Year Ender 2024: ఈ ఏడాది దేశ గతిని మార్చిన 10 సుప్రీంకోర్టు తీర్పులు ఇవే..
ఇవి దేశ రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థకు మైలురాళ్లుగా నిలిచాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో 10 తీర్పులు దేశగతిపై ప్రభావం చూపాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..
1. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్
ఈ ఏడాది ఫిబ్రవరి 15న లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే ముందు, సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇది ‘రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ నిధుల మూలాన్ని వెల్లడించకపోవడం అవినీతికి దారితీసిందని కోర్టు పేర్కొంది.
2. ఎన్నికల కమిషనర్ల నియామకం
ఈ ఏడాది మేలో సుప్రీం ఇచ్చిన ప్రధాన తీర్పులో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించాలనే నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికలు సమీపిస్తున్నాయని, అలాంటి పిటిషన్లు గందరగోళాన్ని, అనిశ్చితిని సృష్టిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, కార్యాలయ షరతులు) చట్టం 2023 ఆపరేషన్‌పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
3. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు నో
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థిస్తూ 2023, డిసెంబరు 11న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఛాంబర్‌లో పిటిషన్‌లను పరిశీలించింది. ఈ రికార్డులలో ఎలాంటి లోపం కనిపించడం లేదని, అందుకే రివ్యూ పిటిషన్‌లు కొట్టివేస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది.
Constitution of India: నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం
4.షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సీ) ఉప-వర్గీకరణపై తీర్పు
ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ 2024 జూలైలో షెడ్యూల్డ్ కులాలలో (ఎస్‌సీ) మరింత వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కోటాను నిర్ధారించాల్సిన అవసరం ఉందని తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను సమర్థించింది. ఈ నిర్ణయం దరిమిలా దళితుల్లో మరింత వెనుకబడిన వారిని గుర్తించి, వారికి ఇచ్చే రిజర్వేషన్‌లో ప్రత్యేక కోటాను కల్పించవచ్చు.
5. జైళ్లలో కుల వివక్ష తగదు
జైళ్లలో కుల ప్రాతిపదికన వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని 2024, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్ష, కులాల ఆధారంగా విభజన అనేవి రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఒక నిర్దిష్ట కులానికి చెందిన పారిశుధ్య కార్మికులను ఎంపిక చేయడం సమానత్వానికి పూర్తిగా విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. జైళ్లలో ఇలాంటి వివక్షను అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.
6. క్షమాభిక్ష పిటిషన్లపై మార్గదర్శకాలు
మరణశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లపై త్వరితగతిన సరైన చర్యలు తీసుకునేందుకు 2024 డిసెంబర్ 9న సర్వోన్నత న్యాయస్థానం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించిన అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
Aligarh Muslim Unversity: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదాపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
7. బుల్‌డోజర్ జస్టిస్‌కు బ్రేక్
ఈ ఏడాది నవంబర్ 13న సుప్రీం కోర్టు తన ప్రధాన నిర్ణయంలో బుల్‌డోజర్ జస్టిస్ వ్యవస్థకు బ్రేక్ వేసింది. నిందితులు, దోషులపైన కూడా బుల్‌డోజర్ చర్య చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. దాని ప్రకారం 15 రోజుల ముందుగానే సంబంధీకులకు నోటీసు ఇవ్వాలి.
8. బిల్కిస్ బానో కేసులో..
గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ముందస్తుగా విడుదల చేసింది. ఈ దోషులంతా 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారు. వీరికి బాధితురాలి కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేయడంలో ప్రమేయం ఉంది. దీనిపై 2024 జనవరి 8న సుప్రీం ఇచ్చిన తీర్పులో దోషులను విడుదల చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.
9. మనీష్ సిసోడాయా కేసులో
లిక్కర్ స్కామ్ ఆరోపణలపై 2023 ఫిబ్రవర్‌లో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఈ ఏడాది ఆగస్టు 9న సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. ఈ కేసులో విచారణ జరుగుతున్నందున నిందితుడిని నిరవధికంగా జైల్లో ఉంచలేమని కోర్టు పేర్కొంది. ఎక్కువ కాలం జైలులో ఉంచడం ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
Supreme Court: వయసు నిర్ధారణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదు
10. చైల్డ్ పోర్నోగ్రఫీ
సుప్రీంకోర్టు 2024, సెప్టెంబర్ 23న ఇచ్చిన తీర్పులో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్‌ని డౌన్‌లోడ్ చేయడం, వీటిని సేవ్ చేయడం నేరం కిందకు వస్తుందని పేర్కొంది. సంబంధిత వ్యక్తి అటువంటి వీడియోలు లేదా సమాచారాన్ని తొలగించకపోయినా లేదా పోలీసులకు తెలియజేయకపోయినా అది పాక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం నేరమని పేర్కొంది. పిల్లల అశ్లీల చిత్రాలను ఎవరికైనా పంపితే తప్ప, వాటిని కలిగి ఉండటం లేదా డౌన్‌లోడ్ చేయడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు వెలిబుచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Tags
- Supreme Court Judgments
- Judicial decisions 2024
- Top 10 Supreme Court rulings
- Supreme Court Judgments
- Landmark Supreme Court Judgments of 2024
- Supreme Court of India
- Restoration of Article 370
- Electoral Bond Scheme
- Election Commission
- Sub-categorisation of SCs
- Bulldozer Justice
- Manish Sisodia Case
- Child pornography
- Sakshi Education News