UPSC Exam: రేపు యూపీఎస్సీ పరీక్ష నిర్వహణ.. హాజరుకానున్న అభ్యర్థుల సంఖ్య..!
ఎన్టీఆర్: ఈ నెల 21వ తేదీన జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలను ఎటువంటి లోటుపాట్లూ లేకుండా పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై వెన్యూ సూపర్‌వైజర్లు, లైజన్ కం ఇన్‌స్పెక్టింగ్ అధికారులతో కలెక్టర్ ఢిల్లీరావు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నేవల్ అకా డమీ (ఎన్‌ఏ), సీడీఎస్ (కంబైండ్ డిఫెన్స్ సర్వీస్) పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించనుందని తెలిపారు.
పరీక్ష సమయం..
జిల్లావ్యాప్తంగా 1,872 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఇందు కోసం ఐదు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షలు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. సీడీఎస్ పరీక్షలు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
అధికారుల నియామకం..
ఈ పరీక్షల నిర్వహణకు ఐదుగురు రూట్ అధికారులతో పాటు, ఐదుగురు లైజన్ అధికారులను నియమించామని వివరించారు. ఇప్పటికే పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామని తెలిపారు. సకాలంలో పరీక్ష పత్రాలు కేంద్రాలకు చేరుకునేలా రూట్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్, తపాలా, వైద్య–ఆరోగ్యం, ఏపీసీపీడీసీఎల్, జీవీఎంసీ తదితర శాఖల అధికారులు తమకు అప్పగించిన విధులను సమర్థంగా పాటించాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల్లో వసతులు
వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, లైజన్ అధికారులు, పోలీస్, తపాలా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
Inter Supplementary Exams: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...