Skills for Engineering Students: బీటెక్ విద్యార్థులకు ఈ స్కిల్స్ ఉంటే ఉద్యోగం గ్యారెంటీ..!
సాక్షి ఎడ్యుకేషన్: దేశంలో ఇంజనీరింగ్, సాంకేతిక విభాగాల్లో ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటివి కీలకంగా మారుతున్న నేపథ్యంలో.. ఈ స్కిల్స్‌ను పెంచుకునే మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. పలు ఇన్‌స్టిట్యూట్స్ బీటెక్ స్థాయిలోనే ఏఐ–ఎంఎల్ బ్రాంచ్‌తో ప్రత్యేక ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఎంటెక్ స్థాయిలో వీటిని ప్రవేశపెట్టాయి. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌కు సంబంధించి ఐబీఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్, వీఎం వేర్, ఇంటెల్ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు.. ఆటోమేషన్, ఐఓటీ పరిధిలోని పలు విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి.
మూక్స్‌తో లేటెస్ట్ టెక్నాలజీ
ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకునేందుకు మరో మార్గం.. మూక్స్(మాసివ్‌లీ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్). అంతర్జాతీయంగా పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆన్‌లైన్ విధానంలో కోర్సులను అందిస్తున్నాయి. ఈ మూక్స్ ద్వారా తమ సబ్జెక్టులతోపాటు లేటెస్ట్ టెక్నాలజీపైనా అవగాహన పెంచుకోవచ్చు. మన దేశంలోనూ ఎన్‌పీటీఈఎల్ ద్వారా ప్రముఖ ప్రొఫెసర్స్ బోధించే పాఠాలను ఆన్‌లైన్‌లో వినే అవకాశముంది. వీటిల్లో విద్యార్థులకు ఉపయోగపడే వర్చువల్ ల్యాబ్స్ సౌకర్యం సైతం లభిస్తుంది. ఫలితంగా విద్యార్థులు తాజా పరిశోధనలు, టెక్నాలజీ, పరిణామాలు, ప్రాక్టికల్ అంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.
నిరంతర అధ్యయనం, పరిశీలన
విద్యార్థులు నిరంతరం అధ్యయనం, పరిశీలన దృక్పథాన్ని అలవరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్ట్‌ను చదవడానికే పరిమితం కాకుండా.. అప్లికేషన్ అప్రోచ్‌ను పెంచుకోవాలంటున్నారు. బీటెక్ విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీపై ప్రాజెక్ట్ వర్క్, మినీ ప్రాజెక్ట్ వర్క్‌లు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల తాజా సాంకేతికతపై అకడమిక్ దశలోనే ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతమవుతాయి. అదే విధంగా.. కొత్త టెక్నాలజీకి సంబంధించి ఇండస్ట్రీ వర్గాలు తీసుకుంటున్న చర్యలు, వాటిని అమలు చేస్తున్న తీరును పరిశీలించి.. దానికి అనుగుణంగా తమ స్కిల్స్‌కు పదును పెట్టుకోవాలని సూచిస్తున్నారు.