GATE 2024 Exam Preparation Tips: రివిజన్‌తో బెస్ట్ స్కోర్ ఇలా!
- ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్ష
- కొనసాగుతున్న హాల్ టికెట్ డౌన్‌లోడ్
- వేగం, కచ్చితత్వంతో బెస్ట్ స్కోర్‌కు ఆస్కారం
- రివిజన్‌పై దృష్టిపెట్టాలంటున్న నిపుణులు
ఎంట్రన్స్ టెస్ట్‌లైనా.. అకడమిక్ పరీక్షలైనా.. ఎన్ని రోజులు చదివాం అనేదాని కంటే.. పరీక్ష రోజు ఎలాంటి ప్రదర్శన ఇచ్చామన్నదే ముఖ్యం. నెలల తరబడి సాగించే ప్రిపరేషన్ ఒక ఎల్తైతే.. పరీక్షకు పది రోజుల ముందు చేసే రివిజన్, ప్రాక్టీస్ నిర్ణయాత్మకంగా మారుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా పరీక్ష హాల్లో చూపే ప్రతిభ అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు.
గేట్ పరీక్ష ఇలా
గేట్ పరీక్షలో 65 ప్రశ్నలు-వంద మార్కులకు ఉంటాయి. ఇందులో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అవి.. జనరల్ ఆప్టిట్యూడ్ , ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, సంబంధిత సబ్జెక్ట్. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు.
చదవండి: GATE 2024 notification: గేట్-2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం..
రివిజన్
గేట్-2024 అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ పదిహేను రోజుల సమయాన్ని పూర్తిగా పునశ్చరణకే కేటాయించాలి. ఇప్పటి వరకు చదివిన అంశాలు, వాటికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్లు, ఫార్ములాలతో రూపొందించుకున్న సొంత నోట్స్‌ను పరిశీలిస్తూ వేగంగా రివిజన్ కొనసాగించాలి. దీనివల్ల తక్కువ సమయంలోనే ఇప్పటి వరకు చదివిన అన్ని అంశాలను మరోసారి రీక్యాప్ చేసేందుకు వీలవుతుంది.
వేగం, కచ్చితత్వం
గేట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో వేగంగా సమాధానాలు ఇచ్చేలా ప్రాక్టీస్ చేయాలి. అదే సమయంలో కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ముఖ్యమైన ఫార్ములాలతో రాసుకున్న నోట్స్‌ను పునరావలోకనం చేసుకోవడం మేలు. ఒక ప్రశ్నను చూస్తూనే.. దానికి సంబంధించిన మూల భావన మదిలో మెదిలేలా.. సంబంధిత ఫార్ములాలతో భిన్నమైన ప్రశ్నలను సాధన చేయాలి. అదే విధంగా మాక్ టెస్ట్‌లకు హాజరై.. పొరపాట్లకు కారణాలను విశ్లేషించుకోవాలి.
ఫార్ములాలు, కాన్సెప్టులు
గేట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లను మరోసారి అవలోకనం చేసుకోవాలి. ముఖ్యంగా మెకానికల్, సీఎస్‌ఈ, ఈసీఈ అభ్యర్థులకు ఇది ఎంతో అవసరం. అదే విధంగా ఇతర సబ్జెక్ట్‌ల విషయంలోనూ ఈ విధానం పరీక్ష హాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు ఎంతో దోహదం చేస్తుంది. ప్రిపరేషన్‌లో అప్లికేషన్ అప్రోచ్‌ను అనుసరిస్తేæపరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్న అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. తద్వారా మంచి స్కోర్ సాధనలో ముందంజలో నిలిచే ఆస్కారం ఉంటుంది.
మాక్ టెస్ట్‌లు
గేట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో మాక్ టెస్ట్‌లకు హాజరై, వాటి ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఏదైనా టాపిక్‌లో తక్కువ మార్కులు వచ్చినా.. కొత్తగా వాటిని చదివే ప్రయత్నం చేయడం సరికాదు. దీనికి బదులు ఇప్పటికే బాగా పట్టున్న విభాగంలో మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేయాలి. అదేవిధంగా అభ్యర్థులు గేట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న 'మాక్ టెస్ట్' సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే.. అధికారిక వెబ్‌సైట్‌లోని మాక్ టెస్ట్‌లు.. పరీక్ష విధానంతోపాటు ప్రశ్నలు అడిగే తీరుపైనా అవగాహన పెంచుతాయి.
వర్చువల్ కాలిక్యులేటర్
మూడు గంటల వ్యవధిలో జరిగే గేట్ పరీక్షలో అంచెల వారీగా సాధన చేసి సమాధానం రాబట్టే ప్రశ్నలు కూడా ఉంటాయి. అంతేకాకుండా మొత్తం 65 ప్రశ్నల్లో అధిక శాతం ప్రశ్నలు కాలిక్యులేటర్‌ను వినియోగించాల్సిన విధంగా ఉంటున్నాయి. కాబట్టి వర్చువల్ కాలిక్యులేటర్‌ను వేగంగా వినియోగించే నైపుణ్యం పెంచుకోవాలి. ఫలితంగా ఒక ప్రశ్నకు వీలైనంత త్వరగా సమాధానం ఇచ్చే నేర్పు లభిస్తుంది.
చదవండి: GATE-2024 Notification: గేట్‌తో ప్రయోజనాలు, కొత్త మార్పులు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
పరీక్ష రోజు ఇలా
పరీక్ష రోజున అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్ణీత సమయాని కంటే ముందుగానే కేంద్రానికి వెళ్లాలి. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షకు..సంబంధిత పోర్టల్‌లో నిర్దిష్ట స్లాట్‌కు 20 నిమిషాల ముందుగానే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఫలితంగా పరీక్షకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలు చదివే సమయం లభిస్తుంది.
- పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యే ముందు.. ఆన్‌లైన్ విండోలో 'వ్యూ ఆల్ కొశ్చన్స్' ట్యాబ్ పై క్లిక్ చేయాలి. దీనివల్ల మొత్తం అన్ని ప్రశ్నలను చదివే అవకాశం ఉంటుంది. తద్వారా ఏ ప్రశ్న లేదా సెక్షన్‌ను ముందుగా ప్రారంభించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. ముందుగా సులువైన లేదా తమకు బాగా అవగాహన ఉన్న సెక్షన్‌ను ఎంచుకుని.. వాటిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత క్లిష్టమైన సెక్షన్‌ల సాధన దిశగా అడుగులు వేయాలి.
- గేట్ పరీక్షలోని విభాగాల్లో.. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్ సెక్షన్స్ కొంత సులభంగా ఉంటాయి. అభ్యర్థులు ముందుగా వీటికి సమాధానాలు గుర్తించడం మేలు. ఫలితంగా ఈ సెక్షన్లను తక్కువ సమయంలో పూర్తి చేసుకుని.. ఆ తర్వాత సబ్జెక్ట్ ఆధారిత సెక్షన్లకు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలవుతుంది.
- మూడు గంటల పరీక్ష సమయంలో మొదటి గంటన్నరలో బాగా సులువైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఏదైనా క్లిష్టమైన ప్రశ్న కనిపిస్తే దాన్ని వదిలేసి.. వేరే ప్రశ్నకు వెళ్లాలి. నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది కాబట్టి సమాధానం తెలియని ప్రశ్నలను వదిలేయడమే మేలు. అభ్యర్థులు సమాధానాల రివ్యూకు కూడా కొంత సమయం కేటాయించాలి. చివరల్లో అన్ని సమాధానాలను సరి చూసుకుని.. అవి సరైనవా? కాదా? అని పరిశీలించాలి. సమాధానాలిచ్చే క్రమంలో రఫ్ వర్క్ చేయడం కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఫార్ములా ఆధారిత ప్రశ్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌లోనే ప్రశ్నను చూస్తూ.. కేవలం ఆలోచన ఆధారంగా సమాధానాలివ్వడం ఒక్కోసారి తప్పు సమాధానాలకు దారి తీస్తుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లో అందించే స్క్రిబిల్ ప్యాడ్‌పై ప్రశ్నను సాల్వ్ చేసి.. ఆ సమాధానం కరెక్ట్ అనుకున్నప్పుడే దానికి సంబంధించిన ఆప్షన్ బటన్‌ను క్లిక్ చేయాలి.
నిబంధనలు-జాగ్రత్తగా
గేట్ అభ్యర్థులు పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా సాధ్యమైనంత త్వరగా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. గేట్ నిర్వాహక కమిటీ నిబంధనల ప్రకారం-అప్లికేషన్ సమయంలో పేర్కొన్న వ్యక్తిగత ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఒరిజినల్ కాపీని పరీక్ష హాల్లో చూపించాల్సి ఉంటుంది. వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. చివరి నిమిషంలో టెక్నికల్ ఎర్రర్స్, వెబ్‌సైట్ ట్రాఫిక్ పెరిగి వెబ్‌సైట్ ఓపెన్ అవకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంత ముందుగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ తీసుకోవాలి.
చదవండి: GATE 2024 Score: ప్రవేశాలే కాదు... ఈ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా!
గేట్‌తో ప్రయోజనాలెన్నో!
గేట్ స్కోర్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్+పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో చేరే అవకాశం లభిస్తుంది. దీంతోపాటు రాష్ట్రాల స్థాయిలో పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో గేట్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. గేట్ ర్యాంకు ఆధారంగా ఎంటెక్ సీటు ఖరారు చేసుకుంటే నెలకు రూ.12,400 స్టయిపండ్ అందుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.28 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది. గేట్ స్కోర్ ఆధారంగా నవరత్న, మహారత్న, మినీరత్న తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజనీర్లుగా కొలువులు సొంతం చేసుకోవచ్చు.
గేట్-2024 ముఖ్య తేదీలు
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: జనవరి 3 నుంచి ప్రారంభం
- గేట్-2024 తేదీలు: ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో (ప్రతి రోజు రెండు సెషన్లు. మొదటి సెషన్ ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2-5 గంటల వరకు).
- గేట్ పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 16, 2024
- స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్: మార్చి 23, 2024
- వెబ్‌సైట్: https://gate2024.iisc.ac.in/
Tags
- GATE
- GATE 2024 notification
- GATE Exam Preparation Tips
- Graduate Aptitude Test in Engineering
- engineering students
- admissions
- central government institutes
- entrance test
- gate exam syllabus
- gate exam eligibility
- GATE Exam Date 2024
- GATE 2024 Important Dates
- sakshi education
- Sakshi Bhavitha
- Careers
- mocktests
- Sakshi Education Latest News