Skip to main content

Grammy Awards 2024: ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు అందుకున్న భారతీయులు వీరే..

ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు.
Year Of India At Grammy Awards 2024

ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్‌ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్‌ చౌరాసియా, గాయకుడు శంకర్‌ మహాదేవన్, వయోలిన్‌ కళాకారుడు గణేశ్‌ రాజగోపాలన్, డ్రమ్స్‌ కళాకారుడు సెల్వగణేశ్‌ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. 

జాకీర్‌ హుస్సేన్‌కుమొత్తం మూడు, రాకేశ్‌ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్‌ మూమెంట్‌’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్‌ మహాదేవన్, గణేశ్‌ రాజగోపాలన్, సెల్వగణేశ్‌ వినాయక్‌రామ్, జాకీర్‌ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్‌ మూమెంట్‌’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది.

Bharat Ratna: ‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులు వీరే..

జాకీర్‌ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఫెర్ఫార్మెన్స్‌(పాష్తో), బెస్ట్‌ కాంటెపరరీ ఇన్‌స్ట్రుమెంటల్‌ ఆల్బమ్‌(యాజ్‌ వీ స్పీక్‌)  కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్‌ వీ స్పీక్‌ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు.

టేలర్‌ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు..  
ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్‌నైట్స్‌’ ఆల్బమ్‌కు అమెరికన్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్‌కు రికార్డు ఆఫ్‌ ద ఇయర్‌ (ఫ్లవర్స్‌), బిల్లీ ఐలిష్‌కు సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (వాట్‌ వాజ్‌ ఐ మేడ్‌ ఫర్‌?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్‌ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్‌ గ్రామీని సొంతం చేసుకున్నారు.

ICC Awards 2023: ఐసీసీ వ‌న్డే క్రికెట్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా విరాట్‌ కోహ్లి.. పూర్తి జాబితా ఇదే..!

Published date : 07 Feb 2024 10:33AM

Photo Stories