Skip to main content

GATE 2022: ఉన్నత విద్యావకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు

GATE Preparation 2022
GATE Preparation 2022

ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌ తదితర విభాగాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు మార్గం.. గేట్‌ (గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌). జాతీయ స్థాయిలో ఏటా నిర్వహించే ఈ పరీక్షలో మంచి స్కోర్‌ సాధిస్తే.. ఉన్నత విద్యావకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు. గేట్‌–2022 పరీక్ష ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. అంటే.. పరీక్షకు రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో.. గేట్‌తో ప్రయోజనాలు, పరీక్ష స్వరూపం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌పై ప్రత్యేక కథనం..

  • గేట్‌ స్కోర్‌తో ఉన్నత విద్య, ఉద్యోగాలు
  • ఫిబ్రవరి 5,6,12,13 తేదీల్లో గేట్‌ పరీక్ష
  • ఈ రెండు నెలలు ప్రిపరేషన్‌కు ఎంతో కీలకం 

ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లతోపాటు పలు ఇతర విద్యాసంస్థల్లో ఎంఈ/ఎంటెక్‌/ఎంఆర్క్‌/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో చేరేందుకు గేట్‌ స్కోర్‌ తప్పనిసరి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల నియామకానికి గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇలా ఇంజనీరింగ్‌ తదితర ఉన్నత విద్యతోపాటు ఉద్యోగావకాశాలను సైతం కల్పిస్తున్న ఈ పరీక్షకు పోటీ కూడా ఎక్కువే. గేట్‌లో విజయం సాధించాలంటే.. అందుబాటులో ఉన్న ఈ రెండు నెలల సమయాన్ని సమర్థంగా సద్వినియోగం చేసుకోవాలి. పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. 

చ‌ద‌వండి: Full Stack Developers: ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌... రూ.లక్షల్లో వార్షిక వేతన ప్యాకేజీలు

పరీక్ష స్వరూపం

  • అభ్యర్థులు ముందుగా గేట్‌ పరీక్ష విధానంపై దృష్టిసారించాలి. తద్వారా పరీక్షలో ఎన్ని సెక్షన్‌లు ఉంటాయి. ఎన్ని ప్రశ్నలు ఇస్తారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి ఎంత.. మార్కుల కేటాయింపు ఎలా ఉంటుంది వంటి‡ అంశాలపై పూర్తి అవగాహన వస్తుంది. ఇది అభ్యర్థులు సరైన దిశలో ప్రిపరేషన్‌ కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది.
  • గేట్‌ పరీక్ష విధానంతోపాటు పరీక్ష సిలబస్‌నూ అభ్యర్థులు అధ్యయనం చేయాలి. 
  • మొత్తం 29 సబ్జెక్టు పేపర్లలో గేట్‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది కొత్తగా జియోమ్యాటిక్స్‌ ఇంజనీరింగ్, నావెల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టు పేపర్లను ప్రవేశపెట్టారు. అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్‌ లేదా గరిష్టంగా రెండు పేపర్లకు హాజరుకావచ్చు. 
  • పరీక్షను ఆన్‌లైన్‌ విధానం(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష)లో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు. 
  • పరీక్షలో రెండు సెక్షన్లలో కలిపి 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 లేదా 2 మార్కులు కేటాయిస్తారు. మొదటి సెక్షన్‌లో జనరల్‌ అప్టిట్యూడ్‌కు చెందిన 10 ప్రశ్నలు 15 మార్కులకు ఇస్తారు. రెండో సెక్షన్‌లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 55 ప్రశ్నలు 85 మార్కులకు అడుగుతారు. 
  • మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు(ఎంసీక్యూ), మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు(ఎంఎస్‌క్యూ), న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌(ఎన్‌ఏటీ) ప్రశ్నలతో ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు.
  • అభ్యర్థులు సబ్జెక్టు సామర్థ్యాలతోపాటు అనువర్తిత, విశ్లేషణ, సంశ్లేషణ నైపుణ్యాలను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. 
  • నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి మూడో వంతు మార్కులను తగ్గిస్తారు. –ఎంఎస్‌క్యూ, ఎన్‌ఏటీ తరహా ప్రశ్నలకు ఎలాంటి నెగిటివ్‌ మార్కులు లేవు. 

పక్కా ప్రిపరేషన్‌

గేట్‌ ప్రశ్నపత్రం అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను గుర్తించేలా ఉంటుంది. కాబట్టి పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించి..పక్కా ప్రణాళికతో సమయ విభజన చేసుకొని ఆయా అంశాలపై పట్టు పెంచుకోవాలి. పరీక్ష సరళి, సిలబస్‌కు అనుగుణంగా అధ్యయనం సాగించాలి. సిలబస్‌ను పరిశీలించి, వాటిని అకడమిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ.. అప్లికేషన్‌ అప్రోచ్‌తో చదవాలి. ఒక ప్రశ్నను నాలుగైదు విధాలుగా సాధించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. పరీక్షలో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలపై అధికంగా దృష్టిసారించాలి. రివిజన్‌కు ఉపయోగపడేలా సొంత నోట్సును సిద్ధం చేసుకోవాలి. ప్రిపరేషన్‌ మధ్యలో విరామం తీసుకుంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

ప్రాక్టీస్‌ పేపర్స్, మాక్‌టెస్ట్స్‌

  • గేట్‌లో విజయానికి.. గత ప్రశ్నపత్రాలు, మాక్‌టెస్ట్‌లు అత్యంత కీలకం. వీటిని ప్రాక్టీస్‌ చేయడం ద్వారా తమ శక్తిసామర్థ్యాలపై స్వీయ అంచనాకు రావొచ్చు. కేవలం చదవడం, నోట్స్‌ రాసుకోవడానికే పరిమితం కాకుండా.. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. గత ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్టులను ప్రాక్టీస్‌ చేయడం ద్వారా.. ప్రశ్నల తీరుపై అవగాహన ఏర్పడుతుంది. సమయపాలనపై పట్టు లభిస్తుంది. 
  • గేట్‌–2022 పేపర్లవారీ మాక్‌ టెస్టును ఐఐటీ ఖరగ్‌పూర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో తాజాగా పొందుపరిచింది. సంబంధిత సబ్జెక్టుపై క్లిక్‌ చేసి..ప్రాక్టీస్‌ చేయడం ద్వారా పరీక్షపై అంచనాకు రావొచ్చు. ప్రిపరేషన్‌ తీరును మరింతగా మెరుగుపర్చుకోవచ్చు. ఠి మాక్‌ టెస్ట్‌ వాస్తవ పరీక్షకు ప్రతిరూపం. కాబట్టి దీనిద్వారా పరీక్షను మెరుగ్గా అర్థం చేసుకొని.. అనవసర భయాందోళనల నుంచి బయటపడొచ్చు. 

గేట్‌తో అవకాశాలు

  • గేట్‌లో చూపిన ప్రతిభతో ఉన్నత విద్యావకాశాలే కాకుండా.. పలు ఉద్యోగాలను పొందొచ్చు. 
  • గేట్‌ స్కోరుతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ)తోపాటు ఐఐటీలు, ఎన్‌ఐటీ తదితర విద్యాసంస్థల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని విద్యాసంస్థలు నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్‌ కల్పిస్తున్నాయి.
  • గేట్‌ స్కోరు ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. తదుపరి ప్రక్రియ ద్వారా ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. కటాఫ్‌ మార్కులు పీఎస్‌యూలను బట్టి మారుతూ ఉంటాయి. 

గేట్‌–2022 ముఖ్య సమాచారం

  • అడ్మిట్‌ కార్డుల జారీ: 2022 జనవరి 3
  • పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13
  • ఫలితాల వెల్లడి: 2022 మార్చి 17
  • వెబ్‌సైట్‌: https://gate.iitkgp.ac.in

మాక్‌ టెస్టులతో మేలు 

గేట్‌ రాసి ఐఐటీలు తదితర ప్రఖ్యాత విద్యాసంస్థలో ఉన్నతవిద్యనభ్యసిస్తే ఉజ్వల అవకాశాలు అందుకోవచ్చు. కాబట్టి గేట్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలి. పరీక్ష తేదీలు సమీపిస్తున్నందున ఇప్పటివరకు చదివిన అంశాల రివిజన్‌కు ప్రణాళిక బద్ధంగా సమయం కేటాయించాలి. వీలైనన్ని ఎక్కువ మాక్‌ టెస్టులు, ప్రీవియస్‌ పేపర్లను సాధన చేయాలి.
–డా.జి.రమణ, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

Published date : 07 Dec 2021 07:13PM

Photo Stories