Polity Material for Groups Exams : రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?
భారత రాజ్యాంగ రచన–
రాజ్యాంగ పరిషత్
రాజ్యాంగ రచనా పద్ధతులు
సాధారణంగా రాజ్యాంగాన్ని రూపోందించడానికి రెండు పద్ధతులు పాటిస్తారు. రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంటు రూపోందించడం ఒకటి కాగా, రాజ్యాంగ రచనకు ప్రత్యేక పరిషత్ లేదా సంస్థను ఏర్పాటు చేసి తద్వారా రాజ్యాంగాన్ని రచించడం రెండోది.
ప్రపంచంలో తొలిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దేశం అమెరికా. 1787లో ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. 1789లో ఫ్రాన్స్‌లో ‘కాన్‌స్టిటు్యయెంట్ అసెంబ్లీ’ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రచించారు.
భారత రాజ్యాంగ రచన
భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్ అనే భావన స్వాతంత్య్రోద్యమంలో అంతర్గతంగా ఉన్న ముఖ్య డిమాండ్. భారత జాతీయ కాంగ్రెస్ తొలిసారిగా 1918 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో ఒక తీర్మానం చేసింది. ఇదే విషయాన్ని 1922 జనవరి 5న యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్యం అనేది బ్రిటిషర్లు ఇచ్చే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణగా మహాత్మాగాంధీ పేర్కొన్నారు.
1927 మే 17న బాంబే సమావేశంలో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ రచన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. అందులో భాగంగా అఖిలపక్ష కమిటీ 1928 మే 19న మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని రాజ్యాంగ రచనకు నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ‘నెహ్రూ రిపోర్ట్’ అంటారు. ఇది భారతీయులు సొంతంగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నం. ఎం.ఎన్.రాయ్ 1934లోనే రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటిసారిగా ప్రకటించారు. 1935లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీపరంగా తొలిసారి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును డిమాండ్ చేసింది. 1942లో క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 1946లో కేబినెట్ కమిటీ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది.
రాజ్యాంగ పరిషత్ నిర్మాణం
కేబినెట్ కమిటీ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం, ఇతర ప్రక్రియలను నిర్ణయించారు. 1946 జూౖల , ఆగస్టులో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.
➾ ప్రతి ప్రావిన్స్ నుంచి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడి చొప్పున ప్రాతినిధ్యం వహించారు.
➾ బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మహమ్మదీయులు, సిక్కులు, జనరల్ కేటగిరీలకు దామాషా ప్రకారం సీట్లు కేటాయించారు.
➾ రాజ్యాంగ పరిషత్‌లోని మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో 292 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. వీరిని బ్రిటిష్‌పాలిత ప్రాంతాలు లేదా గవర్నర్ ప్రావిన్స్‌ల నుంచి ఎన్నికైన శాసనసభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకున్నారు. నాడు మొత్తం 11 ప్రావిన్స్‌లు ఉండేవి. అవి మద్రాసు, బొంబాయి, యునైటెడ్ ప్రావిన్స్, బిహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఒరిస్సా, పంజాబ్, నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధ్, బెంగాల్, అస్సాం.
➾ 93 మంది ప్రతినిధులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారు. నలుగురు సభ్యులను చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్ నుంచి తీసుకున్నారు.
రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ 208 స్థానాలు, ముస్లిం లీగ్ 73 స్థానాలు, యూనియనిస్ట్ ఒక స్థానం సాధించాయి.
మతాలు, సామాజిక వర్గాల వారీగా సభ్యుల సంఖ్య
హిందువులు–160, క్రిస్టియన్లు –7,
సిక్కులు–5, ఆంగ్లో ఇండియన్లు–3,
దళితులు–33, మహిళలు–15,
΄ార్శీలు–3, ముస్లింలు–3.
ప్రత్యేక ΄ాకిస్తాన్ డిమాండ్‌తో ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్ నుంచి నిష్క్రమించింది. తర్వాత దేశవిభజన జరగడంతో రాజ్యాంగ పరిషత్‌లో సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. ఇందులో బ్రిటిష్ ΄ాలిత ్ర΄ాంతాల నుంచి 229 మంది ఎన్నికైన సభ్యులు, స్వదేశీ సంస్థానాల నుంచి 70 మంది సభ్యులు కలిపి రాజ్యాంగ సభలో స్థానాలను 229కి కుదించారు.
రాజ్యాంగ పరిçషత్‌కు ఎన్నికైన వివిధ వర్గాల ప్రముఖులు
ముస్లింలు | మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా |
సిక్కులు | సర్దార్ బలదేవ్ సింగ్, హుకుంసింగ్ |
మైనారిటీలు | హెచ్.సి.ముఖర్జీ |
యూరోపియన్లు | ఫ్రాంక్ ఆంథోని |
అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు |
బి.ఆర్.అంబేద్కర్ |
కార్మిక వర్గాలు | బాబు జగ్జీవన్ రామ్ |
΄ార్శీలు | హెచ్.పి.మోడి |
అఖిల భారత మహిళా సమాఖ్య |
హన్సా మెహతా |
హిందూ సభ |
శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, ఎం.ఆర్.జయకర్ |
మహిళా సభ్యులు
దుర్గాబాయి దేశ్‌ముఖ్, రాజకుమారి అమృత్‌కౌర్, విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు, హన్సా మెహతా, అమ్ముస్వామినాథన్, అన్ మాస్కెర్నె నాథ్, బేగం అజీజ్ రసూల్, ద్రాక్షాయణి వేలాయుధన్, కమలా చౌదరి, లీలా రే, మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రేణుక రే, సుచిత్రా కృపలానీ.
రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన తెలుగువారు
టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, కళా వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జీ రంగా, వీసీ కేశవరావు, ఎం.తిరుమలరావు, బొబ్బొలి రాజా రామకృష్ణ
రంగారావు.
రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం
➾ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. తొలి సమావేశానికి 211(9 మంది మహిళా సభ్యులు సహా) మంది హాజరయ్యారు. ఈ సమావేశం డిసెంబర్ 12 వరకు కొనసాగింది.
➾ డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్‌లో సీనియర్ సభ్యుడైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా(ఫ్రాన్స్‌లో ఈ పద్ధతి అమల్లో ఉంది), ఫ్రాంక్ ఆంథోనిని ఉపాధ్యక్షుడిగా నియమించారు. డిసెంబర్ 11న డాక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా జె.బి.కృపలానీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హెచ్‌సీ ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత వి.టి.కృష్ణమాచారిని కూడా రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడిగా నియమించారు.
➾ అంతర్జాతీయ న్యాయవాది బెనగల్ నరసింగరావును రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈయన బర్మా(మయన్మార్) రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు.
ఆశయాల తీర్మానం
1946 డిసెంబర్ 13న జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని (Objectives Resolution) ప్రతిపాదించారు. ఈ ఆశయాల తీర్మానమే రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలం. ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారం. ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 1947 జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాజ్యాంగ పరిషత్ సమావేశాలు
ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్‌లను తయారు చేసింది. రాజ్యాంగ ముసాయిదా 1948 ఫిబ్రవరి 21న ప్రచురితమైంది. రాజ్యాంగ ప్రతిపై 7,635 సవరణలు ప్రతిపాదించగా అందులో 2,473 చర్చకు వచ్చాయి. రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాను 115 రోజుల్లో పరిశీలించింది. ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించి చట్టంగా మార్చింది. రాజ్యాంగ రూపకల్పన కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మొత్తం 11 సమావేశాలు జరిగాయి.
భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. ఆ రోజు సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 284. ఈ సమావేశంలో నూతన రాజ్యాంగం ప్రకారం భారత గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్‌ను రాజ్యాంగ పరిషత్
ఎన్నుకుంది.
రాజ్యాంగ పరిషత్ కమిటీలు
రాజ్యాంగ పరిషత్‌లో వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు. వీటికి అనుబంధంగా 7 ఉప కమిటీలు, 15 మైనర్ కమిటీలను కూడా నియమించారు. ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైంది డ్రాప్టింగ్ (ముసాయిదా) కమిటీ. 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు.
రాజ్యాంగ పరిషత్
ముఖ్య కమిటీలు – అధ్యక్షులు
రాజ్యాంగ పరిషత్‌లో అతి ముఖ్యమైంది ముసాయిదా కమిటీ, అతిపెద్ద కమిటీ– సలహా కమిటీ.
ముసాయిదా కమిటీ: సభ్యుల సంఖ్య 6
చైర్మన్: బి.ఆర్.అంబేద్కర్.
సభ్యులు:
ß ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
ß అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
ß డాక్టర్ కె.యం.మున్షి
ß సయ్యద్ మహమ్మద్ సాదుల్లా
ß ఎన్.మాధవరావు (అనారోగ్య కారణంగా బి.ఎల్.మిత్తల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సభ్యుడయ్యారు)
ß టి.టి.కృష్ణమాచారి (డి.పి.ఖైతాన్ మరణంతో ఆయన స్థానంలో వచ్చారు.)
కమిటీ పేరు | చైర్మన్ |
ముసాయిదా కమిటీ | డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ |
సలహా కమిటీ, హక్కుల కమిటీ, రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ | సర్దార్ వల్లభాయ్ పటేల్. |
సారథ్య కమిటీ, జాతీయ పతాక తాత్కాలిక కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, రూల్స్ కమిటీ | రాజేంద్ర ప్రసాద్ |
కేంద్ర అధికారాల కమిటీ | జవహర్‌లాల్ నెహ్రూ |
కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ | వరదాచార్య |
హౌస్ కమిటీ, చీఫ్ కమిషనర్స్ ప్రావిన్స్‌ల కమిటీ | భోగరాజు పట్టాభి సీతారామయ్య |
రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ | జి.వి.మౌలాంకర్ |
సభా వ్యవహారాల కమిటీ | కె.యం.మున్షి |
రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ, ప్రుడెన్షియల్ కమిటీ | అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ |
భాషా కమిటీ | మోటూరి సత్యనారాయణ |
గతంలో వచ్చిన ప్రశ్నలు
1. రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది?
ఎ) రూల్స్ కమిటీ – రాజేంద్రప్రసాద్
బి) అడ్వయిజరీ కమిటీ – పటేల్
సి) స్టీరింగ్ కమిటీ – జవహర్‌లాల్ నెహ్రూ
డి) ప్రాథమిక హక్కుల ఉపసంఘం
– జె.బి.కృపలాని
2. రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది?
ఎ) సమాఖ్య
బి) లౌకికవాదం
సి) న్యాయ సమీక్షాధికారం
డి) న్యాయస్థాన క్రియాశీలత
3. భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారైంది?
ఎ) అక్టోబర్ 1946 బి) అక్టోబర్ 1947
సి) అక్టోబర్ 1948 డి) పైవేవీ కాదు
4. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం?
ఎ) పార్లమెంట్ బి) రాష్ట్రపతి
సి) ప్రజలు డి) న్యాయ శాఖ
5. మౌలిక రాజ్యాంగంలోని ప్రకరణల సంఖ్య?
ఎ) 395 బి) 315
సి) 420 డి) 465
సమాధానాలు
1) సి; 2) డి; 3) సి; 4) సి; 5) ఎ.
Tags
- Polity material for groups exams
- Competitive Exams
- study material for polity exams
- appsc and tspsc groups exams
- appsc and tspsc polity
- Government jobs exams
- government exams preparation
- appsc polity
- polity subject material for groups exams
- polity for state exams
- model and preparatory questions
- model and preparatory questions for groups exams
- Education News
- Sakshi Education News