Skip to main content

Kommu Koya Dance: కొండకోనల్లో నృత్య సౌందర్యం.. దేశం నలుమూలలా ప్రత్యేకత చాటుతున్న కోయజాతి కళాకారులు!

సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొమ్ముకోయ నృత్యంతో తమ ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటుతున్నారు కోయజాతికి చెందిన గిరిజన కళాకారులు.
Kommu Koya Dance of Koya Tribe of Andhra Pradesh

ఈ నృత్యం పేరు చెబితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులు ముందుగా గుర్తుకొస్తారు. సొంత శుభకార్యాలతో ప్రారంభమైన ఈ నృత్యం రాష్ట్రంలో వివిధ పండుగల సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్‌వెల్త్‌ గేమ్స్, ఐపీఎల్‌ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది.  

20 బృందాలు.. 
తుమ్మలతోపాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన గిరిజన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 20 బృందాల వరకు ఉన్నాయి. ఈవెంట్‌ను బట్టి ఒక్కో బృందంలో 20 నుంచి 40 మంది మహిళలు, పురుషులు ఉంటారు.  

➣ గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు అడవి బర్రె కొమ్ములను పోలిన ఆకృతులు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తలకు రిబ్బన్‌ చుట్టుకుని అందులో ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషుల డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందు నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ పుంజుకుంటుంది.  

➣ నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు గుద్దు­కోవడం ప్రత్యేక ఆకర్షణ. దుస్తుల అలంకరణ వైవిధ్యంగా ఉంటుంది. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు.  

Cyber Crimes : నయా పద్ధతుల‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు.. జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌న‌సరి అంటున్న పోలీసులు

సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో.. 
సెంట్రల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు.  

➣ మన్యంలో చిత్రీకరించే కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనకు చోటు దక్కింది. పుష్ప–2, గేమ్‌చేంజర్, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే.. శ్లోకం వంటి చిత్రాల్లో తమ ప్రదర్శనకు అవకాశం వచ్చినట్టు నృత్య కళాకారులు తెలిపారు.

➣ రోజుకు రూ.వెయ్యి: ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు పేర్కొన్నారు. ఒకొక్క కళాకారుడు ఏడాదికి సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందుతుంటారు. 
➣ ఎంతో ఖ్యాతి పొందినా కళాకారులు మాత్రం వ్యవసాయం, కూలిపనులపై కూడా ఆధారపడుతుంటారు.

ప్రస్థానమిలా..
చింతూరు మండలం తుమ్మ లకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంత మంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటుచేసి వివిధ పాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన మృతి అనంతరం అతని కుమారుడు రమేష్‌ సంప్రదాయ వృత్తిగా ఈ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు.

Andhra Pradesh: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్.. అలాగే వీటి ఉత్పత్తిలోనూ..

ఐటీడీఏ సహకరించాలి 
కొమ్ముకోయ నృత్యం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటుతున్న తమకు సహకారం అందించాలి. ఐటీడీఏ ద్వారా తమకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే తాము ప్రదర్శనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.  – పట్రా రమేష్, కొమ్ముకోయ కళాకారుడు, తుమ్మల 

ఎంతో ఆదరణ 
ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ప్రకృతి ఒడిలో తాము నేర్చుకున్న ఈ నృత్యానికి ఇతర ప్రాంతాల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనల ద్వారా అక్కడి సంస్కృతిని తాము తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వం నుంచి మాలాంటి కళాకారులకు పూర్తిస్థాయిలో సహకారంఅందించాలి.  – వుయికా సీత, కొమ్ముకోయ నృత్య కళాకారిణి

Published date : 02 Dec 2024 04:24PM

Photo Stories