Bharata Ratna: 'భారతరత్న'కు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'.. వారికి ఉండే సౌకర్యాలు ఇవే..
చౌదరి చరణ్ సింగ్, స్వామినాథన్, పీ.వీ.నరసింహారావు ముగ్గురూ ముగ్గురే! ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఈ ఐదుగురిలో ఎల్‌కే అద్వాణీ ఒక్కరే జీవించివున్నారు. మిగిలినవారు గతించినా, చరిత్రగతిలో చిరయశస్సుతో చిరంజీవిగా జీవిస్తారు.
ఠాకూర్‌కు ప్రకటించినప్పుడు దేశంలో పెద్ద స్పందన లేదు. పర్వాలేదులే అనుకున్నారు. అద్వాణీకి ప్రకటించిన రోజు అందరూ ఆశ్చర్యపోయారు. పీ.వీ.నరసింహారావుకు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్‌కు కూడా ఇవ్వాలనే అభ్యర్థనలు తెలుగువారి నుంచి వినిపించాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ముఖ్యంగా తెలుగువారిని అమితానంద పరిచేలా 'పీవీ వార్త' గొప్ప సందడి చేసింది. ఏదోరోజు ఎన్టీఆర్‌కు కూడా దక్కుతుందనే ఆశ కూడా చిగురిస్తోంది. కొద్దికాలం వ్యవధిలోనే ఇందరు పెద్దలకు అతిపెద్ద 'భారతరత్న' ప్రదానం చెయ్యడం చాలా గొప్ప విషయం.
ఈ నిర్ణయం వెనకాల ఎందరి సలహాలు ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా అభినందనలు అందుకోవాల్సిన వ్యక్తి నూటికి నూరు శాతం మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇన్నేళ్ల స్వాతంత్య్ర భారతంలో ఈ తీరుగ నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రధాని మోదీ. కొందరికి ఆలస్యమైంది, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది వున్నారు అన్నమాటలు వాస్తవమే ఐనప్పటికీ, ఈ స్థాయిలో 'భారతరత్న' ప్రదానం చేయడం పరమానందకరం. మొన్ననే! ఇద్దరు తెలుగుతేజాలు ఎం.వెంకయ్యనాయుడు, చిరంజీవికి 'పద్మవిభూషణ్' ప్రకటించడంతో తెలుగువారు ఎంతో అనందించారు.
ఆ ఆనందడోలికల్లో ఇంకా తేలుతూనే వున్నాం, తూలుతూనే వున్నాం. నేడు పీవీకి 'భారతరత్న' ప్రకటనతో ఆనందతాండవంలోకి ప్రవేశించాం. ఎన్నికల వేళ నరేంద్రమోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమే కాదు, అనూహ్య వ్యూహం. ఈ దెబ్బతో ప్రతిపక్షాలు, ప్రత్యర్ధులకు నోటమాట ఆగిపోయేట్టు చేశారు. అద్భుతమైన రాజనీతి. ఎన్నికల్లో తప్పక మేలుచేస్తుంది. పీవీని కాంగ్రెస్ దూరం చేసుకుంది. కాంగ్రెస్ ఎంత దూరం చేసుకుందో, మోదీ బీజేపీ ప్రభుత్వం అంతకు మించి దగ్గరకు తీసుకుంది. ఈరోజు భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'.
Miss America 2024: మిస్ అమెరికాగా ఎయిర్‌ఫోర్స్ అధికారిణి..!
వీరి నేపథ్యాలు భిన్నం, ప్రాంతాలు విభిన్నం. కానీ, వీరి ఆత్మ ఒక్కటే! అదే 'భారతీయం'. వీరు కేవలం భారతీయులు కారు, విశ్వమానవులు. ఈ ఐదుగురు పంచభూతాల్లాంటివారు. విశ్వదృష్టితో విశాలంగా అలోచించినవారు. ఇందులో స్వామినాథన్ తప్ప మిగిలినవారికి రాజకీయ నేపథ్యం ఉండవచ్చు గాక! దాని వెనక జాతి హితం వుంది. ఒక్కొక్కరూ ఒక్కొక్క రంగానికి, తత్త్వానికి, ప్రయోజనానికి ప్రతీకలు. అందరూ స్ఫూర్తిప్రదాతలే. వారు వేసిన మార్గంలో నడవడం ఎవరికైనా, ఎప్పటికైనా తప్పదని నిరూపించినవారే.
ఈ సందర్భంలో, ఈ సంరంభంలో మన 'తెలుగువెలుగు' పీవీని ప్రత్యేకంగా తలచుకుందాం. వంద సంవత్సరాల క్రితం (1921), ప్రఖ్యాత జంటకవులు కొప్పరపు సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిగూడెంలో రాజా బొమ్మదేవర నాగన్ననాయుడు రాజాస్థానంలో 'సంపూర్ణ శతావధానం' చేశారు. అందులో ఒక పద్యం చెప్పారు. పీవీ నరసింహారావు పుట్టిన సంవత్సరం కూడా 1921. ఆ మహాకవులు రచించిన ఆ పద్యాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
ఎట్టివారు మంత్రిపదవికి అర్హులు? ఇది ఒక పృచ్ఛకుడు సంధించిన ప్రశ్న. దీనికి కొప్పరపు కవుల పద్యరూపమైన సమాధానం.
"పతికిన్ భూప్రజకాప్తుడై, బహు విధోపాయంబులన్ శాత్రవ
ప్రతతిం గీడ్వడ జేసి, రాణ్మణికి హర్షశ్రీలు సేకూర్చి, ధీ
చతురుండై, పటుకార్య కౌశలుడునై సత్కీర్తులం బొల్తునే
మతిమంతుండతడే యమాత్యపద సంభావ్యుండగున్ భూవరా"
➤ ఇదీ సంపూర్ణ పద్యం. 'మంత్రిగా పీఠంపై కూర్చోవలసినవారికి ఎటువంటి అర్హతలు ఉండాలో కవులు స్పష్టంగా వివరించారు. రాజుకు, ప్రజలకు పరమ ఆప్తుడై, బహు ఉపాయాలతో శతృవులను తొక్కిపడేసేవాడై, రాజ్యానికి ఎల్లవేళలా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తూ, చతుర బుద్ధిబల సంపన్నుడై, ఎటువంటి కార్యాన్నైనా అలవోకగా నిర్వహించే చాతుర్యం కలిగి, రాజ్యానికి, రాజుకు, ప్రజలకు, మంత్రిమండలికి, సత్కీర్తులు కలుగజేసే మతిమంతుడు ఎవరై ఉంటారో? అటువంటివారే మంత్రిపదవికి సంపూర్ణంగా అర్హులౌవుతారు రాజా....!' అని ఈ పద్యం చెప్పే తాత్పర్యం.
ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాజాస్థానాలలో అటువంటి ప్రధానమంత్రులు, మహామంత్రులు ఉండేవారు. అటువంటివారినే మంత్రులుగా నియమించుకొనే ప్రభువులు ఉండేవారు. స్వాతంత్య్రం రాక ముందు, దివానులు కూడా అటువంటివారే ఉండేవారు. పీవీ నరసింహారావు నూటికి నూరుశాతం అటువంటి విలక్షణ, లక్షణ సంపన్నుడైన మంత్రీశ్వరుడే. అటువంటి మహామంత్రులకు అసలు సిసలైన వారసుడే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మారుతున్న రాజకీయ ప్రభుత్వాల నేపథ్యంలో, పూర్వుల వలె సకల సద్గుణ, సర్వజ్ఞాన క్రియాశూరులైన మంత్రులు దొరకడం దుర్లభమేనని నడుస్తున్న చరిత్ర చెబుతోంది.
ఇటువంటి సంధికాలంలోనూ కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు దొరకడం దేశానికి వైభవ చిహ్నం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా దేశాన్ని పాలించిన సమయంలో, కేంద్రమంత్రిగా పీవీ విశేషమైన సేవలు దేశానికి అందించారు. వ్యక్తిగతంగానూ వారికి విశిష్టమైన సలహాలను అందజేశారు. తర్వాత కొంతకాలానికి ఆయనే రాజు అయ్యారు. ఆ సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రభువుగా తనకు దక్కిన స్వాతంతత్రా‍్యనికి పొంగిపోయి, నియంతగా మారక, ప్రజాస్వామ్యయుతంగా పాలనను అందించారు. రాజు - మంత్రి ఇద్దరి అంతరంగాలు బాగా ఎరిగిననవాడు కాబట్టి, మంచి మంత్రులను, మంచి సలహాదారులను నియమించుకున్నారు.
"రాగ ద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా విధులను నిర్వహిస్తాం" అని ప్రమాణ స్వీకార మహోత్సవంనాడు అందరు మంత్రులు ప్రమాణం చేస్తారు. అదికూడా ఆత్మసాక్షిగా అంటూ ఒట్టు కూడా వేస్తారు. ఆ తర్వాత చరిత్రను గమనిస్తే, ఎందరు ఆ ప్రమాణాన్ని పాటించారన్నది లోక విదితమే. దానిని అక్షరాలా పాటించినవారు అతి తక్కువమంది. వారిలో ప్రథమ శ్రేణీయుడుగా గణనీయుడు పీవీ. ఆణిముత్యాల వంటి ఎందరినో తన సలహా మండలిలో, వివిధ హోదాల్లో నియమించుకున్న ప్రతిభా పక్షపాతి. ఆ జాబితా అతి పెద్దది. ఒక్క మన్మోహన్‌సింగ్ చాలు, గొప్పగా ఉదాహరించడానికి.
Grammy Awards 2024: ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు అందుకున్న భారతీయులు వీరే..
నిన్ననే మన్మోహన్‌సింగ్ పై సభా మధ్యమున మన ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. ఆ మరునాడే పీవీకి 'భారతరత్న' ప్రకటించారు. పాఠాలు చెప్పుకుంటున్న ఆచార్యుడిని తీసుకువచ్చి, కేంద్రమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ఘనత మన పీవీదే. తదనంతరం ఆయనే ప్రధానమంత్రిగా పదేళ్లు దేశాన్ని పాలించారు. అంతటి దార్శనిక ప్రతిభ పీవీది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించుకోవాలో తెలియడం కూడా మంచి మంత్రికి వుండే మంచి లక్షణం. పీవీని అపరచాణుక్యుడుగా అభివర్ణిస్తారు. పీవీలో చాణుక్యుడుతో పాటు తిమ్మరసు, తిక్కన, అల్లసాని పెద్దన కూడా ఉన్నారు.
చాణక్యుడు అనగానే అర్థశాస్త్రం గుర్తుకు వస్తుంది. పీవీ అనగానే ఆర్ధిక సంస్కరణలు గుర్తుకు రాక తప్పవు. 'అర్థశాస్త్రం'లో కేవలం ఆర్ధిక అంశాలే కాదు అనేకం ఉన్నాయి. పాలన, రాజనీతి, మనస్తత్వశాస్త్రం, భౌగోళిక పరిజ్ఞానం, విదేశాంగ విధానం మొదలైన విశేష అంశాల కలయిక కౌటిల్యుడి 'అర్థశాస్త్రం'. పీవీ జ్ఞానం కూడా వీటన్నిటి సముదాయమే. చాణుక్యుడు/కౌటిల్యుడు ఎన్నో ఆర్ధిక సంస్కరణలను అమలుపరచాడు. పీవీ కూడా ఇంచుమించుగా అదే వరుసలో సంస్కరణలు చేపట్టారు. కాలమానాలను బట్టి వ్యూహాలు, ప్రాధాన్యతలు మారాయి అంతే.
చాణుక్యుడు పేదలపట్ల ఎంతో దయకలిగి ఉండేవాడు. చివరిదశలో తన సంపదనంతా పేదలకే దానం చేశాడు. పీవీ తన వందలాది ఎకరాల భూమిని తొలిదశలోనే పేదలకు దానం చేశారు. చాణుక్యుడికి భయం అంటే ఏమిటో తెలియదు. పీవీ కూడా తాను చేపట్టాలనుకున్న కార్యక్రమాలన్నీ నిర్భీతిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు చేపట్టినప్పుడు భూస్వాములంతా బెదిరించే ప్రయత్నం చేసినా ఎవరికీ లొంగలేదు, ఎక్కడా తగ్గలేదు. చివరికి పదవిని కోల్పోయినా లెక్కచేయలేదు. ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పుడు కూడా ఎవరి బెదిరింపులకు చలించలేదు. ఆయన అంతరాత్మకు తప్ప దేనికీ వెరవలేదు. అందుకే, ఏ పని చేసినా త్రికరణశుద్ధితోనే ఆచరించారు.
Oscar Nominations 2024: ఆస్కార్ నామినేషన్స్ 2024.. ఈసారి పోటీ పడుతున్న సినిమాలు ఇవే..!
రాజు తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి, శతృవుల నుంచి తనను, తన రాజ్యాన్ని రక్షించుకోడానికి అవలంబించాల్సిన మార్గాలను కౌటిల్యుడు వివరించాడు. విదేశీ వాణిజ్యం ఎలా చెయ్యాలి, ధనానికి సంబంధించిన విషయాల్లో ఎలా వ్యవహరించాలి తెలిపాడు. పీవీ వాటన్నింటినీ అందిపుచ్చుకుంటూనే తనదైన మార్గంలో నడిచారు. జ్ఞానయోగిగా తాను పొందిన జ్ఞానాన్ని, ఆ మహాగ్రంథాల సారాన్ని ఆధునిక మార్గంలో ఆచరణలో చూపించారు. జవహర్ నెహ్రూ, ఇందిరాగాంధీ నిర్దేశించిన ఆర్ధిక విధానాలకు గౌరవం, ప్రచారం కలిపిస్తూనే, దేశ పరిస్థితులకు అనుగుణంగా, తన సరళిని జతపరచి జేజేలు కొట్టించుకున్నారు. అదే పీవీ చూపించిన లౌక్య ప్రతిభ.
చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌గా టీఎన్ శేషన్ ధిక్కార స్వరంతో సర్వ స్వతంత్రుడుగా వ్యవహరిస్తున్న సమయంలో, అదనంగా మరో ఇద్దరు కమీషనర్లను నియమించి, సరిచేసి సమతుల్యతను ఏర్పరచారు. ఇదీ మంత్రాంగంలో భాగమే. కౌటిల్యుడు 'అర్ధశాస్త్ర' రచనకు శ్రీకారం చుట్టినపుడు అర్ధశాస్త్ర ప్రవర్తకులుగా భావించే బృహస్పతికి, శుక్రాచార్యుడికి తొలి నమస్కారం సమర్పించాడు. అట్లే, పీవీ కూడా చాణుక్యుడు, తిమ్మరసు మొదలు మహామంత్రులందరికీ మనసులో నమస్కారం చేసుకొని, ముందుకు సాగి వుంటారు. ఇదంతా భారతీయమైన ఆలోచనా విధానమే. పీవీ ఆసాంతం భారతీయతను అంటిపెట్టుకొని జీవించారు.
కౌటిల్యుడు చాలా సూత్రాలను నిర్దేశించాడు. పెద్దల సహవాసం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇంచుమించు వాటన్నింటినీ పీవీ పాటించారు. చైనా నుంచి ఎప్పటికైనా ముప్పు ఉంటుందని గ్రహించి, అమెరికాతో బంధాలను పెంచారు. అదే ఈరోజు అక్కరకు వస్తోంది. భవిష్యత్తు మొత్తం శాస్త్ర, సాంకేతిక రంగాలదేనని గ్రహించి, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతానికి బలమైన పునాదులు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడో కుగ్రామం నుంచి అమెరికా రాజధాని వాషింగ్‌టన్ డిసీలో ఉండేవారిని, చూస్తూ వీడియో కాల్‌లో మాట్లాడుకునే సౌకర్యం ఈనాడు మనం అనుభవిస్తున్నాం.
ఇండియాలో కూర్చొని ఆస్ట్రేలియా యూనివర్సిటీలో ఆన్ లైన్ కోర్సును చేయగలుగుతున్నాం. అంబాసిడర్, ఫియట్, మారుతివంటి నాలుగైదు మోడల్స్ తప్ప మిగిలిన కార్లు మనకు తెలియదు. ఇప్పుడు రోల్స్ రాయిస్ మొదలు అనేక విదేశీ కార్లు మన రోడ్లపై తిరుగుతున్నాయి. విమానాలలో ప్రపంచ దేశాలన్నింటినీ ఈనాడు చుట్టేస్తున్నాం. ఈ సకల భోగాలన్నీ పీవీ నరసింహారావు కల్పించిన ఆర్ధిక సంస్కరణల మహాఫలమే. ఇదే దార్శనికత, దేశభక్తికి ప్రతీక.
మౌనం విలువ, మాట విలువ తెలిసిన వాడు కాబట్టే, అన్ని భాషలను నేర్చుకున్నా కొన్ని వేళల్లో మౌనాన్నే ఆశ్రయించారు. ఒక సందర్భంలో, స్పానిష్‌లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదీ మంత్రిత్వ ప్రతిభలో భాగమే. దార్శనికత, దేశభక్తి, సకలశాస్త్ర జ్ఞానసంపద, సంయమనం, ఆచరణాశీలం కలిగిన జ్ఞానయోగి, కర్మయోగి పీవీ. మహారాజులు, చక్రవర్తుల కాలం తర్వాత ఆధునిక యుగంలో, నేటి భారతంలో పీవీ నరసింహారావు నిస్సందేహంగా మహామంత్రి శబ్దవాచ్యుడు. అచ్చమైన ఆంధ్రుడు, స్వచ్ఛమైన భారతీయుడు. ఈ మహామనీషికి భారతప్రభుత్వం 'భారతరత్న' అందించి తన ఔన్నత్యాన్ని చాటుకుంది.