Skip to main content

U.K. Leadership: బ్రిటన్‌ ప్రధాని రేసులో ముందున్న రిషి

Ready for Rishi
Ready for Rishi

బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ముందంజలో దూసుకుపోతున్నారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకునిగా ఆయన అభ్యర్థిత్వానికి అత్యధికంగా 40 మందికి పైగా ఎంపీలు మద్దతు పలికారు. ఆర్థిక మంత్రిగా సమర్థ పనితీరు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ‘రెడీ ఫర్‌ రిషి’ పేరుతో రిషి ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి ఆయన అల్లుడు కావడంతో ఈ ఎన్నికలపై భారత్‌లోనూ ఆసక్తి మరింత పెరిగింది. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాకు ఉపాధ్యక్షురాలైన నేపథ్యంలో భారత మూలాలున్న రిషి బ్రిటన్‌ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. జూలై 12న నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి భారత సంతతికి చెందిన హోం మంత్రి ప్రీతీ పటేల్‌తో పాటు పాక్‌ సంతతికి చెందిన మాజీ మంత్రులు సాజిద్‌ జావిద్, రెహమన్‌ చిస్తీ తదితరులు తప్పుకున్నారు. దాంతో రిషితో పాటు మరో ఏడుగురు బరిలో మిగిలారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్‌ సువెల్లా బ్రేవర్మన్‌ కూడా ఉన్నారు.

Also read: Rajya Sabhaకు పీటీ ఉష, ఇళయరాజా, వీరేంద్ర హెగ్గడే, విజయేంద్ర ప్రసాద్‌
 
ఎన్నిక ప్రక్రియ 8 వారాలు 
బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికై అధికార నివాసం 10, డౌనింగ్‌ స్ట్రీట్‌లో అడుగు పెట్టడం అంత సులభమైన వ్యవహారం కాదు. 650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి 358 మంది సభ్యుల బలముంది. ప్రధానిగా పగ్గాలు చేపట్టబోయే పార్టీ నాయకుడి ఎన్నిక ప్రక్రియ 8 వారాల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. చివరికి అత్యధిక ఎంపీల మద్దతు లభించిన వారే కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా ఎన్నికై ప్రధాని పీఠం అధిరోహిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ఓటింగ్‌ ప్రక్రియ మొదలవనుంది. జూలై 13న తొలి రౌండ్‌ ఓటింగ్‌ జరుగుతుంది. కనీసం 30 మంది ఎంపీల మద్దతున్న వాళ్లే జూలై 14 నాటి రెండో రౌండ్‌ ఓటింగ్‌కు అర్హత సాధిస్తారు. అక్కడినుంచి ఒక్కో దశలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారు తప్పుకుంటూ పోతారు. ఇలా జూలై 21 నాటికి ఇద్దరే అభ్యర్థులు పోటీలో మిగలాల్సి ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది టోరీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు వారు దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడతారు. తుది ఇద్దరు అభ్యర్థుల్లో రిషి కచ్చితంగా నిలిచే అవకాశాలున్నాయి. 

Also read: Gita Gopinath becomes 1st woman to feature on IMF’s ‘wall of former chief economists’

సమర్థమైన పనితీరు 
కరోనా కల్లోల సమయంలో బ్రిటన్‌ ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా ఆర్థిక మంత్రిగా రిషి తీసుకున్న చర్యలు అందరి మన్ననలు పొందాయి. ఉద్యోగాలను కాపాడే చర్యలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కారి్మకులు, చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. యువత, విద్యావంతులు, సంపన్నుల్లోనూ రిషికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. పన్ను రాయితీలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. పన్నులు తగ్గిస్తే ధరలు పెంచాల్సి వస్తుందని, అది ఆర్థిక వ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుందన్నది ఆయన వాదన. పార్టీగేట్‌ కుంభకోణంలో జరిమానా కట్టాల్సి రావడం వంటివి రిషికి ప్రతికూలంగా మారాయి. భార్య అక్షత మూర్తి భారత్‌ పౌరురాలిగా కొనసాగుతూ నాన్‌ డొమిసైల్‌ హోదాను అడ్డు పెట్టుకొని తన సంపాదనపై పన్నులు ఎగవేశారన్న ఆరోపణలు కూడా రిషిని ఇరకాటంలో పెట్టాయి. 

Also read: Boris Johnson బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా

రేసులో నిలిచింది వీరే...

  • రిషి సునాక్‌ 
  • పెన్నీ మోర్డంట్‌
  • టామ్‌ టుగెన్‌హాట్‌
  • లిజ్‌ ట్రస్‌
  • కెమీ బడెనోక్‌
  • జెరెమీ హంట్‌
  • నదీమ్‌ జవాహి
  • సుయెల్లా బ్రేవర్మన్‌

Also read: United States: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ?

పెన్నీతో గట్టి పోటీ! 

రిషికి ప్రధానంగా వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డంట్‌ నుంచి గట్టి పోటీ ఉంటుందంటున్నారు. దేశ తొలి మహిళా రక్షణ మంత్రి అయిన ఆమె థెరిసా మే ప్రధానిగా ఉండగా ఒక వెలుగు వెలిగారు. పెట్రో పన్నులను 50 శాతం తగ్గిస్తానని, వ్యాట్‌ రాయితీలను 2023 ఏప్రిల్‌ దాకా పొడిగిస్తానని ఆమె ఇస్తున్న హామీలు పార్టీ ఎంపీలను బాగా ఆకర్షిస్తాయంటున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో పెన్నీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఆమెకు 19.6% మంది మద్దతు పలికారు. మాజీ మంత్రి కెమీ బడెనోక్‌ (18.7%) రెండోస్థానంలో ఉన్నారు. 12.1 శాతం ఓట్లతో రిషి మూడో స్థానంలో, సుయెల్లా బ్రేవర్మన్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే ఆమెకు ప్రజల్లో అంతగా ఫాలోయింగ్‌ లేదు. విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ పన్నుల తగ్గింపు హామీలతో రిషికి పూర్తి వ్యతిరేక విధానాలతో దూసుకుపోతున్నారు. టామ్‌ టుగెన్‌హాట్, జెరెమీ హంట్, నదీమ్‌ జహావీ కూడా రేసులో ఉన్నారు. 

Also read: Most Influential People: టైమ్‌ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు?

 

   >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 13 Jul 2022 02:50PM

Photo Stories