Skip to main content

కరిక్యులం మారిస్తే సరిపోదు : ఉదయ్ కుమార్

‘‘ఇంజనీరింగ్ కరిక్యులంలో మార్పులు చేస్తూ.. ఏఐసీటీఈ విధి విధానాలను ఖరారు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.
అయితే తాజా మార్పులకు అనుగుణంగా ఇన్‌స్టిట్యూట్‌లు చర్యలు చేపడుతున్నాయా? లేదా? అని నిరంతరం పర్యవేక్షించే యంత్రాంగం లేదా వ్యవస్థ ఉన్నప్పుడే ఏఐసీటీఈ ప్రయత్నం విజయవంతమవుతుంది’’ అని అంటున్న సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ (సీఎస్‌ఏబీ) చైర్మన్, మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జైపూర్) డెరైక్టర్ ప్రొఫెసర్ వై.ఉదయ్‌కుమార్‌తో గెస్ట్ కాలమ్..

గత రెండేళ్లలో జేఈఈ-మెయిన్ దరఖాస్తుల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. అయితే దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం బీటెక్‌కు ఉద్దేశించిన పేపర్-1లో 50 వేల దరఖాస్తులు తగ్గాయి. విద్యార్థుల్లో ఇతర కోర్సులపై అవగాహన పెరగడం, అలాగే సొంత రాష్ట్రాల్లోనే చదవాలనే అభిలాష తదితరాలను దరఖాస్తులు తగ్గడానికి కారణాలుగా చెప్పొచ్చు.

సింగిల్ టెస్ట్ విధానం మంచిదే!
నీట్ (మెడికల్) తరహాలో.. ఇంజనీరింగ్‌కు కూడా జాతీయస్థాయిలో సింగిల్ టెస్ట్ విధానం తేవడం మంచిదే. దీనివల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. సింగిల్ టెస్ట్ విధానాన్ని ఖరారు చేసేటప్పుడు.. కనీసం ఏడాది సమయం ఇవ్వాలి. అప్పుడే అన్ని రాష్ట్రాల విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన సంసిద్ధత లభిస్తుంది.

బ్రాంచ్ ఏదైనా..
ఎన్‌ఐటీల్లో అన్ని బ్రాంచ్‌లకు డిమాండ్ ఉంటోంది. విద్యార్థినులు.. ఫీల్డ్ వర్క్ అవసరమైన బ్రాంచ్‌ల (సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ తదితర) పట్ల అనాసక్తత ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులు సీటు పొందిన బ్రాంచ్‌లో భవిష్యత్తు అవకాశాలు, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరాలనుకునే విద్యార్థులు ఇప్పటి నుంచే ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ను పెంచుకోవాలి. ఫలితంగా భిన్న సంస్కృతుల నుంచి వచ్చే విద్యార్థులతో తేలిగ్గా కలసిపోయేందుకు ఆస్కారముంటుంది.

అవగాహన లేకే సీట్ల మిగులు!
విద్యార్థులకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ (జోసా-జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) ఛాయిస్ ఫిల్లింగ్‌పై సరైన అవగాహన ఉండట్లేదు. దీంతో ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. విద్యార్థులు తమకు వచ్చిన ర్యాంకు.. సీటు లభించే అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లకు సంబంధించి ముందస్తు కసరత్తు చేయట్లేదు. జోసాలో విద్యార్థుల ప్రయోజనం కోసం అందుబాటులో ఉంచే మాక్ సీట్ అలాట్‌మెంట్‌ను సైతం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. విద్యార్థులు కేవలం ఒక బ్రాంచ్‌నే ఎంచుకొని, దాని కోసం పలు ఇన్‌స్టిట్యూట్‌లను ప్రాథమ్యంగా పేర్కొనడం లేదా ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలో కొన్నిటికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా వారికి వచ్చిన ర్యాంకు ప్రకారం వేరే ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్లు లభిస్తున్నాయి. దీంతోపాటు చాలా మంది వ్యక్తిగత కారణాలతో అలాట్‌మెంట్‌కు యాక్సప్టెన్స్ ఇవ్వడంలేదు. ఇలాంటి వాటివల్ల ఎన్‌ఐటీల్లో సీట్లు మిగులుతున్నాయి.

ఈ ఏడాది కూడా సీఎస్‌ఏబీ ఆధ్వర్యంలో స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. జోసాలో అన్ని రౌండ్ల్లూ పూర్తయి, విద్యార్థులు తమకు కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లలో నిర్దేశిత తేదీ లోపు రిపోర్టింగ్ చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత.. మిగిలిన సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని స్పెషల్ రౌండ్‌కు నోటిఫికేషన్ విడుదల చేస్తాం.

నిబంధనలు సరళీకృతం
గతేడాదిజోసా చివరి రౌండ్ తర్వాత కూడా.. ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సీట్లు మిగిలిపోయాయి. దీనిపై ప్రత్యేక దృష్టిసారించిన ఎంహెచ్‌ఆర్‌డీ కొన్ని నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా సీఎస్‌ఏబీ ఆధ్వర్యంలో స్పాట్ రౌండ్ కౌన్సెలింగ్‌కు ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌లో పొందాల్సిన మార్కుల శాతాన్ని తగ్గించింది. రిజర్వ్‌డ్ కేటగిరీల్లో మిగిలిన సీట్లను ఓపెన్ కేటగిరీలో చేర్చి.. అందరికీ అందుబాటులో తెచ్చింది. దీంతో గతేడాది ీసీట్ల మిగులు గణనీయంగా తగ్గింది.

సూపర్ న్యూమరరీ మంచిదే..
సీట్లు మిగులుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థినుల శాతాన్ని పెంచేలా.. మొత్తం సీట్లలో 14 శాతానికి సమానంగా సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించడాన్ని విమర్శించడం సరికాదు. వాస్తవానికి అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. పలు రిజర్వేషన్లు, ఇతర అంశాల కారణంగా విద్యార్థినులకు సరైన అవకాశం లభించడం లేదు. అలాగే కొందరు విద్యార్థినులకు సీట్లు లభించినా.. వారికి ఆసక్తి ఉన్న బ్రాంచ్ లేదా ఇన్‌స్టిట్యూట్ దక్కడంలేదు. సూపర్ న్యూమరరీ సీట్ల విధానంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

అభ్యర్థులకు సలహా..
జేఈఈ-మెయిన్ అభ్యర్థులకు ఇచ్చే సలహా ఏంటంటే.. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్.. ఏ విధానంలో పరీక్ష రాయాలనుకున్నా.. ముందు ఒత్తిడిని అధిగమించాలి. ఆన్‌లైన్లో పరీక్షలు రాసే విద్యార్థులు మాక్‌టెస్ట్‌లు రాసి.. కంప్యూటర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. అడ్వాన్స్‌డ్‌ను కేవలం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నందునఐఐటీలను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు తప్పనిసరిగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అవగాహన కలిగుండాలి!
Published date : 01 Mar 2018 05:41PM

Photo Stories