Cricket: ఇండియా నుంచి తొలిప్లేయర్ ... స్కై తాజా రికార్డు ఏంటో తెలుసా.?
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 908 రేటింగ్ పాయింట్స్ సాధించి, పొట్టి ఫార్మాట్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న స్కై.. 900 అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదిన సూర్యకుమార్.. తొలిసారి 900 రేటింగ్ పాయింట్స్ మార్కును తాకి, టీ20 ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అంతనంత ఎత్తుకు దూసుకెళ్లాడు. టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో గతంలో డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్‌లు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్‌ను సాధించగా.. తాజాగా స్కై వీరిద్దరి సరసన చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత అల్లంత దూరాన పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు.
రిజ్వాన్ .. 836 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 631 రేటింగ్ పాయింట్స్‌తో 13వ ప్లేస్‌లో నిలిచాడు. టాప్20లో టీమిండియా తరఫున స్కై, విరాట్‌లు మాత్రమే ఉన్నారు.
లంకపై మూడో టీ20లో మెరుపు శతకం బాదిన సూర్యకుమార్‌కు అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో చోటు దక్కకపోవడం విశేషం. ఇప్పటివరకు 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.41 సగటున 180.34 స్ట్రయిక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీమిండియా తరఫున 16 వన్డేలు ఆడిన స్కై.. 32 సగటు.. 100.5 స్ట్రయిక్ రేట్‌తో 384 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.