Skip to main content

GATE Exam Preparation Tips: గేట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

gate exam 2023 notification details, exam pattern and Preparation Tips
gate exam 2023 notification details, exam pattern and Preparation Tips

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌.. సంక్షిప్తంగా గేట్‌. బీటెక్‌ చదివే ప్రతి విద్యార్థి లక్ష్యంగా చేసుకొనే ప్రతిష్టాత్మక పరీక్ష. గేట్‌లో స్కోర్‌ ఆధారంగా.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఎంటెక్‌తోపాటు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొలువులకు సైతం పోటీ పడొచ్చు. ప్రతి ఏటా లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతుంటారు. ఇంతటి పోటీ, ప్రాధాన్యం సంతరించుకున్న గేట్‌–2023 తేదీలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో.. గేట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ..

  • గేట్‌–2023 షెడ్యూల్‌ విడుదల 
  • 2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో పరీక్ష
  • గేట్‌ స్కోర్‌తో ఎంటెక్, పీహెచ్‌డీ; పీఎస్‌యూ కొలువులు

గేట్‌–2023 నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐటీ కాన్పూర్‌ వ్యవహరించనుంది. ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ ఏడాది కూడా 29 పేపర్లలోనే గేట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి గత రెండేళ్లుగా ఏటా కొత్త పేపర్లను ప్రవేశ పెడుతున్న గేట్‌ నిర్వాహకులు.. ఈ ఏడాది మాత్రం పేపర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. బీటెక్‌ స్థాయిలో చదివిన బ్రాంచ్‌కు సరితూగే గేట్‌ పేపర్లలో రెండు పేపర్లకు హాజరు కావొచ్చు. బీటెక్‌లో ఆయా బ్రాంచ్‌లు.. వాటికి గేట్‌లో అర్హత ఉన్న పేపర్లను గేట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రెండు పేపర్లకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: గేట్‌.. గెలుపు బాట ఇలా!

గతంలో మాదిరిగానే పరీక్ష

  • గేట్‌ 2023 పరీక్షలో ఎలాంటి మార్పులు లేకుండా గతంలో మాదిరిగానే నిర్వహించనున్నట్లు నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌ ఐఐటీ–కాన్పూర్‌ వర్గాలు పేర్కొన్నాయి. గేట్‌.. మొత్తం మూడు గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ∙వంద మార్కులకు నిర్వహించే పరీక్షను రెండు విభాగాల్లో నిర్వహిస్తారు. మొత్తం 65 ప్రశ్నలు అడుగుతారు. 
  • పార్ట్‌–1లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 15 మార్కులు కేటాయిస్తారు. ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. 
  • అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌తో పార్ట్‌–బిని నిర్వహిస్తారు. ఈ విభాగంలో మొత్తం 55ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25ప్రశ్నలను ఒక మార్కు, 30 ప్రశ్నలు రెండు మార్కులకు చొప్పున ఉంటాయి. పార్ట్‌–బిలోనే 10–15 మార్కులకు ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ నుంచి ప్రశ్నలుంటాయి.

మూడు విధానాల్లో ప్రశ్నలు

  • గేట్‌ పరీక్ష విషయంలో ప్రశ్నలను మూడు విధానాల్లో అడుగుతారు. అవి.. మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌గా పిలిచే ఆబ్జెక్టివ్‌ కొశ్చన్స్‌. రెండో రకం ప్రశ్నలు.. మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌(ఎంఎస్‌క్యూ). మూడో విధానంలో న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌(ఎన్‌ఏటీ) కొశ్చన్స్‌ ఉంటాయి. 
  • ఎంసీక్యూ విధానంలో నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది.
  • మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌ విధానంలో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉండే ప్రశ్నలు అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. సంబంధించిన టాపిక్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగుండాలి. 
  • న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి.

సన్నద్ధతకు శ్రీకారం

గేట్‌ అభ్యర్థులు సన్నద్ధతకు శ్రీకారం చుట్టే ముందు.. పరీక్ష విధానంపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందుకోసం ముందుగా తాము ఎంపిక చేసుకున్న, అర్హత ఉన్న సబ్జెక్ట్‌కు సంబంధించి సిలబస్‌ను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించడంతోపాటు ఆయా టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి. దానికి అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ వ్యూహాలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఏ మాత్రం జాప్యం చేయకుండా.. గేట్‌–2022 విజయ సాధన దిశగా అడుగులు ప్రారంభించాలి.

చ‌ద‌వండి: ఉన్నత విద్యావకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు

బేసిక్స్‌పై పట్టు

గేట్‌లో మంచి స్కోర్‌ సాధించి ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌ వరకూ.. అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులోని ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించి.. దానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ఒక టాపిక్‌ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకోవాలి. ఆ మేరకు సాధన చేయాలి. దీంతో పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.

కో–ఆర్డినేషన్‌ అప్రోచ్‌

గేట్‌ అభ్యర్థులు కో–ఆర్డినేషన్‌ అప్రోచ్‌ను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా సిలబస్‌ను పూర్తిగా పరిశీలించి.. ఒక స్పష్టత ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత గేట్‌ సిలబస్‌ను అకడమిక్‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్‌ పూర్తి చేసుకునేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఉన్న వ్యవధిలో ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరయ్యే విధంగా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే పరీక్షలో మంచి స్కోర్‌ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

‘ఆన్‌లైన్‌’పై అవగాహన

గేట్‌ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఆన్‌లైన్‌ పరీక్ష విధానంపైగా ముందుగానే అవగాహన పెంచుకోవాలి. వర్చువల్‌ కాలిక్యులేటర్‌ వినియోగం, ఆన్‌–స్క్రీన్‌ ఆన్సర్స్‌ రికగ్నిషన్‌ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం వీలైతే ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుంది.

చ‌ద‌వండి: గేటు దాటకుండానే జాక్‌పాట్‌..|| ముగ్గురికి రూ.32 లక్షల జీతం..|| IT Jobs

స్వీయ విశ్లేషణ.. ఎంతో ముఖ్యం

గేట్‌–2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో జరగనుంది. అంటే.. అభ్యర్థులకు ఇప్పటి నుంచి దాదాపు ఆరు నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్‌లలో తమ బలాలు, బలహీనతలపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఇందుకోసం సిలబస్‌ను పరిశీలించడం ఎంతో మేలు చేస్తుంది. ఇలా చేసిన తర్వాత.. బలహీనంగా ఉన్న టాపిక్స్‌కు పరీక్షలో లభిస్తున్న వెయిటేజీని పరిశీలించాలి. ఎక్కువ వెయిటేజీ ఉంటుందని భావిస్తే.. నవంబర్‌ నాటికి ఆ టాపిక్స్‌పై పట్టు సాధించేలా కృషి చేయాలి.

బుక్స్‌ తోడుగా

గేట్‌ గత ప్రశ్నలు, పరీక్ష తీరుతెన్నుల పరిశీలిస్తే అకడమిక్‌ పుస్తకాల నుంచే ప్రశ్నలు అడుగుతున్న విషయం స్పష్టమవుతోంది. ఈ ప్రశ్నలు ఇంటర్‌ రిలేటెడ్‌ టాపిక్స్‌ నుంచి అడుగుతున్నారు. కాబట్టి ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు..దానికి సంబంధించి.. పూర్వాపరాలు ఉన్న పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రతి అంశానికి సంబంధించి.. మూల భావనలు, కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌.. అన్నింటినీ క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. అదే విధంగా ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పాత ప్రశ్న పత్రాల సాధన కూడా గేట్‌ విజయంలో ఉపయుక్తంగా ఉంటుంది.

మలి దశ.. ఇలా

గేట్‌ స్కోర్‌ అనేది ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి తొలి మెట్టు మాత్రమే. ఆ తర్వాత దశలో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఐఐటీలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ ప్రక్రియలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆయా ఐఐటీలు గ్రూప్‌ పర్సనల్‌ టాస్క్, గ్రూప్‌ డిస్కషన్స్‌ పేరిట రెండు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు ఎస్సేలు కూడా రాయాలని కోరుతున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే ప్రవేశం ఖరారవుతుంది.

పీఎస్‌యూలకూ.. గేట్‌ స్కోర్‌

గేట్‌ స్కోర్‌తో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఎంట్రీ లెవల్‌ నియామకాలను చేపడుతున్నాయి.ఇవి కూడా గేట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తులు ఆహ్వానించి.. నిర్దిష్ట కటాఫ్‌ను నిర్ణయించి మెరిట్‌ జాబితా రూపొందిస్తున్నాయి. ఆ జాబితాలో నిలిచిన వారికి.. మలిదశ ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, గ్రూప్‌ పర్సనల్‌ టాస్క్‌ వంటి టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి కొలువులు ఖరారు చేస్తున్నాయి. ఫైనల్‌ మెరిట్‌ జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గేట్‌ స్కోర్‌కు 70 శాతం, మలిదశ ఎంపిక ప్రక్రియలకు 30 శాతం వెయిటేజిని కల్పిస్తున్నాయి.

650కు పైగా స్కోర్‌ సాధిస్తేనే

గేట్‌లో విజయం ద్వారా ఐఐటీల్లో సీట్లు, పీఎస్‌యూ కాల్స్‌ ఆశించాలంటే.. గేట్‌లో కనీసం 650కు పైగా స్కోర్‌ సాధించేందుకు కృషి చేయాలి. దాదాపు అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కనీస కటాఫ్‌ను 600గా నిర్దేశిస్తున్నాయి. తుది ఎంపికలో టాప్‌ బ్రాంచ్‌లలో ఫైనల్‌ కటాఫ్‌ 800 వరకు ఉంటోంది. కాబట్టి సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ, ఈఈఈ, మెకానికల్‌ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు.. ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. 

గేట్‌–2023 సమాచారం

  • గేట్‌ 2023 మొత్తం పేపర్ల సంఖ్య: 29
  • అర్హత: ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌/కామర్స్‌/సైన్స్‌/ఆర్ట్స్‌ విభాగాల్లో అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ మూడో సంవత్సరం చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్‌లో 
  • గేట్‌–2022 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: 2023 ఫిబ్రవరి 4,5,11,12 తేదీల్లో(ప్రతి రోజు రెండు స్లాట్లలో)
  • వెబ్‌సైట్‌: https://gate.iitk.ac.in

గేట్‌ ముఖ్యాంశాలు

  • గేట్‌ ద్వారా ఎంటెక్‌ సీటు పొందిన వారికి నెలకు రూ.12,400 స్టయిపండ్‌.
  • ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.28 వేల స్కాలర్‌షిప్‌.
  • రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో ఎంటెక్‌ కోర్సుల్లో గేట్‌ విజేతలకు తొలి ప్రాధాన్యం. 
  • పీఎస్‌యూల్లో నియామకాలకు గేట్‌ స్కోర్‌ ఆధారం.
Published date : 28 Jul 2022 04:11PM

Photo Stories