Skip to main content

అవకాశాలు అందిపుచ్చుకోవాలి

ప్రస్తుతం యువత ఆలోచనలు ఉద్యోగం ఆశించడం లేదా ఉద్యోగం కల్పించడం ఈ రెండింటి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇందుకోసం ఎన్నో ఆలోచనలు మరెన్నో ప్రణాళికలు. కానీ ఆచరణలో మాత్రం ఆనుకోని అవాంతరాలు. వీటికి కారణం లక్ష్యంపై స్పష్టత ఉన్నా గమ్యం తెలియక అవకాశాలు అందుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్యోగం, స్టార్టప్స్‌లో రాణించాలంటే కావాల్సిన అర్హతలు, నైపుణ్యాలపై... ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, ఏసీఎం చైర్మన్ రమేశ్ లోగనాథన్‌తో గెస్ట్ కాలమ్..
రాబోయేది టెక్ యుగం
ప్రస్తుతం మన దేశంలో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియాలో 20-25 శాతం మార్కెట్ ఐటీ రంగానిదే. బ్యాంకింగ్, మొబైల్, టెలికాం, ఈ-కామర్స్, స్టార్టప్స్ ఇలా ప్రతి రంగంలోనూ సాఫ్ట్‌వేర్ అవసరం పెరుగుతోంది. ప్రారంభంలో రూ.4-6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు వస్తున్నాయి.

అవకాశాలకు కొదవ లేదు
ఐటీ రంగంతోపాటు ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లోనూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. అవగాహన స్థాయి, అన్వేషించే దృక్పథంలో మార్పు రావాలి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై వ్యామోహం పెంచుకోకుండా అకౌంట్స్, ఫార్మా వంటి ఇతర రంగాలపై కూడా దృష్టి పెట్టాలి. అందరూ చదివే కోర్సులు కాకుండా కొత్త కోర్సుల్లో చేరడం వల్ల ఉద్యోగాలు సులభంగా పొందవచ్చు.

నైపుణ్యాల కొరతే సమస్య
విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు 20-25 శాతం మధ్యలోనే ఉంటున్నాయన్నది వాస్తవం. జాబ్ స్కిల్స్ పెంపొందించుకోవడం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఇటీవలి కాలంలో విద్యా రంగంలోకి అడుగుపెట్టిన కార్పొరేట్ సంస్థలు బోధన, శిక్షణలో వినూత్న పద్ధతులు అనుసరిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.

విద్యా వ్యవస్థ మారాలి
విద్యా వ్యవస్థలో, బోధన పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేయాలి. ప్రయోగాత్మక అభ్యసనానికి పెద్దపీట వేయాలి. ఇంటర్న్‌షిప్స్, సర్వీస్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అకడమిక్ స్థాయిలోనే ఉద్యోగ నైపుణ్యాలను అలవరుచుకోవచ్చు.

ప్రాజెక్ట్ వర్క్ పైనే ప్రశ్నలు
సరైన టెక్నికల్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఉన్న అభ్యర్థులను కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా ప్రాజెక్ట్ వర్క్‌పైనే ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి సమర్థవంతగా ప్రాజెక్ట్ వర్క్ చేయగలిగి, దాన్ని వివరించగలిగితే జాబ్ తెచ్చుకోవడం సులభం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ వర్‌‌కను ఎంపిక చేసుకోవాలి.

ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం
ఉద్యోగం వచ్చాక టెక్నికల్, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడంతోపాటు వ్యక్తిగతంగా పరిమితులు విధించుకోకూడదు. ఫ్లెక్సిబిలిటీ, పాజిటివ్ యాటిట్యూడ్, రెగ్యులర్ లెర్నింగ్ ఉంటే కెరీర్‌లో త్వరితగతిన ఎదగవచ్చు. ఉద్యోగులకు విలువలు చాలా ముఖ్యం. ఒక కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయడం వల్ల అనుభవంతోపాటు మంచి అవకాశాలు అందుకోవచ్చు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి
బీటెక్ తొలి ఏడాది నుంచే అకడమిక్స్‌తోపాటు ఇతర పరిశోధనాత్మక విషయాలపై దృష్టి సారించాలి. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వినూత్నంగా వ్యవహరించాలి. ప్రాక్టికల్ థింకింగ్ అలవరుచుకోవాలి.

హాకథాన్స్‌కు హాజరుకావాలి
రెండో ఏడాది నుంచే నగరంలో జరిగే హాకథాన్‌లకు తప్పనిసరిగా హాజరుకావాలి. తద్వారా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్, కంపెనీలు కోరుకుంటున్న స్కిల్స్, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు.. తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. నిపుణులతో మాట్లాడటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కెరీర్‌పై స్పష్టత ఉండాలి
తొలుత ఉద్యోగం చేయాలా లేదా స్టార్టప్ వైపు వెళ్లాలా అనే అంశంపై స్పష్టత తెచ్చుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపార వ్యూహాలపై స్పష్టత ఉన్నవాళ్లు స్టార్టప్స్ వైపు దృష్టి సారించడం మంచిది. మిగిలిన వాళ్లు కొద్ది కాలం ఉద్యోగం చేసి అనుభవం గడించాక స్టార్టప్స్ గురించి ఆలోచించడం మేలు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు రెండో ఏడాది నుంచే అకడమిక్స్‌తో పాటు స్టార్టప్స్ వైపు ప్రయత్నాలు ప్రారంభించాలి.

ఆలోచన కొత్తదై ఉండాలి
ఆలోచన, ప్రొడక్ట్ మార్కెట్ అవసరాలను తీర్చగలిగేలా ఉండాలి. యువతలో వ్యాపార ఆలోచనలు ఉన్నప్పటికీ.. అవగాహన లోపం వల్ల ఆచరణలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం కొన్ని సంస్థలు ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చే ఆలోచన చేస్తున్నాయి. ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలి.

ఫండింగ్‌పై ఆందోళన అక్కర్లేదు
నాస్కామ్, టాటా, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు సీడ్ ఫండింగ్ ఏజెన్సీలను అందుబాటులోకి తెచ్చాయి. ఇవి ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆర్థిక తోడ్పాటుతోపాటు, వ్యాపార సలహాలను అందిస్తూ దిశానిర్దేశం చేస్తున్నాయి. వీటితోపాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఎంఎస్‌ఎంఈ వంటి సంస్థలు స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపడుతున్నాయి. ఫండింగ్ ఏజెన్సీలను మెప్పిస్తే ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కంపెనీలు కోరుకునే అంశాలు
సృజనాత్మకత, ఇన్నోవేషన్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్‌షిప్ స్కిల్స్
Published date : 01 Jun 2016 05:03PM

Photo Stories