Inspirational Story: బతికితే భారమన్నారు.... ఆ అమ్మాయే జాతీయస్థాయిలో దుమ్మురేపుతోంది... ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ
తమ గారాల పట్టిలో ఎలాంటి చలనం లేకుండడం ఆ తల్లిదండ్రులు గమనించారు. చిన్నారికి ఏమైందో తెలియక విలవిలలాడారు. ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. లక్షలు ఖర్చు పెట్టారు. ఇంత చేసినా వారికి వచ్చిన సమాధానం... ‘చిన్నారి ఏదో అరుదైన వ్యాధితో బాధపడుతోంది’ అని. అప్పట్లో ఆ వ్యాధి పేరు కూడా తెలీదు. బంధువులు.. చుట్టుపక్కల వాళ్లు ఆ పిల్లని వదిలించుకోవడం మంచిదని ఉచిత సలహా ఇచ్చేవారే కానీ, ఏ ఒక్కరూ ధైర్యం చెప్పేవారు కాదు.
పట్టువదలని విక్రమార్కుడిలా ఆ చిన్నారిని ఎలాగైనా మంచిస్థితికి తీసుకురావాలని ఆ తల్లి కలలు కనింది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవడం ప్రారంభించింది. ఆ చిన్నారికి రెండేళ్ల వయసున్నప్పుడు ఆ దేవుడు కాస్త కరుణించాడు ఆ తల్లిని. టేప్ రికార్డర్‌లో వచ్చే సంగీతానికి ఆ చిన్నారి స్పందించడం మొదలు పెట్టింది. ఇంకేం ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. ఆ చిన్నారి పేరే బెంజీ కుమార్... ఆమె సక్సెస్ ప్రతీ ఒక్కరికి స్పూర్తిదాయకమే....
బెంజీకుమార్ సంగీతానికి స్పందించడం ఆ చిన్నారి తల్లి కవితా కుమార్ గమనించింది. దీంతో అయిదేళ్లు వచ్చాక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. రెండేళ్లలోనే ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగిందామె. ఆమె పాట విని అందరూ నిల్చొని ప్రశంసిస్తోంటే ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు.
9 ఏళ్లకే ‘బేసిక్ రాగాస్’ పేరుతో సొంత క్యాసెట్ విడుదల చేసింది బెంజీ. బెంజీ కుమార్ కష్టాలు ఫలించాయి. దిగ్గజ గాయనీ, గాయకులైన లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, అద్నాన్ సమీ వంటి ప్రముఖులు బెంజీ ప్రతిభను గుర్తించి ప్రశంసల జల్లు కురింపించారు.
బెంజీకుమార్ గానామృతం శ్రోతలను ఉర్రూతలూగించింది. ఆ గానానికి జాతీయ అవార్డులు సైతం వచ్చి వాలాయి. 27 ఏళ్ల బెంజీ కెరియర్‌లో ఇప్పటికే మూడు జాతీయ అవార్డులు... మరెన్నో రివార్డులు దక్కాయి. బతికితే భారం అని అన్నవాళ్లే ఇప్పుడు బెంజీ సక్సెస్‌ను పదిమందికి చెబుతున్నారు. సమయం ఉన్నప్పుడల్లా తనలా బాధపడే వారికి సంగీత పాఠాలు చెబుతోంది బెంజీ. అన్ని అవయవాళ్లు సక్రమంగా ఉన్నవారే సాధించలేని విజయాలను బెంజీ కుమార్ సాధిస్తోంది. ఆమె జీవితం ఎంతో మందిలో స్పూర్తి నింపుతోంది.