ICC mens World Cup 2023: మెగా టోర్నీకి సర్వం సిద్దం
గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య నేడు అహ్మదాబాద్‌లో జరిగే తొలి పోరుతో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. నవంబర్ 19న ఇదే అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
World Cup 10 Teams Squads: వరల్డ్‌కప్‌లో 10 జట్ల ఆటగాళ్ల పూర్తి వివరాలివే...
ఈ క్రమంలో 48 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. 2011 తర్వాత భారత్ మరోసారి వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ చేరిన టీమిండియా స్వదేశంలో ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత టోర్నీ ఫార్మాట్ తరహాలోనే బరిలో 10 జట్లు నిలిచాయి. ప్రతీ టీమ్ ఇతర తొమ్మిది జట్లతో తలపడుతుంది.
గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్ చేరతాయి. వరల్డ్ కప్ తొలి రెండు టోర్నీల్లో జగజ్జేతగా నిలిచి సుదీర్ఘ కాలం క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ లేకుండా జరుగుతున్న తొలి వరల్డ్ కప్ ఇదే. ఈసారి ర్యాంకింగ్ ద్వారా ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా... క్వాలిఫయింగ్ టోర్నీ ఆడి మాజీ విజేత శ్రీలంక, నెదర్లాండ్స్ అవకాశం దక్కించుకున్నాయి.
India World Cup 2023 Squad: వన్డే ప్రపంచకప్-2023 భారత జట్టు ఇదే..
10 మ్యాచ్‌లు జరిగే వేదికలు.
అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, ధర్మశాల, పుణే, హైదరాబాద్ వేదికలుగా మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీస్ మ్యాచ్‌లకు కోల్‌కతా, ముంబై వేదిక కానుండగా, ఫైనల్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. వీటిలో ఒక్క హైదరాబాద్‌లో మినహా మిగతా 9 వేదికల్లో భారత్ తమ మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్ తొలిసారి ఈ టోర్నీని పూర్తిస్థాయిలో నిర్వహిస్తోంది. 1987లో పాక్‌తో, 1996లో పాక్, శ్రీలంకలతో, 2011లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి సంయుక్తంగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది.
రూ. 83 కోట్లు టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ. ఇందులో విజేతకు రూ. 33 కోట్లు, రన్నరప్‌కు రూ.16.50 కోట్లు అందిస్తారు.
World Cup Winners List: ఇప్పటి వరకు ఏఏ జట్టు ఎన్నిసార్లు వరల్డ్‌కప్ గెలిచిందంటే..
2019 ఫైనలిస్ట్‌ల మధ్య టోర్నీ తొలి మ్యాచ్ జరుగుతుంది. 1996లో భారత్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్‌లోనూ ఈ రెండు జట్ల మధ్యే ఇదే అహ్మదాబాద్‌లో టోర్నీ తొలి మ్యాచ్ జరిగింది.
గత విజేతలు
ఆస్ట్రేలియా (5 సార్లు; 1987, 1999, 2003, 2007, 2015). భారత్ (2 సార్లు; 1983, 2011). వెస్టిండీస్ (2 సార్లు; 1975, 1979). పాకిస్తాన్ (1992). శ్రీలంక (1996). ఇంగ్లండ్ (2019).