Skip to main content

GATE-2022: గేట్‌.. గెలుపు బాట ఇలా!

గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌.. సంక్షిప్తంగా గేట్‌! బీటెక్‌ ఉత్తీర్ణులు.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌+పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఇది! గేట్‌ స్కోర్‌ ఆధారంగా.. పలు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో ఇంజనీర్‌ కొలువు సైతం దక్కించుకోవచ్చు. ఇంతటి కీలకమైన గేట్‌లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. గేట్‌ పరీక్ష దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ.. నాలుగు రోజుల పాటు ఎనిమిది సెషన్లలో జరుగనుంది. దాంతో ఇప్పటివరకు సాగించిన ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది! పరీక్ష తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో.. గేట్‌–2022లో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...
GATE-2022: Preparation Guidance for Success
GATE-2022: Preparation Guidance for Success
  • ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ‘గేట్‌’
  • పరీక్ష సమయం: మూడు గంటలు
  • 65 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష
  • ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టాల్సిన సమయం
  • ఉన్నత విద్యతోపాటు పీఎస్‌యూ కొలువుకు మార్గం

వాస్తవానికి గేట్‌–2022 పరీక్ష తేదీల విషయంలో గత కొన్ని రోజులుగా ఎన్నో ఊహాగానాలు వ్యాపించాయి. పరీక్ష వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. అంతేకాకుండా కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పలువురు అభ్యర్థులు కూడా పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఇలాంటి వాటికి తావు లేకుండా.. గేట్‌ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు నాలుగు రోజుల పాటు ఎనిమిది సెషన్లలో యథాతథంగా జరుగుతాయని నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌.. ఐఐటీ–ఖరగ్‌పూర్‌ వెబ్‌సైట్‌ను చూస్తే స్పష్టమవుతోంది. జనవరి 15వ తేదీ నుంచే హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. దీంతో పరీక్ష నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే జరగనుందని.. అభ్యర్థులు ఈ పది రోజుల్లో తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

అందుకే.. లక్షల్లో పోటీ
ఒకవైపు ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌+పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో చేరే అవకాశం.. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకునేందుకు గేట్‌ స్కోర్‌ ప్రామాణికంగా నిలుస్తోంది. అందుకే గేట్‌కు ఏటేటా పోటీ పెరుగుతోంది. ఏటా ఎనిమిది లక్షలకు పైగా అభ్యర్థులు గేట్‌కు హాజరవుతున్నారు. ఈ ఏడాది కూడా ఇంతే సంఖ్యలో అభ్యర్థులు గేట్‌ పరీక్ష రాసే అవకాశం ఉంది. కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుందని భావించొచ్చు.

రివిజన్‌.. రివిజన్‌
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు పునశ్చరణకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటివరకు చదివిన అంశాలు, వాటికి సంబంధించి ముఖ్యమైన పాయింట్లు, ఫార్ములాలతో రూపొందించుకున్న సొంత నోట్స్‌ను పరిశీలిస్తూ రివిజన్‌ చేయాలి. దీనివల్ల తక్కువ సమయంలోనే ఆయా అంశాలను మరోసారి చదివే వీలు ఏర్పడుతుంది. ప్రతి రోజు సిలబస్‌లోని అన్ని యూనిట్లు చదివేలా.. నిర్దిష్టంగా సమయం కేటాయించుకోవాలి. తమకు అనుకూలమైన రీతిలో టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి.

ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు
గేట్‌ అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లను మరోసారి అవలోకనం చేసుకోవాలి. ముఖ్యంగా మెకానికల్, సీఎస్‌ఈ, ఈసీఈ అభ్యర్థులకు ఇది ఎంతో కీలకమైన సాధనం. అదే విధంగా ఇతర సబ్జెక్ట్‌ల విషయంలోనూ ఈ విధానం పరీక్ష హాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు దోహదం చేస్తుంది. అప్లికేషన్‌ అప్రోచ్‌ ఉంటే.. పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. తద్వారా మంచి స్కోర్‌ సాధనలో ముందంజలో నిలిచే ఆస్కారం ఉంటుంది.

మాక్‌ టెస్ట్‌లు

  • లాస్ట్‌ మినిట్‌ ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలో మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. వాటి ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక టాపిక్‌లో తక్కువ మార్కులు వచ్చినా.. ఇప్పుడు కొత్తగా వాటిని చదవాలనే ప్రయత్నం సరికాదు. దీనికి బదులు బాగా పట్టున్న సబ్జెక్ట్‌లలో మరింత మెరుగ్గా రాణించే విధంగా వ్యవహరించాలి. 
  • అభ్యర్థులు గేట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘మాక్‌ టెస్ట్‌’ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ఇతర మాక్‌ టెస్ట్‌లతో పోల్చితే.. అధికారిక వెబ్‌సైట్‌లోని మాక్‌ టెస్ట్‌లు.. పరీక్ష విధానంపై, ప్రశ్నలు అడిగే తీరుపై అవగాహనను మరింత పెంచుతాయి. కాబట్టి ప్రస్తుత సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.


వర్చువల్‌ కాలిక్యులేటర్‌
అభ్యర్థులు వర్చువల్‌ కాలిక్యులేటర్‌ వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. 65 ప్రశ్నలతో మూడు గంటల వ్యవధిలో జరిగే పరీక్షలో అంచెల వారీగా సాధన చేసి సమాధానం రాబట్టే ప్రశ్నలు కూడా ఉంటాయి. మొత్తం ప్రశ్నల్లో 80 నుంచి 90 శాతం ప్రశ్నలు కాలిక్యులేటర్‌ను వినియోగించాల్సిన విధంగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వర్చువల్‌ కాలిక్యులేటర్‌ను వేగంగా వినియోగించే నైపుణ్యం పెంచుకోవాలి. ఫలితంగా ఒక ప్రశ్నకు వీలైనంత త్వరగా సమాధానం ఇచ్చే నేర్పు లభిస్తుంది.

నిబంధనలు, డాక్యుమెంట్లు
అభ్యర్థులు పరీక్ష నిబంధనలు, పరీక్ష హాల్లోకి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్‌ను ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. గేట్‌ నిర్వాహక కమిటీ నిబంధనల ప్రకారం–అప్లికేషన్‌ సమయంలో పేర్కొన్న వ్యక్తిగత ఫోటో ఐడెంటిటీ కార్డ్‌ ఒరిజినల్‌ కాపీని పరీక్ష హాల్లో చూపించాల్సి ఉంటుంది. పరీక్షకు ఒకట్రెండు రోజుల ముందు తీసుకోవచ్చు కదా..అనే ఆలోచన సరికాదు.చివరి క్షణంలో టెక్నికల్‌ ఎర్రర్స్, వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ పెరిగి.. ఇబ్బందులు ఎదురుకావచ్చు. కాబట్టి వీలైనంత ముందుగా అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోని ప్రింట్‌ తీసుకోవాలి.

పరీక్ష రోజు ఇలా

  • పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సంబంధిత పోర్టల్‌లో నిర్దిష్ట స్లాట్‌కు 20 నిమిషాల ముందుగానే లాగిన్‌ అయ్యే సదుపాయం ఉంది. అభ్యర్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ఫలితంగా పరీక్షకు సంబంధించి ముఖ్యమైన నియమ నిబంధనలు పూర్తిగా చదివే సమయం ఉంటుంది. 
  • సమాధానాలకు ఉపక్రమించే ముందు.. ఆన్‌లైన్‌ విండోలో ‘వ్యూ ఆల్‌ కొశ్చన్స్‌’ ట్యాబ్‌ పై క్లిక్‌ చేయడం మేలు. దీనివల్ల అన్ని ప్రశ్నలను చదివే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్న లేదా సెక్షన్‌ను ముందుగా ప్రారంభించొచ్చు అనే విషయంపై స్పష్టత లభిస్తుంది. ముందుగా సులువైన ప్రశ్నలు లేదా తమకు బాగా అవగాహన ఉన్న సెక్షన్స్‌ను ఎంచుకుని.. వాటిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత క్లిష్టమైన సెక్షన్‌లు, ప్రశ్నల వైపు దృష్టి సారించొచ్చు. 
  • గేట్‌లో.. ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ సెక్షన్స్‌ కొంత సులభంగా ఉంటాయి. అభ్యర్థులు ముందుగా వీటికి సమాధానం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. దీనివల్ల ఈ సెక్షన్లను తక్కువ సమయంలో పూర్తి చేసుకుని.. ఆ తర్వాత సమయంలో సబ్జెక్ట్‌ ఆధారిత సెక్షన్లకు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలవుతుంది.
  • మొత్తం మూడు గంటల సమయంలో మొదటి గంటన్నర.. తమకు బాగా సులువుగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
  • ఏదైనా క్లిష్టమైన ప్రశ్న కనిపిస్తే..దాన్ని వదిలేసి.. వేరే ప్రశ్నకు వెళ్లాలి. 
  • నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. కాబట్టి సమాధానం తెలియని ప్రశ్నలని వదిలి వేయడమే మేలు.
  • అభ్యర్థులు చివరగా సమాధానాల రివ్యూకు కూడా కొంత సమయం కేటాయించాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాం అనే స్పష్టతకు వచ్చాక.. మరోసారి సమాధానాలను సరిచూసుకోవాలి. 
  • సమాధానాలిచ్చే క్రమంలో రఫ్‌ వర్క్‌ చేయడం కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఫార్ములా ఆధారిత ప్రశ్నల విషయంలో ఇది ఎంతో అవసరం. ఎగ్జామ్‌ హాల్లో అందించే స్క్రిబిల్‌ ప్యాడ్‌పై ప్రశ్నను సాల్వ్‌ చేసి.. ఆ సమాధానం కరెక్ట్‌ అనుకున్నప్పుడే దానికి సంబంధించిన ఆప్షన్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
  • పరీక్షకు ఒక రోజు ముందుగానే తమకు కేటాయించిన సెంటర్‌ వివరాలు తెలుసుకోవాలి.
  • పరీక్షకు ముందు రోజు పూర్తిగా మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. 
  • పరీక్ష సమయం వరకు చదువుదాం అనే ధోరణి వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

గేట్‌తో ప్రయోజనాలు

  • గేట్‌ స్కోర్‌తో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌+పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం లభిస్తుంది.
  • రాష్ట్రాల స్థాయిలో పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో గేట్‌ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఉంటుంది.
  • గేట్‌ ర్యాంకు ఆధారంగా ఎంటెక్‌ సీటు ఖరారు చేసుకుంటే..నెలకు రూ. 12,400 స్టయిపండ్‌ అందుతుంది.
  • ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, పీహెచ్‌డీ అభ్యర్థులకు నెలకు రూ.28వేల స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.
  • గేట్‌ స్కోర్‌ ఆధారంగా నవరత్న, మహారత్న, మినీరత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఇంజనీర్లుగా కొలువులు సొంతం చేసుకోవచ్చు. దాదాపు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు గత కొన్నేళ్లుగా గేట్‌ స్కోర్‌ ఆధారంగానే ఈ పోస్ట్‌ల భర్తీ చేపడుతున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు ఆయా సంస్థలు విడుదల చేసే నోటిఫికేషన్లకు అనుగుణంగా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కటాఫ్‌ను నిర్దేశించి.. ఆ జాబితాలో ఉన్న వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ,గ్రూప్‌ టాస్క్‌ వంటివి నిర్వహించి తుది విజేతలను నిర్ణయిస్తున్నాయి. తుది విజేతల జాబితాలో నిలిచిన వారికి కొలువులు ఖరారు చేస్తున్నాయి.

గేట్‌ –2022 ముఖ్య తేదీలు

  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జనవరి 15 నుంచి అందుబాటులోకి వచ్చింది.
  • గేట్‌–2022 ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో.. రోజుకు రెండు స్లాట్లలో పరీక్ష జరుగుతుంది. 
  • ఫలితాల వెల్లడి: మార్చి 17, 2022
  • వెబ్‌సైట్‌: https://gate.iitkgp.ac.in/index.htm
Published date : 01 Feb 2022 06:06PM

Photo Stories