Vinesh Phogat: నిరసనలో భాగంగా అవార్డులను వెనక్కిచ్చేసిన వినేశ్ ఫొగాట్.. ఇది జరిగింది..!
ఇప్పుడు వినేశ్ ఫొగాట్ వంతు వచ్చింది. ఈ స్టార్ రెజ్లర్ కూడా తన ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కివ్వాలని నిర్ణయించుకుంది. రోడ్డెక్కి పోరాడినా... క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించినా... మళ్లీ రెజ్లర్లకు అన్యాయమే జరిగిందని వాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పురస్కారాలను అట్టిపెట్టుకోవడంలో అర్థమేలేదని వినేశ్ తెలిపింది. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదనను ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసింది.
‘ఇంత జరిగాక ఇక నా జీవితంలో ఈ రెండు అవార్డులకు విలువే లేదు. ఎందుకంటే ఏ మహిళ అయినా ఆత్మ గౌరవాన్నే కోరుకుంటుంది. నేనూ అంతే... నా జీవితానికి ఆ అవార్డులు ఇకపై భారం కాకూడదనే ఉద్దేశంతోనే నాకు మీరిచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇస్తున్నాను ప్రధాని సార్’ అని ఆమె ‘ఎక్స్’లో లేఖను పోస్ట్ చేసింది. మహిళా సాధికారత, సమ సమానత్వం అనే ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమని తీవ్రంగా ఆక్షేపించింది. మేటి రెజ్లర్ ఫొగాట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది.
Junior World Boxing Championships: ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 17 పతకాలు
మూడు (2014, 2018, 2022) కామన్వెల్త్ క్రీడల్లోనూ చాంపియన్‌గా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం (2018), కాంస్యం (2014) చేజిక్కించుకుంది. కుస్తీలో ఆమె పతకాల పట్టును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో అర్జున, 2020లో ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డులతో సత్కరించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో లైంగిక ఆరోపణల కేసులో నిందితుడైన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ వర్గమే గెలిచింది.
ఆయన విధేయుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో సాక్షి మలిక్ ఉన్న పళంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెజ్లర్ బజరంగ్ పూనియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ‘పద్మశ్రీ’ పురస్కారాలను వెనక్కి ఇచ్చారు. అయితే కేంద్ర క్రీడాశాఖ నియమావళిని అతిక్రమించడంతో డబ్ల్యూఎఫ్‌ఐని సస్పెండ్ చేసింది.