GATE 2024తో పీఎస్‌యూ కొలువులు.. ఎంపిక ప్రక్రియ, విజయానికి మార్గాలు..
- గేట్ స్కోర్‌తో పీఎస్‌యూల్లో నియామకాలు
- నవరత్న,మహారత్న,మినీరత్న సంస్థల్లో ఉద్యోగాలు
- నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న పీఎస్‌యూలు
- మలి దశ ప్రక్రియపై అవగాహనతో కొలువు
- 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్ష
బీటెక్ ఉత్తీర్ణుల్లో ఎక్కువ మంది సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనే తపనతో ఉంటారు. అందుకోసం బీటెక్ అర్హతగా నిర్వహించే అన్ని నియామక పరీక్షలకు పోటీ పడుతుంటారు. గేట్ స్కోర్‌తో ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలతోపాటు మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువును దక్కించుకునే అవకాశముంది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్‌లో ఇంజనీర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ డొమైన్ నాలెడ్జ్‌ను పెంచుకుంటే.. గేట్‌లో ఉత్తమ స్కోర్ సాధించి.. పీఎస్‌యూల్లో ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.
మలి దశ ఎంపిక ఇలా
ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఇలా గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. మలి దశలో గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. తుది జాబితా ఖరారులో వీటికి వెయిటేజీని కేటాయిస్తున్నాయి. దానికి అనుగుణంగా నిర్దిష్ట కటాఫ్ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తున్నాయి.
చదవండి: Campus Placement: క్యాంపస్ డ్రైవ్స్.. ఆఫర్ దక్కేలా!
గేట్‌కు 75 శాతం వెయిటేజీ
తుది జాబితా రూపకల్పనలో పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ; గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్‌లకు గరిష్టంగా పది శాతం; పర్సనల్ ఇంటర్వ్యూకు పదిహేను శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. మరికొన్ని పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు 60నుంచి 65శాతం వెయిటేజీ ఇస్తూ.. మిగతా మొత్తాన్ని జీడీ/పీఐలకు కేటాయిస్తున్నాయి.
గ్రూప్ డిస్కషన్
మలిదశ ఎంపిక ప్రక్రియలో ముందుగా గ్రూప్ డిస్కషన్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో అభ్యర్థుల భావ వ్యక్తీకరణ , సమకాలీన, సాంకేతిక అంశాలపై పరిజ్ఞానాన్ని పరిశీలిస్తున్నారు. గ్రూప్ డిస్కషన్‌లో నిర్దిష్ట సంఖ్యలో అభ్యర్థులను వేర్వేరు బృందాలు (టీమ్స్)గా ఏర్పరుస్తాయి. ఒక్కో టీమ్‌లో అయిదు నుంచి పది మంది అభ్యర్థులు ఉంటున్నారు. ప్రతి టీమ్‌కు ఏదైనా ఒక అంశం ఇచ్చి.. ప్రతి అభ్యర్థిని మాట్లాడాలని సూచిస్తారు. ఈ గ్రూప్ డిస్కషన్ ఇరవై నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ప్రతి అభ్యర్థికి సగటున అయిదు నుంచి ఆరు నిమిషాల సమయం లభిస్తుంది.
గ్రూప్ టాస్క్
పలు పీఎస్‌యూలు గ్రూప్ డిస్కషన్‌కు బదులుగా గ్రూప్ టాస్క్‌ను నిర్వహిస్తున్నాయి. గ్రూప్ టాస్క్ అంటే.. నిర్దిష్టంగా ఒక వాస్తవ సమస్యను అభ్యర్థుల ముందుంచి.. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని సూచిస్తారు. వీటిని కూడా అభ్యర్థులు టీమ్‌లుగా ఏర్పడి పరిష్కరించాల్సి ఉంటుంది. గ్రూప్ టాస్క్ అభ్యర్థుల డొమైన్ టాపిక్స్‌కు సంబంధించి ఉంటుంది. దీనిద్వారా అభ్యర్థుల ప్రాక్టికల్ నైపుణ్యాలు తెలుసుకోవడమే కాకుండా.. సమస్య పరిష్కార సామర్థ్యాన్ని సైతం అంచనా వేస్తారు.
చదవండి: JEE Main 2024: జేఈఈ మెయిన్ పరీక్ష విధానం.. సబ్జెక్ట్ వారీగా ముఖ్యమైన టాపిక్స్..
చివరగా.. ఇంటర్వ్యూ
గేట్ స్కోర్ ఆధారంగా నియామక ప్రక్రియలో చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూ. గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు వీటిని నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్జ్‌లను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. బీటెక్‌లో చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్.. వాటి వల్ల సదరు అభ్యర్థులకు లభించిన నైపుణ్యాలు పరిశీలిస్తారు. దీంతో పాటు వ్యక్తిగతంగా సదరు పోస్ట్‌లకు సరిపడే అప్టిట్యూడ్, అటిట్యూడ్ అభ్యర్థికి ఉందా అనే కోణంలో కూడా పరిశీలిస్తారు.
కటాఫ్ నిబంధన
సంస్థలు నిర్దిష్ట కటాఫ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఈ కటాఫ్‌లు.. అందుబాటులో ఉన్న ఖాళీలు, వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఉంటున్నాయి. గత రెండేళ్లుగా పీఎస్‌యూలకు దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే గేట్ స్కోర్ కటాఫ్ కూడా పెరుగుతూ వస్తోంది. జనరల్ కేటగిరీలో 750 నుంచి 800 మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీలో 500 నుంచి 600 మార్కులు సాధిస్తేనే మలి దశకు అవకాశం లభిస్తుంది.
గేట్–2024 విధానం
గేట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. వంద మార్కులకు రెండు విభాగాల్లో పరీక్ష ఉంటుంది. మొత్తం 65 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్–1లో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 15 మార్కులు కేటాయిస్తారు. ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 13 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌పై పార్ట్–బి ఉంటుంది. ఈ విభాగంలో 72 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇలా మొత్తం 100 మార్కులకు గేట్ పరీక్ష జరుగుతుంది.
మూడు రకాల ప్రశ్నలు
గేట్ పరీక్షలో ప్రశ్నలు మూడు విధాలుగా ఉంటాయి. అవి.. మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్, మల్టిపుల్‌సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్‌క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్(ఎన్‌ఏటీ) కొశ్చన్స్. ఎంసీక్యూ విధానంలో నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉండే ప్రశ్నలు అడుగుతారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. సదరు ప్రశ్నకు సంబంధించిన టాపిక్‌పై సంపూర్ణ అవగాహన కలిగుండాలి. న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి.
చదవండి: GATE-2024 Notification: గేట్‌తో ప్రయోజనాలు, కొత్త మార్పులు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
మంచి స్కోర్‌కు మార్గాలివే
గేట్‌లో బెస్ట్ స్కోర్ కోసం అభ్యర్థులు ప్రస్తుత సమయంలో వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇందుకోసం తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ వరకు పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులోని ప్రశ్నార్హమైన వాటిని గుర్తించాలి. దానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో గుర్తించాలి. దానికి అనుగుణంగా సాధన చేయాలి. గేట్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అనుసంధాన విధానాన్ని అలవర్చుకోవాలి. గేట్ సిలబస్‌ను అకడమిక్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. వీక్లీ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
వెయిటేజీని పరిశీలిస్తూ
గేట్‌లో ఆయా టాపిక్స్‌కు గత అయిదారేళ్లుగా లభిస్తున్న వెయిటేజ్, అకడమిక్‌గా ఉన్న ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఆ తర్వాత మిగిలి ఉన్న వ్యవధిలో ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకోవాలి.
పీఎస్‌యూ నోటిఫికేషన్లు
గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలకు ఇప్పటికే పలు పీఎస్‌యూలు నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. మరికొద్ది రోజుల్లో మరిన్ని సంస్థలు నోటిఫికేషన్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
గేట్–2024 ముఖ్య సమాచారం
- మొత్తం 30 పేపర్లలో గేట్–2024.
- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2023.
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: నవంబర్‡7 – 11, 2023.
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: జనవరి 3, 2024.
- గేట్–2024 తేదీలు: 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో పరీక్ష.
- ఫలితాల వెల్లడి: మార్చి 16, 2024.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://gate2024.iisc.ac.in/
Tags
- GATE 2024
- GATE 2024 Important Dates
- Engineering
- PSU Jobs
- Graduate Aptitude Test
- Institutes
- admissions
- GATE score
- Govt Jobs
- interview
- Personal interview
- IIT admissions
- NIT M.Tech Programs
- GATE-2024 Exam
- Success in GATE Exam
- Trainee Engineer Positions
- PSU Admission Process
- latest jobs in 2023
- sakshi education jobs applications