GATE 2024 First Ranker Success Story : యూట్యూబ్ వీడియోలు చూస్తూ.. గేట్-2024లో ఫస్ట్ ర్యాంక్ కొట్టానిలా.. కానీ..
కానీ.. తెలంగాణలోని గజ్వేల్‌కు చెందిన ఏడెల్లి సాయికిరణ్ మాత్రం ఏకంగా గేట్-2024లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మాది సిద్ధిపేట్ జిల్లా గజ్వేల్. అమ్మానాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులే. మా చెల్లి ఇంటర్మీడియట్ చదువుతోంది.
నచ్చని మార్గంలో..
నాకు జేఈఈలో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరాను. చాలా మంది ఆ ర్యాంకుతో కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు అన్నారు. ఎలక్ట్రికల్ ఎందుకు అనేవారు. కానీ నాకు ఈ సబ్జెక్టు బాగా నచ్చింది. అందరూ వెళ్తున్నారని నచ్చని మార్గంలో వెళ్లలేం కదా. అందువల్ల నేను అనుకున్న ఈఈఈలోనే చేరాను. మా అమ్మానాన్నలు కూడా నా నిర్ణయానికి మద్దతిచ్చారు.
ఏడాదికి రూ.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. కానీ..
బీటెక్ పూర్తవుతుంది అనగా ప్రాంగణ ఎంపికల్లో ఏడాదికి రూ.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అందులో చేరిపోదాం అనుకున్నా. 2023 ఏప్రిల్‌లో చదువు పూర్తయ్యింది, అక్టోబరులో ఉద్యోగంలో చేరాలి. కానీ జాయినింగ్ డేట్‌కు రెండు రోజుల ముందు ఆర్థిక మాంద్యం కారణంగా నా జాబ్ ఆఫర్‌ను రివోక్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో కొంచెం గందరగోళానికి గురయ్యాను.
మూడు నెలల కాలంలోనే గేట్ కొట్టానిలా..
అప్పటికే గేట్ పరీక్షకు దరఖాస్తు చేసి ఉన్నాను. ఉద్యోగం వస్తే అందులో చేరి పరీక్షకు సన్నద్ధం అవుదాం అనుకున్నాను. కానీ రాకపోయే సరికి పూర్తిగా గేట్ మీదనే దృష్టిపెట్టాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరీక్ష జరిగింది. అంటే అక్టోబరు చివరి నుంచి ఫిబ్రవరి వరకూ మాత్రమే నాకున్న సమయం. ఈ మూడు నెలల కాలంలో చదవగలనా అనే సందేహం నాకు రాలేదు. అప్పటికే జేఈఈ ర్యాంకు సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలా అయినా ఫస్ట్ ర్యాంకు కొట్టాలని చదవడం మొదలుపెట్టాను.
పూర్తిగా టెస్ట్ సిరీస్‌లు రాయడం..
పరీక్షకు నెల రోజుల సమయం ఉందనగా పూర్తిగా టెస్ట్ సిరీస్‌లు రాయడం మొదలుపెట్టాను. అదే సమయంలో రివిజన్ కూడా చేశాను. సగటున రోజుకు 6 నుంచి 10 గంటలు చదివాను. కచ్చితంగా ఫస్ట్ ర్యాంకు కొట్టాలని ప్రయత్నించినా.. పేపర్ బాగా కష్టంగా వచ్చింది. ఎగ్జామ్ రాశాక ఆశించిన ర్యాంకు రాదేమోనని భయపడ్డాను. ఫలితాలు వచ్చాక లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా అనిపించింది.
ఇంజినీరింగ్ తర్వాత ఎంటెక్‌లో చేరి ఉన్నత విద్యను అభ్యసించడానికి మాత్రమే కాదు.. ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, ఐవోసీఎల్ వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికం.
సులభంగా చదవగలిగే అంశాలను ఎక్కవగా..
సాధారణంగా గేట్ పరీక్ష సన్నద్ధత కోసం విద్యార్థులు ఏడాది వరకూ సమయం కేటాయిస్తారు. కానీ నాకు దొరికింది కేవలం మూడు నెలలు. అందువల్ల బేసిక్స్ చదవడానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఎగ్జామ్‌కి ఏది ముఖ్యం, ప్రశ్న ఎలా రావచ్చు అనేది ఆలోచిస్తూ చదువుతూ వెళ్లాను. కొన్ని చాప్టర్లకు యూట్యూబ్ వీడియోలు.. తక్కువ సమయంలో ఎక్కువ విషయం చెప్పేవి ఎంచుకుని చూసేవాడిని. మరికొన్నింటికి పుస్తకాలు చదివాను. సులభంగా చదవగలిగే అంశాలు, ఎక్కువ మార్కుల వెయిటేజీ కలిగిన పాఠాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ మిగతావాటిని రెండో ప్రాదాన్యతతో చదువుకున్నాను.
ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తున్నా..
పరీక్ష ఏదైనా ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పూర్తి ప్రయత్నం చేస్తే ఫలితం లభిస్తుంది. చాలామంది విద్యార్థులు కోచింగ్ లేకుండా మంచి మార్కులు రావడం కష్టం అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. టైమ్‌ను సరిగ్గా మేనేజ్ చేసుకోవడం వస్తే ఎలాంటి శిక్షణ లేకుండానే చదువుకోవచ్చు. ప్రస్తుతం మొదటి ర్యాంకు రావడం వల్ల నచ్చిన కాలేజీలో సీటు దొరుకుతుంది. ఎక్కడ చేరాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నా. అదే సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తున్నా.
ఏ సబ్జెక్టు చదివినా సరే అందులో..
మొత్తం 100 మార్కుల పేపర్‌లో ఇంగ్లిష్, ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌ల్లో 25 మార్కులు పూర్తిగా వచ్చేలా ప్రిపేర్ అయ్యాను. మిగతా అంతా సబ్జెక్టు మీద ప్రశ్నలు ఉంటాయి కాబట్టి చదవాల్సిన టాపిక్స్‌ను శ్రద్ధగా చదువుకున్నాను.
ఏ సబ్జెక్టు చదివినా సరే అందులో లోతైన అవగాహన ఉంటే మార్కెట్‌లో అవకాశాలు ఉంటాయి. అందువల్ల విద్యార్థులు ఉద్యోగాల కోసం నచ్చని సబ్జెక్టులు చదువుతూ ఇబ్బంది పడనవసరం లేదు.
ఇంతటి ప్రాముఖ్యం కలిగిన గేట్ పరీక్ష-2024 ఈఈఈ విభాగంలో మొదటి ర్యాంకు సాధించడం చాలా గొప్ప విషయం. సాయికిరణ్ సక్సెస్ జర్నీ చాలా మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.
Tags
- GATE
- GATE 2024 Topper Success Story in Telugu
- GATE 2024 First Ranker Adelly Sai Kiran
- GATE 2024 EEE First Ranker Adelly Sai Kiran
- Success Story GATE 2024 Toppers
- Success Story
- motivational story in telugu
- GATE First Ranker Success Story in Telugu
- GATE 2024 First Ranker Success Story in Telugu
- GATE 2024 Top 10 Ranker Success Stories in Telugu
- gate 2024 toppers sai kiran success story
- gate 2024 toppers sai kiran success story in telugu
- gate 2024 eee topper sai kiran real story in telugu
- gate 2024 eee 1st ranker real story
- gate 2024 eee 1st ranker preparation plan
- gate 2024 topper real stories in telugu
- gate 2024 toppers sai kiran preparation in telugu
- GATEexam
- Telangana
- FirstRank
- NationalLevel
- SuccessStory
- sakshieducation success stories