Skip to main content

Campus Placement: క్యాంపస్‌ డ్రైవ్స్‌.. ఆఫర్‌ దక్కేలా!

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ కోసం ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు! ఎందుకంటే.. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ అత్యంత కీలకం!! ఏటా కార్పొరేట్‌ కంపెనీలు కాలేజీల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఈ నియామక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ఉజ్వల కెరీర్‌కు మార్గం సుగమం అవుతుంది. వచ్చే నెల నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ కళాశాలల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. క్యాంపస్‌ డ్రైవ్స్‌ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఇందులో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
Interview skills, importance of campus placement, Campus placement guidelinesJob offers
  • వచ్చే నెల నుంచే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌
  • పలు రౌండ్లలో విద్యార్థుల నైపుణ్యాల పరిశీలన
  • ముందస్తు సంసిద్ధతతో కొలువు ఖాయం
  • విజయంలో కీలకం కోర్‌ స్కిల్స్, సాఫ్ట్‌ స్కిల్స్‌. 
  • టెక్నికల్, పర్సనల్, హెచ్‌ఆర్‌ రౌండ్ల ద్వారా ఎంపిక 

ప్రతి ఏటా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ను సంస్థలు నవంబర్‌లో ప్రారంభించి.. దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగిస్తాయి. ముందుగా కంపెనీలు టైర్‌-1 ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన ఐఐఎంలు, ఐఐటీలకు వెళుతున్నాయి. ఆ తర్వాత దశలో ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహిస్తున్నాయి. ఐఐఎంలు, ఐఐటీల్లో నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు దశల వారీగా క్యాంపస్‌ నియామకాలు జరుగుతున్నాయి. తొలి దశలో టాప్‌ కార్పొరేట్‌ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆ తర్వాత దశల్లో ఇతర సంస్థలు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నాయి.

మూడు రౌండ్లలో
సంస్థలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను మూడు రౌండ్లలో నిర్వహిస్తుంటాయి. అవి..టెక్నికల్‌ రౌండ్, టెక్నికల్‌ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ.

చ‌ద‌వండి: JEE Main 2024: జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం.. సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యమైన టాపిక్స్‌..

టెక్నికల్‌ రౌండ్‌
మొదటి దశలో నిర్వహించే టెక్నికల్‌ రౌండ్‌లో అభ్యర్థుల డొమైన్‌ నైపుణ్యాలను పరీక్షిస్తారు. డొమైన్‌ నైపుణ్యాల నుంచి సదరు రంగానికి సంబంధించి తాజా నైపుణ్యాల వరకూ.. అన్నింటిపైనా ప్రశ్నలు సంధించే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఐఓటీ వంటి వాటిపై అవగాహన పెంచుకొని టెక్నికల్‌ రౌండ్‌కు హాజరవడం మేలు చేస్తుంది.

సెకండ్‌ రౌండ్‌
పలు కంపెనీలు రెండో రౌండ్‌ ఇంటర్వ్యూను సైతం టెక్నికల్‌ రౌండ్‌గా పేర్కొంటున్నాయి. ఈ దశ­లో ప్రధానంగా అభ్యర్థుల ప్రాక్టికల్‌ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. అందుకోసం ఏదైనా ఒక రియల్‌ టైం టాస్క్‌­ను ఇచ్చి.. దాన్ని పరిష్కరించమని అడుగుతున్నారు. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల విషయంలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. రెండో రౌండ్‌లో విజయం కోసం విద్యార్థులు బేసిక్‌ స్కిల్స్‌ అయిన కోడింగ్, ప్రోగ్రామింగ్‌లపై పట్టు సాధించాలి. 

హెచ్‌ఆర్‌ రౌండ్‌
క్యాంపస్‌ డ్రైవ్స్‌లో చివర దశ.. హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ. టెక్నికల్, సబ్జెక్ట్‌ నైపుణ్యాల ఆధారంగా తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు ఈ రౌండ్‌ ఉంటుంది. ఇందులో వ్యక్తిగత లక్షణాలు, అప్టిట్యూడ్, అటిట్యూడ్‌లను పరిశీలిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ బాడీ లాంగ్వేజ్, వస్త్రధారణ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాలు హావభావాల వ్యక్తీకరణ హుందాగా ఉండేలా చూసుకోవాలి.

లక్ష్యంపై స్పష్టత
హెచ్‌ఆర్‌ రౌండ్‌లో విజయ సాధించాలంటే.. అభ్యర్థులకు తమ లక్ష్యంపై స్పష్టత అవసరం. 'మీ భవిష్యత్‌ లక్ష్యాలు చెప్పండి?'.. హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో సంస్థ ప్రతినిధులు అడిగే ప్రశ్న ఇది. ఆ లక్ష్యాల సాధనకు సంస్థలో పని చేయడం ఎలా ఉపయోగపడుతుంది? అనేది మరో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలతో సంసిద్ధులై ఉండాలి. భవిష్యత్తు లక్ష్యాల విషయంలో సందిగ్ధత కనబరిస్తే.. అవకాశం చేజారే ఆస్కారముంది. 

చ‌ద‌వండి: Full Stack Developer: ఈ టూల్స్ నేర్చుకుంటే ఫుల్‌ డిమాండ్‌... అర్హతలేంటంటే

ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌
ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ సైతం ప్లేస్‌మెంట్‌ ప్రక్రియలో కీలకంగా నిలుస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్‌ల పరిధిలో నిర్వహించే అకడమిక్‌ సంబంధిత సెమినార్లు, లెక్చర్స్‌తోపాటు ఆటపాటల్లో చురుగ్గా ఉండాలి. వీలైతే వాటిని లీడ్‌ చేసే విధంగా వ్యవహరించాలి. కారణం.. ఇటీవల కాలంలో కంపెనీలు అభ్యర్థుల ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ని కూడా బేరీజు వేస్తున్నాయి.దీనిద్వారా లీడర్‌షిప్‌ స్కిల్స్,సాఫ్ట్‌ స్కిల్స్, పీపుల్‌ స్కిల్స్, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను అంచనా వేస్తున్నారు.

వ్యక్తిగత లక్షణాలు
అద్భుతమైన జీపీఏలు, ప్రాజెక్ట్‌ వర్క్‌ రిపోర్ట్స్‌ ఆధారంగా ఆఫర్లు ఖరారు చేసే కాలం మారింది. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో కంపెనీలు అభ్యర్థుల నుంచి మరెన్నో లక్షణాలు కోరుకుంటున్నాయి. సబ్జెక్ట్‌కు సంబంధించి కోర్‌ నైపుణ్యాలతోపాటు కాంటెంపరరీ స్కిల్స్‌ ఉండాలని భావిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు క్యాంపస్‌ డ్రైవ్స్‌లో విజయం దిశగా తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.

రెజ్యూమే.. స్కిల్స్‌ తెలిపేలా
క్యాంపస్‌ డ్రైవ్స్‌లో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసేందుకు కంపెనీలు ఉపయోగించే మొదటి సాధనం.. రెజ్యూమే. దీన్ని ఒకట్రెండు పేజీలకు పరిమితం చేయాలి. ముఖ్యంగా అకడమిక్‌ రికార్డ్, దానికి అనుబంధ నైపుణ్యాలకు సంబంధించి సమాచారం ఇచ్చేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్‌డేటెడ్‌ స్కిల్స్‌తో తమ వ్యక్తిగత సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్స్‌ను పొందుపరిస్తే.. రిక్రూటర్స్‌ వాటి ఆధారంగా అభ్యర్థి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు వీలవుతుంది. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, సోషల్‌ నెట్‌వర్క్‌ ఫాలోయర్స్‌ ఆధారంగా అభ్యర్థి నిజమైన ఆసక్తిని తెలుసుకునే వీలుంది.

చ‌ద‌వండి: Tech skills: ఈ స్కిల్స్ నేర్చుకోండి... టెక్ జాబ్ పట్టండి

ఆఫర్స్‌ ఖరారు
క్యాంపస్‌ ఆఫర్స్‌ ఖరారు చేయడంలో సంస్థలు కొన్నిసార్లు వినూత్న మార్గాలను అనుసరిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ హ్యాకథాన్‌లు  నిర్వహించడం, అభ్యర్థులను బృందాలుగా ఏర్పాటు చేసి.. టాస్క్‌ను ఇచ్చి నిర్దిష్ట సమయంలో పూర్తి చేయమని పేర్కొంటున్నాయి. దీనికి అనుగుణంగా బృందంలోని అభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో అనుసంధానం అవుతూ సదరు టాస్క్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాకథాన్‌ల ద్వారా టీమ్‌ వర్క్‌ కల్చర్‌ను అంచనా వేయడంతోపాటు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌­లో ఏ విధంగా వ్యవహరించారో తెలుసుకుంటారు.

కోరుకుంటున్న క్వాలిటీస్‌
క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో కంపెనీలు ఎక్కువగా అనలిటికల్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, బృంద నైపుణ్యాలు, సమయ స్ఫూర్తి తదితర అంశాలకు పెద్దపీట వేస్తున్నాయి. వీటికి అనుగుణంగా ప్రాథమిక దశలో నిర్వహించే రిటెన్‌ టెస్ట్‌లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ వంటి అంశాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొనే విద్యార్థులు సంబంధిత  పరిజ్ఞానం పెంచుకోవడం తోపాటు ఆయా సంస్థల గత ప్లేస్‌మెంట్‌ పేపర్స్‌ను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది.

చ‌ద‌వండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్‌ షైన్‌!

ఆఫర్‌ పొందిన వారికి శిక్షణ
ఇటీవల కాలంలో అభ్యర్థుల కోర్‌ బ్రాంచ్‌లతో సంబంధం లేకుండా సంస్థలు జాబ్‌ ప్రొఫైల్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ట్రెండ్‌ ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఐటీ కంపెనీలు కంప్యూటర్‌ సైన్స్, ఐటీ బ్రాంచ్‌లతోపాటు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ల విద్యార్థులను కూడా నియమించుకుంటున్నాయి. చివరి సెమిస్టర్‌లో ఆఫర్స్‌ ఖరారు చేసి.. కోర్సు పూర్తయ్యేలోపు తమ అవసరాలకు అనుగుణంగా శిక్షణనందిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థలు ఆఫర్‌ లెటర్స్‌ పొందిన విద్యార్థులకు శిక్షణనందించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్స్‌ను రూపొందించి అందుబాటులో ఉంచుతున్నాయి. ఫలితంగా ఆఫర్‌ లెటర్‌ పొందిన రోజు నుంచి అపాయింట్‌మెంట్‌ తేదీ నాటికి సంస్థ కార్యకలాపాలపై పూర్తి అవగాహన పొందడంతోపాటు, విధుల్లో చేరిన తొలి రోజు నుంచే చక్కటి పనితీరు ప్రదర్శించేందుకు మార్గం వేస్తున్నాయి.

Published date : 17 Oct 2023 08:42AM

Photo Stories