Sri Lanka PM : శ్రీలంకలో ఎమర్జెన్సీ - తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్
సంక్షోభ వలయంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధ్యక్షుడు గొటబయా రాజపక్స సైనిక విమానంలో పొరుగుదేశం మాల్దీవులకు పారిపోయారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను కచ్చితంగా అరెస్టు చేస్తారన్న అనుమానంతో దేశం విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. జూలై 13న రాజీనామా చేస్తానన్న గొటబయా మాట నిలబెట్టుకోకుండానే మాల్దీవులకు పారిపోయారు. ఆయన తన స్థానంలో ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. జూలై 13వ తేదీ నుంచి అధ్యక్ష బాధ్యతలను విక్రమసింఘే నిర్వర్తిస్తారంటూ గొటబయా గెజిట్ సైతం జారీ చేశారు.
Also read: U.K. Leadership: బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి
మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. రాజధాని కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని బుధవారం వేలాది మంది జనం ముట్టడించారు. శ్రీలంకను ఆక్రమించుకొనేందుకు ఫాసిస్ట్ శక్తులు కుట్రపన్నుతున్నాయని, అందుకే దేశమంతటా అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు విక్రమసింఘే ప్రకటించారు. రాజధాని కొలంబలోతోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టీవీ చానల్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా సహనం వహించాలని, శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అల్లర్లకు పాల్పడేవారిని అరెస్టు చేయాలని, వారి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు.
Also read: Sri Lanka Crisis: రోజులు మారాలి!
సింగపూర్‌కు గొటబయా!
అధ్యక్షుడు గొటబయా రాజపక్స, ఆయన భార్య, మరో ఇద్దరు సెక్యూరిటీ అధికారులతో కలిసి సైనిక విమానంలో దేశం విడిచి వెళ్లిపోయారని శ్రీలంక వైమానిక దళం వెల్లడించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. రక్షణ శాఖ అనుమతితోనే ఇదంతా జరిగిందని పేర్కొంది. శ్రీలంక నుంచి గొటబయా పలాయనానికి మాల్దీవుల పార్లమెంట్ స్పీకర్, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ తగిన సహకారం అందించినట్లు తెలిసింది. గొటబయా ఇప్పటికీ శ్రీలంక అధ్యక్షుడేనని, ఇంకా రాజీనామా చేయలేదని మాల్దీవుల ప్రభుత్వం వాదిస్తోంది. గొటబయా తమ దేశానికి చేరుకున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. గొటబయాకు ఆశ్రయం ఇవ్వడం పట్ల మాల్దీవ్స్ నేషనల్ పార్టీ నాయకుడు దున్యా మౌమూన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రజల మనోభావాలను గుర్తించాలని మాల్దీవుల ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం నుంచి వివరణ కోసం పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెడతామన్నారు. గొటబయాతో సహా మొత్తం 13 మంది ఏఎన్32 విమానంలో మాల్దీవులకు చేరుకున్నారని స్థానిక టీవీ చానళ్లు వెల్లడించాయి. ఆయన జూలై 13న అర్ధరాత్రి తర్వాత మాల్దీవుల నుంచి సింగపూర్‌కు బయలుదేరే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెప్పాయి. ఆఖరి గమ్యానికి చేరుకున్న తర్వాతే రాజీనామా లేఖను శ్రీలంకకు పంపిస్తారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. రాజపక్స పారిపోవడానికి తాము సహకరించామంటూ వచ్చిన వార్తలను శ్రీలంకలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. లంక ప్రజలకు తమ మద్దతు ఉంటుందని ట్విట్టర్‌లో పునరుద్ఘాటించింది.
also read: WEF Global Gender Gap Report 2021: మహిళా సాధికారత 135.6ఏళ్లు దూరం
గో హోమ్ గొటబయా..
గొటబయా పారిపోయినట్లు తెలుసుకున్న జనం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. రోడ్లపైకి చేరుకొని, కేరింతలు కొట్టారు. ‘పోరాటానికి దక్కిన విజయం ఇది, ఇంటికెళ్లిపో గొటా’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గొటబయా సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స సైతం శ్రీలంక నుంచి పలాయనం చిత్తగించినట్లు బీబీసీ వార్తా సంస్థ ప్రకటించింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి త్రివిధ దళాలకు, పోలీసులకు సహకారం అందించాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ షావేంద్ర సిల్వా శ్రీలంక ప్రజలను కోరారు. సంక్షోభ పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనేకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ఆందోళనకారులు దూరంగా ఉండాలని అధికార శ్రీలంక పొడుజనా పెరుమునా పార్టీ విన్నవించింది. ప్రజలంతా శాంతియుతంగా వ్యవహరించాలని కోరింది. కొలంబోలోని తమ రాయబార కార్యాలయంలో కాన్సులర్ సేవలను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
Also read: Sri Lankaలో అఖిలపక్ష ప్రభుత్వం
రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తామంటే సహించం..
శ్రీలంకకు ఫాసిస్ట్‌లకు అప్పగించబోమని తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని ప్రధాన రణిల్ విక్రమసింఘే స్పస్టం చేశారు. ఎమర్జెన్సీ, కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయాలంటూ ఆదేశాలిచ్చామన్నారు. టీవీ చానల్ ప్రకటనలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ఫాసిస్ట్ ముప్పును అంతం చేయాలి. దేశంలో విధ్వంసాన్ని ఎంతమాత్రం సహించరాదు. అధ్యక్షుడి కార్యాలయాన్ని, అధ్యక్షుడి సచివాలయాన్ని, ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని సంబంధిత అధికారులకు తిరిగి అప్పగించాలి. తాత్కాలిక అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే నా కార్యాలయంలో తిష్టవేశారు. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. దేశాన్ని ఫాసిస్ట్ శక్తులకు అప్పగించం. ఇలాంటి తీవ్రవాదులకు కొందరు రాజకీయ నాయకులు మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే దేశంలో ఎమర్జెన్సీ, కర్ఫ్యూ ప్రకటించాం. దేశంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి ఎమర్జెన్సీ, కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. సైనిక దళాల అధినేతలతో కూడిన కమిటీకి ఈ బాధ్యత అప్పగించాం. ఇందులో రాజకీయ జోక్యానికి తావులేదు. నిఘా వర్గాల నివేదికలు నాకు అందాయి. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు కొన్ని శక్తులు ఉత్సాహం చూపిస్తున్నాయి. శ్రీలంకను హస్తం చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నాయి’’అని ప్రధాన రణిల్ విక్రమసింఘే అరోపించారు. అధికార, ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యుడైన నాయకుడిని కొత్త ప్రధానమంత్రిగా నియమించాలని పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనేకు రణిల్ సూచించారు. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా తర్వాత తాత్కాలికంగా అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లంక రాజకీయ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Also read: GK Awards Quiz: ఏ భారతీయ వాస్తుశిల్పికి 2022 రాయల్ గోల్డ్ మెడల్ లభించింది?