Skip to main content

నాలెడ్జ్ హబ్ - ఐఐటీ - ఖరగ్‌పూర్

ఐఐటీ - ఖరగ్‌పూర్.. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి. కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇదో వేదిక. త్వరలో వైద్య విద్యను బోధించే ప్రప్రథమ ఐఐటీగా కూడా చరిత్రకెక్కబోతోంది. ఇక్కడి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమన్ వర్మ చెబుతున్న క్యాంపస్ కబుర్లు..
ఉన్నత స్థానాలకు చేరాలని..
మాది విశాఖపట్నం. నాకంటే ముందు మా బంధువులిద్దరు ఐఐటీలో చదివి ప్రముఖ సంస్థలో గౌరవప్రదమైన ఉద్యోగంతోపాటు ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు పొందారు. వాళ్లను చూసి నేను కూడా ఐఐటీలో చదవాలని, వాళ్లకంటే మంచి ఉద్యోగం సాధించాలని కలలు కనేవాడిని. చిన్నప్పటి నుంచి అదే లక్ష్యంతో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్ రావడంతో ఐఐటీలో చదవాలన్న నా కల నెరవేరింది. లక్ష్య సాధనకు సరైన వేదికని భావించి ఐఐటీ-ఖరగ్‌పూర్‌ను ఎంచుకున్నాను.

అందమైన ప్రపంచం
ఐఐటీ-ఖరగ్‌పూర్ ఒక అందమైన ప్రపంచం. పచ్చని చెట్లు, ఎత్తై గుట్టలతో ఆహ్లాదకర వాతావరణం ఈ క్యాంపస్ సొంతం. 2200 ఎకరాలతో దేశంలో ఉన్న ఐఐటీల్లోకెల్లా అతి పెద్ద క్యాంపస్ ఇదే. చదువుతోపాటు ఆటలు, పరిశోధనలు, సదస్సులు ఇలా రకరకాల కార్యక్రమాలతో ప్రతిరోజూ క్యాంపస్ సందడిగా ఉంటుంది. క్లాసులు అయిపోగానే ఎవరికి ఆసక్తి ఉన్న విభాగంలో వాళ్లు స్వేచ్ఛగా పనిచేసుకుంటూ తమ లక్ష్య సాధనలో బిజీగా ఉంటారు. క్యాంపస్ లైబ్రరీ మా అందరి కామన్ చర్చా వేదిక. వార్తాపత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్‌తోపాటు నూతన ఆవిష్కరణలు, జాబ్ మార్కెట్, విద్యా వ్యవస్థ ఇలా ఎన్నో సమకాలీన అంశాలపై స్నేహితులు, అధ్యాపకులతో చర్చలు సాగుతుంటాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ఒక చోట కలిపే చక్కటి ప్లాట్‌ఫాం ఇది. రకరకాల భాషలు, కొత్త సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. నా దృష్టిలో ఐఐటీ-ఖరగ్‌పూర్ ఒక నాలెడ్జ్ హబ్.

అన్నీ అత్యాధునికంగా..
క్యాంపస్‌లో మౌలిక వసతుల నుంచి టీచింగ్ విధానం వరకు అన్నీ అత్యాధునికంగా ఉంటాయి. నిష్ణాతులైన ఫ్యాకల్టీ, వై-ఫై సదుపాయం, నాణ్యమైన భోజనంతో కూడిన హాస్టల్ వసతి ఉంటాయి. అధ్యాపకులు..విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉంటారు. నూతన అంశాలపై అవగాహన కల్పిస్తారు. టీచింగ్ విధానం కొత్తగా ఉంటుంది. అధ్యాపకులు చెబుతుంటే స్టూడెంట్స్ వినాలి అన్నట్లు కాకుండా వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన సమకాలీన అంశాలను కూడా విశ్లేషిస్తారు. ప్రభుత్వ నివేదికలను జోడిస్తూ రియలిస్టిక్ అప్రోచ్‌తో బోధిస్తారు. టీచింగ్ సమయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఆన్‌లైన్, మొబైల్ వీడియోలు, వార్తా పత్రికలు ఉపయోగిస్తూ ఆసక్తి రేకెత్తించేలా బోధన ఉంటుంది. చర్చా వేదికలా సంబంధిత అంశంపై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. ఎలాంటి సందేహాలు ఎదురైనా ఫ్యాకల్టీని కలిసి నివృత్తి చేసుకోవచ్చు.

40 శాతం తెలుగు విద్యార్థులే
క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులే ఎక్కువ. తెలుగు విద్యార్థుల సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి, దీపావళి, వినాయక చవితి వంటి పండుగలను బాగా చేస్తాం. వీటితోపాటు హోళి, విజయదశమి వంటి వాటిని కూడా అన్ని రాష్ట్రాల విద్యార్థులతో కలిసి నిర్వహిస్తాం. ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్‌లను కూడా విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీలు ఉంటాయి. దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, వివిధ కంపెనీల హెడ్‌లు, స్టార్టప్స్ సీఈవోలు క్యాంపస్‌కు విచ్చేస్తారు.

పరిశోధనలకు పెద్దపీట
అన్ని ఐఐటీల్లాగే ఇక్కడ కూడా విద్యార్థులను పరిశోధనలవైపు ఎక్కువగా ప్రోత్సహిస్తారు. సమకాలీన సమస్యలకు సొంతంగా పరిష్కారం కనుగొనేలా సహాయసహకారాలు అందిస్తారు. ప్రతి శనివారం తాజా ఆవిష్కరణలపై సంబంధిత రంగంలోని నిష్ణాతులతో గెస్ట్ లెక్చర్ ఉంటుంది. ఇన్నోవేషన్ గ్రూప్ వాళ్లు దీన్ని నిర్వహించడంతోపాటు సొంతంగా పరిశోధన చేసే వారికి ఐడియా కాంపిటీషన్స్, వర్క్‌షాపులు నిర్వహించి సలహాలు, సూచనలు అందిస్తారు. అందుకే పాఠశాల చిన్నారుల రక్షణ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్, డ్రైవర్ లెస్ కారు వంటి నూతన ఆవిష్కరణలు ఇక్కడ సాకారమయ్యాయి. ప్రతి ఏడాది చివర్లో పూర్వ విద్యార్థులు క్యాంపస్‌ను సందర్శించి తమ అనుభవాలు, సలహాలను పంచుకుంటారు. అలాగే ప్రతి ఏటా పరిశ్రమలు- విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ కోసం ఇండస్ట్రీ- అకడమియా కాన్‌క్లేవ్ ఉంటుంది. ఇవే కాకుండా ఒక విద్యార్థి తనని తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన అన్ని వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

అకడమిక్‌తోపాటు మరెన్నో..
ఇక్కడ చదువుతోపాటు మిగతా విషయాలకు కూడా చాలా ప్రాధాన్యమిస్తారు. రీసెర్చ్ గ్రూప్, కల్చరల్ సొసైటీ, ఫొటోగ్రఫీ సొసైటీ, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ సొసైటీ, స్పోర్ట్స్ సొసైటీ ఇలా రకరకాల గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపుల ఆధ్యర్యంలో టెక్నికల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్, రోబో కాంపిటీషన్స్, ఆట పాటలు, డాన్సులతో కల్చరల్ ఫెస్ట్ ఇలా అన్ని రకాల ఈవెంట్స్‌ను నిర్వహిస్తారు.

త్వరలో మెడిసిన్ కోర్సులు
ఈ ఏడాది మా క్యాంపస్‌లో 53 శాతం మంది విద్యార్థులు గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, హెచ్‌యూఎల్, ఐటీసీ వంటి ప్రముఖ సంస్థల నుంచి ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ (పీపీవో) అందుకున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగించింది. హ్యాపీ టెక్నోక్రాట్స్‌ని అందించాలనే ఉద్దేశంతో ‘హ్యాపీనెస్ సైన్స్ సెంటర్’ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు క్యాంపస్‌లో 1200 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే మెడిసిన్ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు మెడిసిన్ కోర్సులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న ఏకైక ఐఐటీ ఇదే అవుతుంది.
Published date : 15 Aug 2016 05:12PM

Photo Stories