One Nation One Election: జేపీసీకి జమిలి బిల్లు.. 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు సిఫార్సు చేయడానికి పార్లమెంట్ డిసెంబర్ 20వ తేదీ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ రెండు వేర్వేరు తీర్మానాలను లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఉభయ సభలు ఈ తీర్మానాలను ఆమోదించాయి. జమిలి ఎన్నికల బిల్లులు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున తదుపరి పరిశీలన నిమిత్తం జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా రెండు బిల్లులను సమగ్రంగా పరిశీలించడానికి, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపడానికి జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అనుకున్నట్లుగానే జమిలి బిల్లులపై తదుపరి అధ్యయనానికి 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో ప్రాతినిధ్యం లభించిన ఎంపీలు
ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం లభించింది. వాస్తవానికి జేపీసీలో 31 మందిని నియమించనున్నట్లు కేంద్రం తొలుత వెల్లడించింది. కానీ, కీలకమైన ఈ బిల్లులపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉన్న దృష్ట్యా 39 మందిని నియమించాలని నిర్ణయించింది.
ఈ కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ పి.పి.చౌదరిని నియమించారు. కేంద్ర మాజీ మంత్రులు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, పి.పి.చౌదరి, మనీశ్ తివారీతోపాటు ప్రియాంకగాంధీ వాద్రా, బన్సూరీ స్వరాజ్, సంబిత్ పాత్రా, హరీశ్ బాలయోగి తదితరులను జేపీసీ సభ్యులుగా నియమించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ ఫ్లోర్ లీడర్ వి.విజయసాయిరెడ్డిని జేపీసీ సభ్యుడిగా నియమిస్తూ రాజ్యసభ సెక్రటేరియేట్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ నుంచి జేపీసీలో చోటు దక్కిన వారి పేర్లను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు.
విజయసాయిరెడ్డితో పాటు ఘన్‌శ్యామ్ తివారీ, భువనేశ్వర్ కలిత, కవిత పాటిదార్, సంజయ్ కుమార్ ఝా, రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా, ముకుల్ బాలకృష్ణ వాస్నిక్, సాకేత్ గోఖలే, పి.విల్సన్, సంజయ్‌సింగ్, మానస్ రంజన్ మంగరాజ్, డాక్టర్ కె.లక్ష్మణ్ జేసీపీలో సభ్యులుగా ఎంపికయ్యారు.
తెలుగు రాష్ట్రాల నుంచి...
తెలంగాణకు సంబంధించి బీఆర్‌ఎస్ నుంచి కేఆర్ సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్‌రావు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయసాయిరెడ్డి, హరీశ్ బాలయోగి, తెలంగాణ నుంచి కె.లక్ష్మణ్ జేపీసీకి నామినేట్ అయ్యారు.
ఎన్డీయే నుంచి 22, ఇండియా నుంచి 10 మంది
జేపీసీలో బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురుకి అవకాశం కల్పించారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ (2), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(2), డీఎంకే(2), వైఎస్సార్‌సీపీ(1) శివసేన(1), టీడీపీ(1), జేడీ–యూ(1), ఆర్‌ఎల్డీ(1), ఎల్‌జేఎస్పీ–ఆర్‌వీ(1), జేఎస్పీ(1), శివసేన–ఉద్ధవ్(1), ఎన్సీపీ–శరద్ పవార్(1), సీపీఎం(1), ఆమ్ ఆద్మీ పార్టీ(1)కి సైతం స్థానం కల్పించారు.
అధికార ఎన్డీయే నుంచి 22 మంది, విపక్ష ఇండియా కూటమి నుంచి 10 మంది జేపీసీని నామినేట్ అయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చివరి వారానికి సంబంధించిన మొదటి రోజు నాటికి లోక్‌సభకు సమర్పించాల్సి ఉంటుంది.
Supreme Court Judgments: ఈ ఏడాది దేశ గతిని మార్చిన 10 సుప్రీంకోర్టు తీర్పులు ఇవే..