Skip to main content

పరిశోధనల పరంగా విద్యార్థులకు విస్తృత ప్రోత్సాహకాలు..

ప్రొఫెసర్ బూదరాజు శ్రీనివాస మూర్తి.. ఇంజనీరింగ్ అధ్యాపక, పరిశోధన విభాగాల్లో ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తిగా సుపరిచితం. పదో తరగతి తరువాత డిప్లొమా(పాలిటెక్నిక్)లో చేరి.. ఇంజనీరింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన.. పీహెచ్‌డీ పూర్తిచేసి.. ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్‌లో అధ్యాపక వృత్తిలో స్థిరపడి వేల మంది విద్యార్థులకు మార్గ నిర్దేశం చేసారు. మరోవైపు నిరంతరం సాగించిన పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురష్కారం మొదలు మరెన్నో అవార్డులతోపాటు అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఐఐటీ-హైదరాబాద్‌కు నూతన డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో పుట్టి పెరిగి, తెలుగు రాష్ట్రాల్లోని తొలి ఐఐటీ హైదరాబాద్‌కు డెరైక్టర్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి.. ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తితోగెస్ట్‌కాలం...
ఇంజనీరింగ్ వైపు అడుగులు..
నా విద్యాభ్యాసం విజయవాడలోనే జరిగింది. పదోతరగతి పూర్తయ్యాక అందరిలానే ఇంటర్మీడియెట్‌లో చేరాలని భావించాను. కానీ, ఆర్ అండ్ బీ శాఖలో పనిచేస్తున్న నాన్న (వేణుగోపాల కృష్ణమూర్తి) సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేస్తే బాగుంటుందని సూచించారు. దాంతో విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు దరఖాస్తు చేశాను. సివిల్ బ్రాంచ్‌లో అవకాశం రాలేదు. కానీ మెటలర్జికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో సీటు వచ్చింది. అలా.. నా అడుగులు ఇంజనీరింగ్ వైపు పడ్డాయి. డిప్లొమా పూర్తయ్యాక నాగ్‌పూర్ ఆర్‌ఈసీలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఐఐఎస్‌సీ బెంగళూరులో ఎంఈలో చేరాను. అక్కడే పీహెచ్‌డీ కూడా పూర్తిచేసి.. అదే సంవత్సరం(1992) లోనే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీగా చేరి 2004 వరకు అక్కడ విధులు నిర్వహించాను. ఆ తర్వాత 2004 నుంచి ఇప్పుడు ఐఐటీ-హైదరాబాద్‌కు డైరక్టర్‌గా ఎంపికయ్యే వరకు ఐఐటీ-మద్రాస్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా కొనసాగాను.

భవిష్యత్తు తరాలకు ‘రోల్ మోడల్’ :
పరిశోధనల పరంగా చూస్తే నేటి తరం యువత ముందు రీసెర్చ్ అవకాశాలు అనేకం. ఇంప్రింట్, వజ్ర, గ్యాన్, పీఎంఆర్‌ఎఫ్ ఇలా.. పలు రీసెర్చ్ ఓరియెంటెడ్ స్కీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిపై దృష్టిపెడితే పరిశోధనలు, ఆవిష్కరణల పరంగా ఉన్నతంగా ఎదగొచ్చు. ఆయా స్కీమ్స్ ద్వారా మెరుగైన ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆర్థికంగానూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్.. ఇలా ఏ కోర్సులో చేరిన విద్యార్థులైనా.. భవిష్యత్తు తరాలకు తాము ‘రోల్ మోడల్స్’గా నిలవాలనే ఆలోచనతో కృషిచేయాలి. ఇలాంటి ఆలోచనకు కార్యరూపం ఇస్తే తమ రంగంలో అద్భుత ఫలితాలు సాధించొచ్చు. ముఖ్యంగా ఏ రంగంలోనైనా గుర్తింపు, ఉన్నత స్థానం అందుకోవాలంటే.. మనపైన, మనం చేసే పనిపైన మనకు గట్టి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో పనిచేస్తే సత్ఫలితాలు లభిస్తాయి. అవే మనల్ని ఉన్నత స్థానాలు అందుకునేలా చేస్తాయి. అదేవిధంగా ‘నేను ఇక్కడే ఉండాలి.. దేశాన్ని బాగు చేయాలి’ అని ప్రతి ఒక్కరు ఆలోచించినప్పుడే మేధో వలసలకు అడ్డుకట్టపడుతుంది.

మార్పులు అవసరమే.. కానీ..
ప్రస్తుతం మన దేశంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంట్రన్స్ టెస్ట్‌ల విధానం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న మాట వాస్తవం. విదేశాల్లో +2 స్థాయిలో చూపిన ప్రతిభ, ఆ ప్రతిభకు సంబంధించి ఆ రంగంలోని నిపుణులు ఇచ్చే సిఫార్సు ఆధారంగా బ్యాచిలర్ స్థాయిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మన దేశంలోనూ ఇలాంటి విధానం ఉంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ.. నూటికి తొంభై శాతం మంది ఇంజనీరింగ్ కోర్సుల వైపు దృష్టిపెట్టడంతో ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్షల మంది విద్యార్థుల నుంచి ప్రతిభావంతులను వెలికి తీసేందుకు(ఫిల్టర్ చేసేందుకు) ప్రవేశ పరీక్షలు తప్పనిసరిగా మారాయి.. దీంతో విద్యార్థులు వాటిలో విజయం సాధించేందుకు బాహ్య ప్రపంచం తెలియని విధంగా శిక్షణకు సమయం కేటాయిస్తున్నారు. పర్యవసానంగా ఐఐటీల వంటి ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టిన తర్వాత అక్కడి వాతావరణంలో ఇమడలేక ఒత్తిడికి గురవుతున్నారు.

ఏపీ ట్రిపుల్ ఐటీల ప్రవేశ విధానం భేష్ :
ప్రవేశ ప్రక్రియల పరంగా.. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నెలకొల్పిన ఆర్‌జీయూకేటీ(ఏపీ ట్రిపుల్ ఐటీ)లు అనుసరిస్తున్న విధానం హర్షించదగ్గ అంశం. ఎలాంటి ఎంట్రన్స్ టెస్టులు లేకుండా పదో తరగతి ప్రతిభ ఆధారంగా ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కల్పించడం వల్ల బెస్ట్ టాలెంట్ బయటికి వస్తుంది. ఇలాంటి విధానమే అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ.. పోటీ వాతావరణం నేపథ్యంలో ఇది సాధ్యం కాని పరిస్థితి నెలకొంది.

‘డ్రీమ్ డెస్టినేషన్’గా నిలపడమే లక్ష్యం :
ఐఐటీ-హైదరాబాద్‌ను ప్రతి విద్యార్థికి డ్రీమ్ డెస్టినేషన్‌గా నిలపడమే డెరైక్టర్‌గా నాకు నేను నిర్దేశించుకున్న లక్ష్యం. ఇక్కడ అద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వారిలో పలువురికి రీసెర్చ్ ఆసక్తి అద్భుతంగా ఉంది. వారికి పరిశోధన అవకాశాలు లభించేలా చర్యలు తీసు కుంటాను. అదే విధంగా ఇండస్ట్రీ వర్గాలు మరింతగా ఐఐటీ-హెచ్‌తో భాగస్వామం చేసుకునేలా ఇండస్ట్రీ లింకేజ్ విషయంలో కృషి చేయడం మరో ప్రధాన లక్ష్యం. నా అభిప్రాయంలో ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్ అనేవి ‘బై’ ప్రొడక్ట్స్ వంటివి. ర్యాంకింగ్స్‌లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అనేవి ఒక ప్రామాణికం మాత్రమే. దీనివల్లే మన ఇన్‌స్టిట్యూట్‌లు ర్యాంకింగ్స్‌లో వెనుకబడుతున్నా యని భావించడం సరికాదు. ఇన్‌స్టిట్యూట్‌లు రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌పై దృష్టిపెడితే ర్యాంకింగ్స్‌లో ముందుంటాం.

తల్లిదండ్రులూ మారాలి..
ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంజనీరింగ్ చేర్పించాలనే ఆశతో ఉంటున్నారు. దీన్ని తప్పు పట్టలేం. చాలామంది తల్లిదండ్రులు ప్రవేశాల కౌన్సెలింగ్ సమయంలో, కోర్సులో చేర్పించిన మొదటి రోజే ఈ బ్రాంచ్ చదివితే ఎంత జీతంతో ఉద్యోగం లభిస్తుంది అని అడిగిన సందర్భాలు అనేకం! తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌ను ఇన్‌స్టంట్ కెరీర్‌గా భావిస్తుండటంతోనే ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్య అవకా శాల గురించి అవగాహన కల్పించి.. విద్యార్థులను ఆ దిశగా అడుగులు వేయిస్తే ప్రస్తుతం మన డెమొగ్రాఫిక్ డివిడెండ్‌తో అద్భుత ఫలితాలు రాబట్టొచ్చు. విద్యార్థులకు నా సలహా ఏమంటే... మీరు ఏ కోర్సు చదువుతున్నా.. ఆసక్తితో చదవండి. ఆ ఆసక్తే మీరు భవిష్యత్తులో అద్భుత ఫలితాలు సాధించేలా చేస్తుంది. కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో తమకు ఇష్టం లేని కోర్సుల్లో చేరుతుంటారు. అయితే వారు కూడా ఆ బాధను మొగ్గలోనే తుంచేసి.. చేరిన కోర్సుపై ఇష్టం పెంచుకోవాలి.
Published date : 14 Sep 2019 06:17PM

Photo Stories