Engineering Jobs: స్టార్టప్ ఆఫర్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
- ఎంఎన్‌సీల ఫ్రెషర్స్ హైరింగ్‌పై అనుమానాలు
- ఐటీ సంస్థల్లోనూ ఫ్రెషర్స్ నియామకాల్లో తగ్గుదల
- స్టార్టప్ సంస్థల ఆఫర్స్ పెరగనున్నట్లు అంచనా
- స్టార్టప్స్‌లో చేరికపై అభ్యర్థుల్లో సందిగ్ధత
ఐటీ దిగ్గజాల వెనుకంజ
ఈ ఏడాది క్యాంపస్ డ్రైవ్స్‌లో ఫ్రెషర్స్ హైరింగ్స్‌కు ఐటీ సంస్థలు వెనుకంజ వేస్తున్నట్లు ఆయా కంపెనీల ప్రకటనల ద్వారా స్పష్టమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఐటీ దిగ్గజ సంస్థలుగా పేరొందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ తదితర సంస్థలు ఫ్రెషర్స్ హైరింగ్ దాదాపు ఉండకపోవచ్చనే విధంగా ఇప్పటికే సంకేతాలిచ్చాయి. ఇన్ఫోసిస్ సంస్థ.. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా ఫ్రెషర్స్ నియామకాలు ఉండవని స్పష్టం చేసింది. హెచ్‌సీఎల్‌లో గత ఆర్థిక సంవత్సరంలో 28 వేల మంది ఫ్రెషర్స్‌ను ఈ సంస్థ నియమించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య పది వేలకు మించే అవకాశంలేదు. ఇదే తీరు ఇతర ఐటీ కంపెనీల్లోనూ కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చదవండి: Campus Placement: క్యాంపస్ డ్రైవ్స్.. ఆఫర్ దక్కేలా!
బెంచ్ ట్యాలెంట్ ఎక్కువగా
ఇప్పటికే ఆయా సంస్థల్లో బెంచ్‌పైన ఉన్న నిపుణులతోపాటు గతేడాది ఆఫర్ లెటర్లు అందుకొని.. శిక్షణ పూర్తి చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో వీరితోనే మానవ వనరుల కొరతను పూడ్చుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా కంపెనీల్లో అట్రిషన్ రేటు కూడా గత ఏడాదితో పోల్చితే బాగా తగ్గిందని.. ఇది కూడా ఫ్రెషర్స్ నియామకాలపై ప్రభావం చూపుతుందనే వాదన వినిపిస్తోంది.
స్టార్టప్ ఆఫర్స్
- ఒకవైపు ఐటీ సంస్థల్లో.. నియామకాల్లో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో స్టార్టప్ సంస్థలు మాత్రం ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి.
- ఫిక్కి-రాండ్ స్టాండ్ నివేదిక ప్రకారం-ఈ ఏడాది స్టార్టప్ సంస్థలు మానవ వనరుల సంఖ్య పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. ఈ సంస్థల్లో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 30శాతం మేరకు నియామకాలు పెరగనున్నాయి.
- పలు స్టార్టప్ సంస్థలు ఎంబీఏ కళాశాలలు, ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్, రాష్ట్ర స్థాయిలోని యూనివర్సిటీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
విద్యార్థుల్లో సందిగ్ధత
ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గుతూ..స్టార్టప్ సంస్థల్లో పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో స్టార్టప్ ఆఫర్స్‌ను అంగీకరించాలా వద్దా అని విద్యార్థులు తర్జనభర్జన పడుతున్నారు. స్టార్టప్స్‌లో వేతనాలు తక్కువగా ఉండడం, ఆ సంస్థల సక్సెస్‌పై సందిగ్ధతే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఒకవేళ స్టార్టప్ సంస్థ విజయం సాధించకపోతే అది తమ కెరీర్‌కు ప్రతికూలంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
చదవండి: Full Stack Developer: ఈ టూల్స్ నేర్చుకుంటే ఫుల్ డిమాండ్... అర్హతలేంటంటే
మరికొందరు భిన్నంగా
స్టార్టప్ ఆఫర్లపై కొంత మంది అభ్యర్థులు వెనకంజ వేస్తుంటే.. మరికొందరు మాత్రం స్టార్టప్ ఆఫర్లను అందుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టార్టప్ సంస్థల్లో చేరితే తమ సృజనాత్మకతను, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వీలవుతుందని వీరు భావిస్తున్నారు. నూతన ఉత్పత్తుల రూపకల్పన, రీసెర్చ్, ఇన్నోవేషన్ పరంగా సదరు స్టార్టప్స్ తమకు అవకాశం కల్పిస్తాయని అంచనావేస్తున్నారు. అందుకే వేతనం తక్కువైనా.. స్టార్టప్ ఆఫర్లు అందుకునేందుకు సిద్ధమవుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
అవగాహనతో మేలు
స్టార్టప్ ఆఫర్స్‌ను ఆమోదించే క్రమంలో అభ్యర్థులు ముందుగా సదరు సంస్థ పనితీరు, మార్కెట్ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. అక్కడ పనిచేస్తున్న మానవ వనరుల సంఖ్యను తెలుసుకోవడం ద్వారా సదరు స్టార్టప్ గమనంపై ఒక అంచనా వచ్చేందుకు ఆస్కారం లభిస్తుంది. వీలైతే అక్కడ పని చేస్తున్న సిబ్బందిని సంప్రదించి వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
పని సంస్కృతి
స్టార్టప్ కంపెనీలో ఆఫర్‌కు ఆమోదం తెలిపేముందు.. అక్కడి పని వాతావరణంపై స్పష్టత పొందాలి. తమకు పని వాతావరణంలో ఇన్నోవేషన్ పరంగా స్వేచ్ఛ ఉంటుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ అలాంటి సంస్కృతి తక్కువగా ఉందంటే ఆ ఆఫర్‌కు 'నో' చెప్పడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి అధికశాతం స్టార్టప్స్‌లో సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందని చెబుతున్నారు. కొన్ని సంస్థల్లో మాత్రం నిర్దేశిత నమూనాలో పని విధానాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
ఆర్థిక ప్రయోజనాలు
స్టార్టప్ ఆఫర్స్‌ను ఆమోదించే క్రమంలో అభ్యర్థులు తమకు అందించే ప్యాకేజ్ గురించి ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని స్టార్టప్ సంస్థలు భారీగా ప్యాకేజీ ప్రకటించినా.. అందులో 40 నుంచి 50 శాతం మాత్రమే నగదు రూపంలో అందిస్తున్నాయి. మిగతా మొత్తాన్ని ఈక్విటీలు, స్టాక్ ఆప్షన్స్ కేటాయింపు వంటి విధానాలను అనుసరిస్తుంటాయి. కాబట్టి అభ్యర్థులు తమ వాస్తవ అవసరాలు, కంపెనీలు అందించే ప్యాకేజీ తీరుతెన్నుల గురించి తెలుసుకోవాలి. నగదు రూపంలో అందించే మొత్తం తమ అవసరాల మేరకు ఉందని భావిస్తేనే సదరు ఆఫర్‌ను అంగీకరించడం మేలు.
చదవండి: Tech skills: ఈ స్కిల్స్ నేర్చుకోండి... టెక్ జాబ్ పట్టండి
స్టార్టప్ సవాలే
స్టార్టప్ సంస్థలంటే అప్పుడే ప్రారంభించిన కంపెనీలు. ప్రొడక్ట్స్, సర్వీస్‌ల గురించి లక్ష్యాలు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ.. వాటి అమలు, కార్యాచరణ ప్రాథమిక దశలోనే ఉంటాయి. వీటికి వాస్తవ రూపమిచ్చి పనిచేయడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. కంపెనీలు తాము ఆఫర్ ఇచ్చిన అభ్యర్థుల నుంచి ఎంతో ఆశిస్తాయి. కాబట్టి ఆమేరకు వాస్తవ ఆసక్తి ఉంటేనే స్టార్టప్ సంస్థల ఆఫర్‌ను ఆమోదించాలి. దీంతోపాటు తమ స్కిల్ సంస్థ ఆఫర్ చేస్తున్న జాబ్ ప్రొఫైల్‌కు సరితూగుతుందో లేదో ముందుగానే పరిశీలించుకోవాలి.
Tags
- Career
- Engineering
- Engineering Jobs
- engineering students
- Placements
- Startup offer
- Campus recruitment trends
- Employment News
- CampusRecruitments
- ITOganizations
- SalaryPackages
- EngineeringStudents
- PlacementsFocus
- CampusDrives
- FreshersRecruitments
- TechIndustry
- StartupHiring
- Talent
- career growth
- iit jobs
- engennering jobs
- sakshi education job notifictions