GATE 2025 Exam Guidance: గేట్.. గెలుపు బాట!.. గేట్ పరీక్షకు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్, రివిజన్ టిప్స్..

టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్+పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే అవకాశంతో పాటు ప్రభుత్వ రంగ కొలువులకు అవకాశం కల్పిస్తున్న గేట్‌కు విస్తృతమైన పోటీ నెలకొంది. దేశవ్యాప్తంగా ఏటా ఎనిమిది లక్షల మందికిపైగా అభ్యర్థులు గేట్ పరీక్షకు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 80 వేల మంది వరకూ ఈ పరీక్ష రాస్తున్నట్లు అంచనా.
వంద మార్కులకు పరీక్ష
ఆన్‌లైన్ విధానంలో జరిగే గేట్ పరీక్షలో 65 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయిస్తారు. పరీక్షకు అందుబాటులో ఉండే సమయం మూడు గంటలు. ఈ పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. జనరల్ ఆప్టిట్యూడ్ , ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, సంబంధిత సబ్జెక్ట్.
రివిజన్
అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటి వరకు చదివిన అంశాలు, వాటికి సంబంధించి ముఖ్యమైన పాయింట్లు, ఫార్ములాలతో రూపొందించుకున్న సొంత నోట్స్‌ను రివిజన్ చేయాలి. ప్రతిరోజు తాము రాస్తున్న పేపర్‌కు సంబంధించిన సిలబస్‌లోని అన్ని యూనిట్లు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
చదవండి: Engineering Jobs: స్టార్టప్ ఆఫర్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు
గేట్ అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లను తరచూ చదువుతుండాలి. ముఖ్యంగా మెకానికల్, సీఎస్‌ఈ, ఈసీఈ అభ్యర్థులకు ఇది ఎంతో కీలకం. ఈ విధానం పరీక్ష హాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు ఎంతో దోహదం చేస్తుంది. అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం సాగిస్తే.. పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. తద్వారా మంచి స్కోర్ సాధనలో ముందంజలో నిలిచే ఆస్కారం ఉంటుంది.
మాక్ టెస్ట్‌లకు హాజరు
మలి దశప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలో మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. వాటి ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఒకవేళ తమకు ఏదైనా టాపిక్‌లో తక్కువ మార్కులు వచ్చినా.. ఇప్పుడు కొత్తగా వాటిని చదవాలనే ఉద్దేశం ఏ మాత్రం సరికాదు. దీనికి బదులు బాగా పట్టున్న సబ్జెక్ట్‌లలో మరింత మెరుగ్గా రాణించేలా కృషిచేయాలి.
చదవండి: Tech skills: ఈ స్కిల్స్ నేర్చుకోండి... టెక్ జాబ్ పట్టండి
అధికారిక ‘మాక్ టెస్ట్’లు
అభ్యర్థులు గేట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘మాక్ టెస్ట్’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ మాక్ టెస్ట్‌లు పరీక్ష విధానం, ప్రశ్నలు అడిగే తీరుపై అవగాహనను పెంచుతాయి. కాబట్టి ప్రస్తుత సమయంలో అభ్యర్థులు అధికారిక మాక్‌టెస్టులను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి.
వర్చువల్ కాలిక్యులేటర్
అభ్యర్థులు పట్టు సాధించాల్సిన మరో అంశం.. వర్చువల్ కాలిక్యులేటర్. మొత్తం 65 ప్రశ్నలతో మూడు గంటల వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో అంచెల వారీగా సాధన చేసి సమాధానం రాబట్టాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నల్లో 80 నుంచి 90 శాతం ప్రశ్నలు కాలిక్యులేటర్‌ను వినియోగించాల్సిన విధంగా అడుగుతున్నారు. కాబట్టి వర్చువల్ కాలిక్యులేటర్‌ను వేగంగా వినియోగించే నైపుణ్యం పెంచుకోవాలి. ఫలితంగా ఆయా ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానం ఇచ్చే నేర్పు లభిస్తుంది.
చదవండి: Career Opportunities After B.Tech: బీటెక్ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?
నిబంధనలు, డాక్యుమెంట్లు
అభ్యర్థులు పరీక్ష నిబంధనలు, పరీక్ష హాల్లోకి తీసుకు వెళ్లాల్సిన డాక్యుమెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. గేట్ నిర్వాహక కమిటీ నిబంధనల ప్రకారం–అప్లికేషన్ సమయంలో పేర్కొన్న వ్యక్తిగత ఫొటో ఐడెంటిటీ కార్డ్ ఒరిజినల్ కాపీని పరీక్ష హాల్లో చూపించాల్సి ఉంటుంది. వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. చివరి క్షణంలో సాంకేతిక సమస్యలు,వెబ్‌సైట్ ఓపెన్ అవకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే ఆస్కారముంది. కాబట్టి అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం అందుబాటులోకి రాగానే డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
గేట్ స్కోర్‌తో ప్రయోజనాలు
- గేట్‌లో మంచి స్కోర్‌తో అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్+ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశించే అవకాశం లభిస్తుంది.
- రాష్ట్రాల స్థాయిలో పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో గేట్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. గేట్ ర్యాంకు ఆధారంగా ఎంటెక్ సీటు ఖరారు చేసుకుంటే.. నెలకు రూ.12,400 స్టయిపండ్ అందుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.28 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
పీఎస్‌యూ ఉద్యోగాలు
గేట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజనీర్లుగా కొలువులు సొంతం చేసుకోవచ్చు. పలు ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) గత కొన్నేళ్లుగా గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు ఆయా సంస్థలు విడుదల చేసే నోటిఫికేషన్లకు అనుగుణంగా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. నిర్దిష్ట కటాఫ్‌ను అనుసరించి.. ఆ జాబితాలో ఉన్న వారికి పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ టాస్క్ వంటివి నిర్వహించి తుది విజేతలను నిర్ణయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని టెలికం శాఖలో సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, కేబినెట్ సెక్రటేరియట్‌లో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (క్రిప్టో),సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్(ఎస్ అండ్ టీ) విభాగాల్లోని గ్రూప్–ఎ స్థాయి పోస్ట్‌ల నియామకాలకు గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
టార్గెట్ 750 స్కోర్
అభ్యర్థులు 750 స్కోర్‌ను టార్గెట్‌గా చేసుకుని కృషి చేయాలి. ఈ స్కోర్‌తో ఇటు కోరుకున్న ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం, అదేవిధంగా పీఎస్‌యూలో కొలువుకు అవకాశం ఉంటుంది. పరీక్ష హాల్లో ముందుగా జనరల్ ఆప్టిట్యూడ్,ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సెక్షన్లను పూర్తి చేయడం వల్ల సబ్జెక్టు సెక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లభిస్తుంది.
పరీక్ష రోజు ఇలా
- గేట్ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సంబంధిత పోర్టల్‌లో నిర్దిష్ట స్లాట్‌కు 20 నిమిషాల ముందుగానే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. తద్వారా పరీక్షకు సంబంధించి ముఖ్యమైన నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవచ్చు.
- సమాధానాలకు ఉపక్రమించే ముందు ఆన్‌లైన్ విండోలో ‘వ్యూ ఆల్ కొశ్చన్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయడం మేలు. దీనివల్ల మొత్తం అన్ని ప్రశ్నలను చదివే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఏ ప్రశ్న లేదా సెక్షన్‌ను ముందుగా ప్రారంభించాలి అనే అంశంపై స్పష్టత వస్తుంది. ముందుగా సులువైన లేదా తమకు బాగా అవగాహన ఉన్న సెక్షన్స్‌ను ఎంచుకుని.. వాటిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత క్లిష్టమైన సెక్షన్ ప్రశ్నల వైపు దృష్టి సారించొచ్చు.
- గేట్‌లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్ సెక్షన్స్ కొంత సులభంగా ఉంటాయి. అభ్యర్థులు ముందుగా వీటికి సమాధానం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. దీనివల్ల ఈ సెక్షన్లను తక్కువ సమయంలో పూర్తి చేసుకుని.. ఆ తర్వాత సమయంలో సబ్జెక్ట్ ఆధారిత సెక్షన్లకు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలవుతుంది.
- మొత్తం మూడు గంటల సమయంలో మొదటి గంటన్నరలోనే తమకు బాగా సులువుగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం పూర్తి చేయాలి. ఏదైనా క్లిష్టమైన ప్రశ్న కనిపిస్తే దాన్ని వదిలేసి వేరే ప్రశ్నకు వెళ్లాలి. నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. కాబట్టి సమాధానం తెలియని ప్రశ్నలని వదిలి వేయడమే మేలు. ఆన్‌లైన్ పరీక్ష క్రమంలో అభ్యర్థులు తామిచ్చిన సమాధానాల రివ్యూకు కూడా కొంత సమయం కేటాయించుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాం అనే స్పష్టతకు వచ్చాక.. మరోసారి సమాధానాలను సరిచూసుకోవాలి.
- సమాధానాలిచ్చే క్రమంలో రఫ్ వర్క్ చేయడం కూడా మేలు చేస్తుంది.ముఖ్యంగా ఫార్ములా ఆధా రిత ప్రశ్నల విషయంలో ఇది ఎంతో అవసరం.
- పరీక్షకు ఒక రోజు ముందుగానే తమకు కేటాయించిన సెంటర్ వివరాలు తెలుసుకోవాలి. పరీక్షకు ముందు రోజు పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురవకుండా ఉండాలి.పరీక్ష సమయం వరకు చదువుదాం అనే ధోరణి వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది.
గేట్–2025.. ముఖ్య తేదీలు
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: జనవరి 7 నుంచి
- గేట్–2025 ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీలలో
- ఫలితాల వెల్లడి: మార్చి 17, 2025
- వెబ్‌సైట్: https://gate2025.iitr.ac.in/index.html
Tags
- GATE 2025 Exam Guidelines
- GATE 2025 Exam Last Minute Tips
- GATE 2025 Last Minute Tips
- GATE 2025 Test PAPERS & Syllabus
- GATE 2025 Preparation Strategy
- GATE 2025 Admit Card Out
- Graduate Aptitude Test in Engineering
- Gate 2025 exam guidance pdf
- GATE 2025 exam date
- GATE 2025 Syllabus
- GATE 2025 Preparation
- GATE 2025 preparation strategy
- GATE exam rules and regulations 2025