కేంద్రంగా ఉండాలా?’ అనే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పాల్గొనకపోవడం వల్ల చర్చలో వాస్త వమైన ప్రగతి సాధ్యం కాలేదు. సమావేశంలో పాల్గొనని ప్రజా వర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి మెక్‌డొనాల్డ్ సమావేశాన్ని ముగించారు.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ముస్లిం లీగ్ తరఫున జిన్నా, అగాఖాన్, మహ్మద్ అలీ, మహ్మద్ షా, ఫజల్ హక్; హిందూ మహాసభ తరఫున మూంజే, జయకర్; ఉదారవాదుల తరఫున తేజ్ బహుదూర్ సప్రూ, చింతామణి, శ్రీనివాస శాస్త్రి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్; హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ ΄ాల్గొన్నారు.
రెండో రౌండ్ టేబుల్ సమావేశం
1931 సెప్టెంబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు లండన్‌లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇర్విన్‌తో చేసుకున్న ఒడంబడిక ప్రకారం కాంగ్రెస్ తరఫున గాంధీజీ ఈ సమావేశానికి హాజ రయ్యారు. ఇందులో అన్ని స్వదేశీ సంస్థానాధిప తులతో పాటు 107 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు, బలహీన వర్గాల తరఫున డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రావిన్సులను (నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్, సింధ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీజీ దీన్ని ‘విభజించు, ΄ాలించు’ విధానంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించారు. అల్పసంఖ్యాక వర్గాల సమస్యపై ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. బ్రిటిష్ ప్రధా నమంత్రి, తాను దారులు వేరయ్యే చోటుకే వచ్చా నని గాంధీజీ ప్రకటించారు.
కమ్యూనల్ అవార్డు (1932)
మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించి నాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ 1932 ఆగస్టు 4న ఒక ప్రతి΄ాదన చేశారు. దీన్ని ‘కమ్యూ నల్ అవార్డు’ అంటారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్డ్ కులా లకు కూడా ప్రత్యేక నియోజక గణాలను ప్రతి పాదించారు. దీన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమర్థించారు. మహాత్మాగాంధీ దీన్ని వ్యతిరేకిస్తూ పుణేలోని ఎరవాడ కారాగారంలో 1932 సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాజాజీ, మదన్‌మోహన్ మాలవ్య లాంటి నాయకులు చొరవ తీసుకొని అంబేద్కర్, గాంధీజీతో చర్చించి దీక్షను విరమింపజేశారు. 1932 సెప్టెంబర్‌లో ‘పుణే ఒప్పందం’ కుదిరింది. తద్వారా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు అవకాశాలు లభించాయి.
☛ Follow our Instagram Page (Click Here)
మూడో రౌండ్ టేబుల్ సమావేశం
1932 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 24 వరకు లండన్‌లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తారని భావించిన వారెవరికీ ఆహ్వానం పంపలేదు. అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు. ఇంగ్లండ్‌లోని లేబర్ పార్టీ కూడా దీనికి సహకరించలేదు. ఇందులో అంతకు ముందు నియమించిన ఉపసంఘాల నివేదికలపై చర్చించారు. ఈ సమావేశంలో చేసిన సిఫార్సులకు సంబంధించిన అనేక అంశాలను 1935 భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరిచారు. ఈ సమావేశానికి కేవలం 46 మంది ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.
భారత ప్రభుత్వ చట్టం–1935
బ్రిటిషర్లు రూపోందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాలన్నింటిలో ఇది వివరణాత్మకమైంది, సుదీర్ఘ మైంది. 1937 ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలు ఉన్నాయి.
ముఖ్యాంశాలు
☛ అఖిల భారత సమాఖ్య ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో 11 రాష్ట్రాలు, 6 చీఫ్ కమిషనర్ల ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.
☛ కేంద్రం, రాష్ట్రాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన ఉంటుంది. కేంద్ర జాబి తాలో 59, రాష్ట్ర జాబితాలో 54, ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉంటాయి.
☛ అవశిష్ట అధికారాలను వైస్రాయ్‌కి ఇచ్చారు. స్వదేశీ సంస్థానాలు ఈ సమాఖ్యలో చేరక పోవడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
☛ రాష్ట్రాల్లోని ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దుచేసి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వుడు, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు.
☛ గవర్నర్ జనరల్.. రిజర్వుడు అంశాలను తా ను నియమించిన ముగ్గురు కౌన్సిలర్ల సహాయంతో పాలిస్తాడు. ట్రాన్స్‌ఫర్డ్ అంశాల కోసం ఒక మంత్రిమండలిని నియమించి, దీని సహాయంతో ΄ాలనను పర్యవేక్షిస్తారు. ఈ మంత్రిమండలిలో సభ్యులు 10 మందికి మించకూడదు.
☛ రాష్ట్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశంలోని మొత్తం 11 రాష్ట్రాలకుగాను ఆరు (బెంగాల్, బొంబాయి, మద్రాసు, బిహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్స్) రాష్ట్రాల్లో దీన్ని ప్రవేశపెట్టారు.
☛ భారత రాజ్య కార్యదర్శికి ఉన్న కౌన్సిల్‌ను రద్దుచేశారు. ఇతడికి సహాయకంగా ముగ్గురి కంటే తక్కువ కాకుండా, ఆరుగురికి మించకుండా సలహాదార్లను నియమించారు.
☛ కేంద్ర శాసనసభల పరిమాణాన్ని పెంచారు. సభ్యుల సంఖ్యను ఎగువసభ (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్)లో 260కి, దిగువ సభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ)లో 375కు పెంచారు.
☛ Join our Telegram Channel (Click Here)
☛ కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని కొనసాగించారు. ఈ సదుపాయాన్ని షెడ్యూల్డ్ కులాలవారికి, మహిళలకు వర్తింపజేశారు.
☛ ఓటు హక్కును విస్తృతపరిచారు. జనాభాలో 10 శాతం మందికి ఓటు హక్కు వర్తింపజేశారు.
☛ కేంద్ర, రాష్ట్రాల మధ్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టు (సుప్రీంకోర్టు)ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. అయితే దీని తీర్పులే సర్వోన్నతం కాదు. వీటిపై ఇంగ్లండులో ఉండే ప్రివికౌన్సిల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
☛ ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరు చేశారు. అదేవిధంగా ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ ΄ార్లమెంట్ సర్వాధిపత్యాన్ని పునరుద్ఘాటించారు.
☛ కేంద్రంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు. భారతదేశంలో విత్త విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
చట్టం ప్రాముఖ్యత: ఈ చట్టం ద్వారా పొందుపరచిన అత్యంత ముఖ్యమైన అంశం ప్రాంతాల స్వయంప్రతిపత్తి’. దీని ద్వారా మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభు త్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల ఆధీనంలోకి బదిలీ చేశారు. కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది. గవర్నర్లను రాష్ట్రాలకు రా జ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించారు.
ముఖ్యాంశాలు
☛ బానిసత్వానికి ఒక నూతన చట్టం, భారతదేశంపై బలవంతంగా రుద్దారు. ఇంజన్ లేకుండా కేవలం గట్టి బ్రేకులున్న యంత్రం. – జవహర్‌లాల్ నెహ్రూ
☛ భారతదేశంలో గోచరించే భూస్వామ్య వ్యవ స్థను దృఢం చేయడానికి బ్రిటిష్ ΄ాలకులు ఆడిన నాటకం. – సుభాష్ చంద్రబోస్
☛ కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకారమైంది. – జిన్నా
☛ ఈ చట్టాన్ని మా మీద బలవంతంగా రుద్దారు. బాహ్యంగా దీనికి కొంత ప్రజాస్వామ్య రూపం ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం అంతా శూన్యం.
– పండిట్ మదన్‌మోహన్ మాలవ్య
☛ ఈ చట్టం ద్వారా వైస్రాయ్‌కి ముస్సోలిని, హిట్లర్‌ను తలపించే నియంతృత్వ అధికారాలు ఇచ్చారు. ఇది పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం.
– విన్‌స్టన్ చర్చిల్
☛ Join our WhatsApp Channel (Click Here)
లిన్‌లిత్‌గో ఆగస్టు ప్రతిపాదనలు
భారత వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో 1940 ఆగస్టు 8న కొన్ని ప్రతి΄ాదనలను చేశాడు.
ముఖ్యాంశాలు
☛ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలించడం. రాజకీయ పార్టీల ప్రాతినిధ్యంతో రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం.
☛ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతి నిధులకు గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతం చేయడం.
☛ రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం.
☛ అన్ని రాజకీయ పార్టీలు, సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలి ఏర్పాటు చేయడం.
ఈ ప్రతిపాదనలను రాజకీయ పార్టీలు తిరస్కరించాయి.
క్రిప్స్ ప్రతిపాదనలు (1942)
బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ 1942 మార్చి 11న ఒక ప్రకటన ద్వారా భారత రాజ్యాంగ సమస్య విషయంలో అక్కడి నాయకులతో సంప్రదింపుల నిమిత్తం కేబినెట్ మంత్రి సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారతదేశానికి పంపిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. క్రిప్స్ 1942 మార్చి 22న భారతదేశానికి వచ్చాడు. ఇతడి ప్రతిపాదనల ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి మొదటిసారిగా అధికారిక ప్రకటన చేసింది.
ముఖ్యాంశాలు
☛ భారత్‌కు అవసరమైన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఎన్నుకున్న రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. భారతదేశానికి వీలైనంత త్వరలో స్వయంప్రతిపత్తి లభిస్తుంది.
☛ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
☛ గవర్నర్ జనరల్ కార్య నిర్వాహక మండలిలో ఒక భారతీయుడికి సభ్యత్వం ఇస్తారు.
క్రిప్స్ ప్రతిపాదనలను మహాత్మాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ఇవి ‘దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీ వేసిన ఒక చెక్కు లాంటివి’ అని వ్యాఖ్యానించారు.
Tags
- Polity material for groups exams
- competitive exams study material
- polity study material for groups exams
- appsc and tspsc study material
- government exams and jobs
- appsc and tspsc groups exams
- appsc polity
- study material for appsc and tspsc in polity
- Government jobs exams
- TSPSC Polity
- appsc and tspsc polity
- Education News
- Sakshi Education News
- Polity for Groups Exams
- politics study materials for competitive exams