Skip to main content

ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో అద్భుత అవకాశాలు...

‘దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు.. కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే అనే భావనలో ఉంటున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులకు ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో అద్భుత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిపైనా దృష్టిసారించాలి’.. అని సూచిస్తున్నారు జేఈఈ-అడ్వాన్స్‌డ్-2019 ఆర్గనైజింగ్ చైర్మన్, ఐఐటీ రూర్కీ ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ ఎం.ఎల్.శర్మ. ప్రస్తుతం ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి ‘జోసా’ ప్రక్రియ కొనసాగు తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ ఎం.ఎల్.శర్మతో గెస్ట్ కాలం...
ఇంజనీరింగ్, ఐఐటీలే కాదు :
ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్, అందుకు ఉత్తమ వేదికలు ఐఐటీలు అనే భావన నెలకొంది. ఇన్‌స్టిట్యూట్‌ల పరంగా ఐఐటీలు ఉత్తమమైనవనేది నిస్సందేహం. కానీ, కోర్సు విషయంలో విద్యార్థులు ఇంజనీరింగ్‌కే పరిమితం కావడం సరికాదు. ఐఐటీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి ఈ సంవత్సరం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 13,500. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 38వేలకు పైగానే ఉంది. టాప్-20 పర్సంటైల్, రిజర్వేషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఐఐటీల్లో చేరే అవకాశం లభించని వారి సంఖ్య 25వేల వరకు ఉంటుంది. ఇలాంటి విద్యార్థులంతా నిరుత్సాహానికి గురవుతున్నారు.

ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో...
ప్రస్తుతం మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులకు ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో కోర్ సబ్జెక్టుల్లో రీసెర్చ్ స్థాయికి తీసుకెళ్లే కోర్సులు అందించే ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌లకు కొదవలేదు. ఆయా కోర్సులు, కాలేజీల్లో చేరి ఈ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా ఇంజనీరింగ్‌కు దీటైన కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. విద్యార్థులు ఇలాంటి కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల గురించి అవగాహన పెంచుకోవాలి. అందుకు తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు సహకరించాలి.

మాక్ సీట్ అలొకేషన్ :
జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ పరంగా మాక్ సీట్ అలొకేషన్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల విద్యార్థులు ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో తాము పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా ఏ ఇన్‌స్టిట్యూట్‌లో, ఏ బ్రాంచ్‌లో సీటు లభిస్తుందో అంచనాకు రావొచ్చు. దీనిద్వారా వారు తమ ఛాయిస్‌లను మార్చుకునే వీలుంటుంది. ఛాయిస్ ఫిల్లింగ్ చేసిన ప్రతి విద్యార్థి ఈ మాక్ సీట్ అలొకేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జూన్ 25వ తేదీ వరకు ఛాయిస్ ఫిల్లింగ్ అవకాశం, ఆ లోపే రెండు దశలుగా మాక్ సీట్ అలొకేషన్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఛాయిస్ ఫిల్లింగ్ పరంగా ఇప్పటికే ఇచ్చిన ప్రిఫరెన్స్‌లను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మార్పులు చేర్పులపై దృష్టిపెట్టొచ్చు.

బ్రాంచ్ ఎంపికలో జాగ్రత్తగా..
ఇప్పటికే ప్రారంభమైన ఛాయిస్ ఫిల్లింగ్‌లో విద్యార్థులు తాము పేర్కొన్న బ్రాంచ్‌ల ప్రాథమ్యాలను మరోసారి సరిచూసుకోవాలి. తమకు నిజంగా ఆసక్తి ఉన్న బ్రాంచ్‌నే ఎంపిక చేసుకోవాలి. ఇన్‌స్టిట్యూట్ ప్రాముఖ్యత ఆధారంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవడం సరికాదు. ప్రస్తుతం ఏ బ్రాంచ్ విద్యార్థులకైనా ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు కొదవలేదు. అధిక శాతం మంది విద్యార్థులు సీఎస్‌ఈ బ్రాంచ్‌కు ప్రాధాన్యమిస్తున్న విషయం వాస్తవమే. అందుబాటులోని సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ బ్రాంచ్‌లో సీట్లు లభించే వారి సంఖ్య పది శాతంలోపే ఉంటుంది. కాబట్టి మిగతా విద్యార్థులకు వారు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా వేరే బ్రాంచ్‌లను కేటాయిస్తారు.

స్పాట్ రౌండ్ లేదు :
ఐఐటీల్లో సీట్ల కేటాయింపు పరంగా స్పాట్ రౌండ్ అనే విధానం ఎప్పుడూ లేదు. ఈసారి కూడా ఉండదు. ఎన్‌ఐటీల్లో మాత్రం ఏడు రౌండ్ల తర్వాత కూడా సీట్లు మిగిలిపోతే సీఎస్‌ఏబీ స్పెషల్ రౌండ్స్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.

ఒత్తిడికి గురికావొద్దు...
జోసా కౌన్సెలింగ్‌లో సీటు సాధించి ఐఐటీ/ఎన్‌ఐటీ క్యాంపస్‌లలో అడుగుపెట్టే విద్యార్థులు ‘ఒత్తిడి’కి గురికావొద్దు. బోధన విధానాలు, భౌగోళిక పరిస్థితులు కారణంగా మొదట కొంత కాలం విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలే కాకుండా.. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో సైతం ఈ మానసిక ఒత్తిడి కనిపిస్తోంది. +2 వరకు విద్యార్థులు చదివిన విధానం, ఐఐటీ, ఎన్‌ఐటీల్లో విద్యా విధానం పూర్తి భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే మేం ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్, పర్సనల్ కౌన్సెలింగ్ విధానాలను అమలు చేస్తున్నాం. వీటిద్వారా ఒత్తిడికి ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు !!
Published date : 25 Jun 2019 01:04PM

Photo Stories