AICTE: కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు బ్రేక్ !.. కారణం ఇదే..
ఈ కోర్సుల పెంపు వల్ల సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ తగ్గు తోందని అన్ని రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కొ త్తగా కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై ఆంక్షలు విధించే అంశాన్ని ఏఐసీటీఈ పరిశీలిస్తోందని ఆ విద్యా మండలి వర్గాలు తెలిపాయి. అయితే, అన్ని కాలేజీల్లో సీట్ల పెంపును అడ్డుకోబోమని, నాణ్యత లేని, ఫ్యాకల్టీ సరిగా లేని కాలేజీల విషయంలోనే పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ ఇటీవల జాతీయ మండళ్ళ సమావేశంలో స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి డిమాండ్ లేని కోర్సులకు బదులు డిమాండ్ ఉన్న కోర్సులతో సీట్లు మార్పిడి చేసుకునే విధానానికి అనుమతి లభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
భారీగా పెరిగిన సీట్లు...!
తెలంగాణ వ్యాప్తంగా 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే 58 శాతం కంప్యూటర్ సైన్స్ ఇతర కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లోనే ఎక్కువగా సీట్లున్నాయి. ఈ ఏడాది వందకుపైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్స్ బ్రాంచీల్లో డిమాండ్ లేదని, వీటిని తగ్గించి కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో సీట్లు పెంచాలని అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్శిటీలకు దరఖాస్తులు చేశాయి.దీంతో వీటిని తగ్గించి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్ల పెంపునకు అనుమతించాయి.
ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులో 7,635 సీట్లు మంజూరయ్యాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడం వల్ల మరో 6,390 సీట్లు అదనంగా మార్పిడి రూపంలో పెరిగాయి. ఈ విధంగా 14,565 సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ విభాగాల్లో అదనంగా చోటు చేసుకున్నాయి.
ఫ్యాకల్టీ ఎక్కడ..?
కొత్తగా వచ్చిన కంప్యూటర్ సైన్స్ కోర్సులను బోధించేందు కు నైపుణ్యం ఉన్న అధ్యాపకుల కొరత తీవ్ర స్థాయిలో ఉన్న ట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి గుర్తించింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీల్లో బోధకులు అవసరమైన మేర ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన కంప్యూటర్ కోర్సులను బోధించే అనుభవజ్ఞుల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలను వేధిస్తోంది.
సరైన ఫ్యాకల్టీ లేకపో వడంతో సీఎస్‌ఈ బ్రాంచీ బోధించే వారినే కొత్త కోర్సులకు వాడుతున్నారు. అయితే వారికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో కొత్త కోర్సుల్లో బోధన నాణ్యత లోపిస్తోందని కాలేజీ అధ్యాపక సంఘాలు, విద్యావేత్తల నుంచి వర్సిటీలకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐసీటీఈ కొన్ని సూచనలు చేసింది. కంప్యూటర్ నేపథ్యంతో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న వారి చేత కొత్త కోర్సులకు పాఠాలు చెప్పించాలని సూచించింది. ఇది ఎంత వరకూ అమలు అవుతుందనే దానిపై వచ్చే నెలలో ఏఐసీటీఈ అధికారులు అధ్యయనం చేయనున్నారు.
అందరూ సాఫ్ట్‌వేర్ రంగానికే.. అందుకే అధ్యాపకుల కొరత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విభాగాల్లో కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్లు అధ్యాపకులుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వీళ్ళంతా సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) బోధించే అధ్యాపకులున్న కాలేజీల్లో అదనపు కొత్త సబ్జెక్టులనైనా ప్రొఫెషనల్స్‌తో బోధించేందుకు ప్రయత్నించాలని వర్సిటీలు సూచిస్తున్నాయి. ఎంఎస్, ఇతర మాస్టర్ డిగ్రీలు చేసి కనీసం ఐదేళ్ళు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న వారి చేత బోధన సమంజసమని యూనివర్సిటీలు భావిస్తున్నాయి.