Skip to main content

ఇంజనీరింగ్‌లో గెలుపు గమ్యం చేరాలంటే...

ఇంటర్మీడియెట్‌ను దిగ్విజయంగా పూర్తిచేసిన విద్యార్థులు ఎంతో శ్రమించి, ఎంసెట్‌లో ర్యాంకు సంపాదించి కోటి ఆశలతో, బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతుంటారు.
కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందంటూ ఇంజనీరింగ్ చదువుపై దృష్టి కేంద్రీకరించే సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలి? అన్నింటినీ తట్టుకొని మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎలా సన్నద్ధమవాలి? వంటి అంశాలను ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొ.పి.ఎస్.అవధాని విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు.
  • విద్యార్థి దశలో ఇంటర్మీడియెట్ వరకు ఒక ఎత్తయితే ఇంజనీరింగ్ విద్య మరో ఎత్తు. ఇంటర్‌లో అధిక శాతం థియరీని చదువుతారు. ఇంజనీరింగ్‌లో మాత్రం థియరీకి సమానంగా ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్‌లో మార్కులు, ర్యాంకుల కంటే సబ్జెక్టు, ప్రాక్టికల్ పరిజ్ఞానం పొందడం ముఖ్యం. బట్టీ చదువులు పనికిరావు. అలాగే పరీక్షలు కూడా సెమిస్టర్ విధానంలో జరుగుతాయి. ప్రతి సెమిస్టర్ మధ్యలో మిడ్ పరీక్షలు ఉంటాయి. వీటిని రాయకుంటే ఇంటర్నల్ మార్కులు తగ్గి ప్రధాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారుతుంది.
  • మొదటి ఏడాది అందరికీ ఉమ్మడిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్స్ తదితర సబ్జెక్టులతో పాటు సంబంధిత బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి.
  • తరగతులకు క్రమం తప్పకుండా వెళ్లాలి. 75% హాజరు లేకపోతే పరీక్షలకు హాజరు కావడం కుదరదు. తప్పనిసరి పరిస్థితుల్లో 10% మినహాయింపు ఇస్తారు. అంటే 65% కంటే తక్కువ హాజరు ఉంటే పరీక్షలు రాయడానికి అనర్హులు. తాజాగా హాజరు వ్యవహారాలను ఆన్‌లైన్ చేస్తున్నందువల్ల పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఏర్పడింది. వీటిని దృష్టిలో ఉంచుకొని, విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరుకావాలి.
  • ర్యాగింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరదా పేరుతో తోటి విద్యార్థులను బాధించడం అనేది సరికాదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ర్యాగింగ్ భూతంతో సంబంధాలు ఉండకూడదు. ర్యాగింగ్ కేసులో ఇరుక్కుంటే జీవితం నాశనం అవుతుంది.
  • కాలేజీల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో, చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి. దీనివల్ల బిడియం తగ్గడంతో పాటు సెల్ఫ్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు. వివిధాంశాలపై లోతైన అవగాహన కూడా ఏర్పడుతుంది. ఉద్యోగావకాశాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.
  • మొదటి సంవత్సరం నుంచే స్కిల్స్ పెంపొందించుకోవడంపై దృష్టిసారించాలి. టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ముఖ్యం. వీటిని పెంపొందించుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సమర్థంగా ఉపయోగించుకోవాలి. సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవడతాయి. తరగతిగదిలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు వీలవుతుంది.

వ్యక్తిగతంగా గుర్తుంచుకోవాల్సినవి...
  • తల్లిదండ్రులు, లెక్చరర్స్ దగ్గరుండి చదివించడం ఇంజనీరింగ్‌లో అసాధ్యం. ఎవరికి వారే ప్రణాళికను రూపొందించుకొని, దాని ప్రకారం చదువుకోవాలి.
  • సినిమాలు, షికార్లు, ఆటపాటలు మితిమీరకుండా చూసుకోవాలి. క్లాసులు మానేసి ఆటలాడటం, సినిమాలకెళ్లడం మంచిది కాదు.
  • ప్రధానంగా ఇంటి మీద బెంగ ఉండకూడదు. ఏ సమస్యనైనా తల్లిదండ్రులతో చర్చించాలి. చిన్న చిన్న కష్టాలను తమలోనే దాచుకుని ఒత్తిడి కారణంగా జీవితం నాశనం చేసుకోకూడదు.
  • ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. వాటి జోలికి పోకుండా అప్రమత్తంగా ఉండాలి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, చెడు ఆలోచనలు దగ్గరకు రాకుండా చూసుకోవాలి. బైక్‌లు, కార్లకు దూరంగా ఉండటం మంచిది.

పరీక్షలకు సన్నద్ధత..
  • మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమైన నాలుగు నెలలకే పరీక్షలు వచ్చేస్తాయి. ఏ రోజు అంశాలను ఆ రోజే చదవకుండా పరీక్షల ముందు పుస్తకం తీస్తే పాసవడం సాధ్యం కాదు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే తప్పనిసరిగా ప్రణాళిక ప్రకారం చదవాల్సిందే.
  • మొదటి సెమిస్టర్‌లో సాధారణంగా ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సీ ప్రోగ్రామింగ్, డ్రాయింగ్‌తో పాటు రెండు ల్యాబ్‌లు కూడా ఉంటాయి. ప్రశ్నలు ఎక్కువగా సమస్య పరిష్కార నేపథ్యంతో ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చే స్తేనే గానీ పరీక్షల్లో గట్టెక్కడం కుదరదు.
  • ఏ సెమిస్టర్‌లో సబ్జెక్టులను ఆ సెమిస్టర్‌లో పూర్తిచేయడం మంచిది. వచ్చే సెమిస్టర్‌లో కలిపి రాద్దాం అనుకునే ధోరణి సరికాదు. దీనివల్ల ఒత్తిడి పెరిగి, ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • పరీక్షలకు ముందు పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలుంటాయి.
  • పరీక్షల్లో వేగంగా రాయాలంటే ముందస్తు ప్రాక్టీస్ అవసరం. పరీక్షలకు ముందు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. డ్రాయింగ్, సీ ప్రోగ్రామింగ్ లాంటి పరీక్షలకైతే చాలా ప్రాక్టీస్ అవసరం. సరైన ప్రాక్టీస్ లేని కారణంగా చాలా మంది ఈ పరీక్షల్లో తప్పుతుంటారు.
  • ఒకవేళ అనుకోని కారణాల వల్ల పరీక్షలు సరిగా రాయనంత మాత్రాన జీవితం వ్యర్థం అని భావించకూడదు. మళ్లీ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించొచ్చు. జీవితం చాలా విలువైనది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదు.
Published date : 20 Dec 2017 03:18PM

Photo Stories