GATE 2024 Rankers Success Stories : గేట్-2024లో దుమ్మురేపిన జేఎన్‌టీయూకే విద్యార్థులు.. ఏకంగా 189 మంది ర్యాంక్‌లు కొట్టారిలా..
జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంక్‌తో..
వర్సిటీలో అనుభవజ్ఞులైన ప్రతి ప్రొఫెసర్‌కూ ఆయా విభాగాల సబ్జెక్టుల బోధనపై క్యాలెండర్ రూపొందించి, పక్కాగా అమలు చేశారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని గేట్‌లో మంచి ర్యాంకులు సాధించారు. గత మూడేళ్ల కంటే అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఈసీఈ విభాగానికి చెందిన యర్రు లక్ష్మీసాయికృష్ణ ఆలిండియా 10వ ర్యాంక్ సాధించాడు.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో.. 189 మంది విద్యార్థులకు ర్యాంకులు..
సివిల్ విభాగం నుంచి 30 మంది, ఈఈఈ విభాగం నుంచి 65, సీఎస్‌ఈ నుంచి 25, కెమికల్ విభాగం నుంచి 8, పెట్రోలియం ఇంజనీరింగ్ నుంచి 6 చొప్పున విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. కోవిడ్ కారణంగా 2021లో విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు లేకపోవడంతో ఉన్నత విద్యామండలి ఆ ఏడాది ఆన్‌లైన్‌లో గేట్ తరగతులు నిర్వహించగా, 21మంది విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంకులు సాధించారు. 2022లో 38 మంది, 2023లో 45 మంది ర్యాంకులు సాధించగా.. ఈ ఏడాది 189 మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి.. విజయబావుటా ఎగురవేశారు.
గేట్‌లో ర్యాంకులు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆయా విద్యా సంస్థల్లో ఎంటెక్ చదివే వారికి ప్రతి నెలా రూ.12,400 చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తారు.
ఇందుకే టాప్-10 ర్యాంక్ కొట్టా.. : వై.లక్ష్మీసాయికృష్ణ, గేట్ 10వ ర్యాంకర్
నాకు గేట్-2024లో జాతీయ స్థాయిలో 10వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. బీటెక్‌లో 9.32 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించి గేట్ పరీక్షకు సిద్ధమయ్యాను. ఐఐటీ ముంబైలో ఎంటెక్ తరువాత సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే నా లక్ష్యం.
నా లక్ష్యం ఇదే.. : మీసాల సాయి దుర్గా కౌశిక్, 118వ ర్యాంక్
ఆలిండియా స్థాయి ఓపెన్ కేటగిరిలో 118వ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కేంద్ర పరిశోధన సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఎంటెక్ చదివి పరిశోధన రంగంలో అగ్రస్థానంలో నిలవడమే నా ఆశయం.
ఈ ర్యాంకు ఆధారంగానే..
ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థులకు కీలకంగా ఉన్న గేట్ పరీక్షలో మా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉంది. గేట్ శిక్షణ తరగతులను ప్రతి విద్యార్థీ సద్వినియోగం చేసుకుని, మంచి ర్యాంకులు సాధించి, వర్సిటీ ప్రతిష్ట నిలిపారు. గేట్ స్కోర్ ఆధారంగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలతో పాటు ఆసియా దేశాల్లో ఎంఎస్, పీహెచ్‌డీ చేయవచ్చు. ఈ ర్యాంకు ఆధారంగా సింగపూర్‌లోని ప్రముఖ వర్సిటీలు సీట్లు ఇస్తున్నాయి.
– డాక్టర్ జీవీఆర్ ప్రసాద్‌రాజు, ఉప కులపతి, జేఎన్‌టీయూకే
మా సక్సెస్ ప్లాన్..
ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం నుంచే గేట్ పరీక్షపై అవగాహన కల్పిస్తాం. పాత పేపర్ల రివిజన్‌తో పాటు ప్రత్యేకంగా బోధిస్తాం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల స్థాయిని మరింత పెంచారు. ఈ ఏడాది మరింత ప్రతిభ చూపడం సంతోషంగా ఉంది.
– డాక్టర్ కృష్ణప్రసాద్, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూకే