Skip to main content

ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధె గెస్ట్ స్పీక్స్

‘ప్రస్తుత టెక్నాలజీ యుగంలో.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అకడమిక్స్‌లో మార్పులు చేస్తేనే మెరుగైన భవిష్యత్తు అందుకునే అవకాశముంటుంది. అందుకే వచ్చే ఏడాది నుంచే అమలయ్యేలా బీటెక్‌లో నూతన కరిక్యులంను ప్రతిపాదించాం. ఇది కచ్చితంగా విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది’ అని అంటున్నారు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధె. ఆయనతో గెస్ట్ కాలమ్..
బీటెక్ సిలబస్‌లో మార్పులు తేవాలనే అభిప్రాయం చాలా కాలం నుంచి వ్యక్తమవుతోంది. కోర్సులో చేయాల్సిన మార్పులపై ఏఐసీటీఈ దృష్టిసారించింది. ఈ మేరకు రెండేళ్ల క్రితం కమిటీ రూపుదిద్దుకుంది. ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా నమూనా సిలబస్‌ను రూపొందించాం. అన్ని యూనివర్సిటీలూ దీనికి అనుగుణంగా తమ పరిధిలో కరిక్యులంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.

స్వల్ప మార్పులకు అవకాశం...
బీటెక్ సిలబస్ నమూనాను రూపొందించి యూనివర్సిటీలకు అందజేశాం. అయితే దీనికి సంబంధించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వల్పంగా మార్పులతో కూడిన సిలబస్‌ను రూపొందించుకునే వెసులుబాటు ఆయా యూనివర్సిటీలకు కల్పించాం.

క్రెడిట్స్ తగ్గింపు.. అందుకే
ప్రతిపాదిత మోడల్ కరిక్యులంలో క్రెడిట్స్ తగ్గించడం వెనక ప్రధాన ఉద్దేశం.. విద్యార్థులు థియరీ కంటే ప్రాక్టికల్స్‌కు ఎక్కువ సమయం కేటాయించేలా చేయడం కోసమే! క్రెడిట్స్ తగ్గించడం వల్ల విద్యార్థులు క్లాస్‌రూంలో కంటే ల్యాబ్‌వర్క్, ప్రాక్టికల్స్‌కు అధిక సమయం కేటాయించడానికి వీలవుతుంది. ఫలితంగా వారిలో అప్లికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి.

ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ :
తాజా సిలబస్ ప్రకారం.. విద్యార్థుల్లో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పెరుగుతుంది. ప్రొఫెషనల్ ఎలక్టివ్ కోర్సులు ఎంపిక చేసుకోవాల్సిన క్రమంలో విద్యార్థులకు ఇతర బ్రాంచ్‌లపైనా అవగాహన కలుగుతుంది. ఓపెన్ ఎలక్టివ్ కోర్సుల పరంగా విద్యార్థులు అందుబాటులో ఉన్న కోర్సుల్లో దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చు.

ఆ మాట వాస్తవమే..
ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయనే మాట వాస్తవమే. అందుకే గత రెండేళ్లుగా ఏఐసీటీఈ పరిష్కార మార్గాలపై కసరత్తు చేస్తోంది. 30 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన కళాశాలలను రద్దు చేయాలనే యోచన అందుకే! అలా రద్దు చేసిన కళాశాలల్లో అప్పటికే చదువుతున్న సీనియర్ విద్యార్థులను సమీప ప్రాంతాల్లోని ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేసేందుకు ఉన్న మార్గాలపై అధ్యయనం చేస్తున్నాం. వీటిపై కొద్ది రోజుల్లో స్పష్టతనిస్తాం.

ఫ్యాకల్టీ కొరత నిజమే...
మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్న మాట నిజం. అందుకే తాజా ప్రతిపాదనల్లో టీచర్-స్టూడెంట్ నిష్పత్తిని 1:15 నుంచి 1:20 వరకు పెంచాం. దీనివల్ల కొద్దిమేరకు ఫ్యాకల్టీ సమస్యను అధిగమించొచ్చు.

యాజమాన్యాలదే బాధ్యత..
ఇండస్ట్రీ నిపుణులతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే విషయంలో పూర్తి బాధ్యత ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల యాజమాన్యాలదే. వారే చొరవ తీసుకొని పరిశ్రమతో ఒప్పందాల దిశగా కృషి చేయాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఇన్‌స్టిట్యూట్‌ల యాజమాన్యాలకు ఈ విషయంలో కొంత ఇబ్బంది ఎదురవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వారు తమ పర్యవేక్షక యూనివర్సిటీ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చు.

ఇంటర్న్‌షిప్ తప్పనిసరి...
విద్యార్థుల్లో రియల్‌టైం నాలెడ్జ్ పెంపొందించే లక్ష్యంతోనే ఇంటర్న్‌షిప్స్‌ను తప్పనిసరి చేశాం. అంతేకాకుండా ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులకు.. సహకరించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాలదే. ఎప్పటికప్పుడు ఫలితాలను సమీక్షిస్తూ.. సంబంధిత కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో యాజమాన్యాలు కూడా చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉంది.

ఇండస్ట్రీ రెడీ..
విద్యార్థులకు వంద శాతం ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ అందించడం ఏ ఇన్‌స్టిట్యూట్‌కు కూడా సాధ్యం కాదు. ప్రస్తుతం ఎన్నో రంగాలు ఉన్నాయి. ప్రతి రంగానికి వేర్వేరు నైపుణ్యాలు అవసరమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక కోర్సు ద్వారా అన్ని రంగాలకూ సంబంధించిన స్కిల్స్ అందించడం సాధ్యం కాదు. మన దేశం అనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. యూఎస్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. అక్కడ సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో నిపుణుల కొరత ఉంది.

ప్రత్యామ్నాయ లెర్నింగ్ :
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల దృక్పథంలో కూడా మార్పు రావాలి. ముఖ్యంగా లెర్నింగ్ పరంగా.. కేవలం క్లాస్‌రూం పాఠాలకే పరిమితమవుదాం అనే ధోరణి సరికాదు. ప్రత్యామ్నాయ లెర్నింగ్ టూల్స్‌పైనా దృష్టిసారించాలి. MHRD- SWAYAM, ఎన్‌పీటీఈఎల్ ద్వారా కొత్త అంశాలను నేర్చుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాజా సిలబస్‌లో మూక్స్ ద్వారా పూర్తిచేసిన కోర్సులకు గరిష్టంగా 20 క్రెడిట్స్ కేటాయించాం. దీంతో విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్‌పై దృష్టిసారిస్తారని ఆశిస్తున్నాం.

స్వయం ఉపాధి :
విద్యార్థులు కేవలం క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, ఉద్యోగాల అన్వేషణ వంటి వాటికే పరిమితం కాకుండా.. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వైపు కూడా దృష్టి సారించాలి. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా, ప్రైవేటు ఇన్వెస్టర్ల రూపంలో స్టార్టప్ ఔత్సాహికులకు వివిధ ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి.
Published date : 02 Dec 2017 05:46PM

Photo Stories