IT Crisis: ఐటీలో పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా..? 70 ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కడూ ఉద్యోగం ఇచ్చేవాడు లేడు
ఉదయం ఆఫీస్‌కు వెళితే సాయంత్రానికి ఆ జాబ్ ఉంటుందో? ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇతర సంస్థల సంగతేమో కానీ.. కష్టపడి విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి.. ఆర్ధిక పరిస్థితులు, ఇతర కారణాలతో ఉద్యోగాలు చేస్తూ హాయిగా గడుపుతున్న భారతీయులను ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
2008 తర్వాత.. దాదాపు ఆ స్థాయిలో.. మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో అన్ని సంస్థల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. దీంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. సారీ..! మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అంటూ మెయిల్స్ పెట్టేయడంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. అలాంటి వారిలో ఒకరైన స్వాతి థాపర్ తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు.
నెదర్లాండ్‌లో ఏడేళ్ల నుంచి నివాసం ఉంటున్న భారతీయురాలు స్వాతి థాపర్ ఉన్నట్లుండి ఉద్యోగం కోల్పోయింది. గతేడాదిలో మే నెలలో ఆర్ధిక మాంద్యంతో ఉద్యోగం పోగొట్టుకుంది. తాను చేస్తున్న కంపెనీ ఫైర్ చేయడంతో నాటి నుంచి సుమారు 70కి పైగా ఉద్యోగాలకు అప్లయ్ చేసింది. ఒక్క ఉద్యోగం రాలేదు. చివరికి భారత్‌కు వచ్చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం లింక్డిన్ పోస్ట్‌లో ఆమె తన గోడును వెళ్ల బోసుకుంది.
నెదర్లాండ్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో స్వాతీ థాపర్ కాపీ రైటర్‌గా విధులు నిర్వహిస్తోంది. గతేడాది మేలో ఆమె ఉద్యోగం కోల్పోయింది. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ కాలేకపోతుంది. అందుకే 7ఏళ్లగా ఉంటున్న నెదర్లాండ్‌కు గుడ్‌బై చెప్పి భారత్‌కు వచ్చేయాలని అనుకుంటున్నట్లు తన పోస్ట్‌లో పేర్కొంది.
రాజస్థాన్‌లో ఉండే థాపర్‌కు 2016లో పెళ్లైంది. ఉన్నత ఉద్యోగం చేస్తున్న భర్తతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఎన్నో కలలతో భారత్ నుంచి నెదర్లాండ్‌కు వెళ్లిన ఆమెకు.. తాను కన్న కలలు కన్నీళ్లను మిగుల్చుతాయని ఊహించలేదు. ఉద్యోగం కోసం ఏళ్లకేళ్లు ప్రయత్నించింది. ఎట్టకేలకు 3 ఏళ్ల తర్వాత ఫ్రీలాన్స్ రైటింగ్, స్టార్టప్‌లో మార్కెటింగ్ కాపీ రైటర్‌గా ఉద్యోగం సంపాదించింది.
కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా జాబ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 2021 అక్టోబర్‌లో మెటర్నీటీ లీవ్‌లో వెళ్లి... తిరిగి 2022 జనవరిలో రీజాయిన్ అయ్యింది. అప్పటికే 25 మంది ఉన్న ఉద్యోగులు సంఖ్య 2కు చేరింది. చివరికి ఆమెను కూడా అదే ఏడాది మేలో ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ.
జాబ్ పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా. ఇంకా చేస్తూనే ఉన్నా. ఒక్క ఉద్యోగం రాలేదు. చివరికి డిప్రెషన్‌కు గురయ్యా. ప్రొఫెషనల్‌గా నాపై నాకున్న నమ్మకం కూడా పోయింది. 2016తో పోలిస్తే ఇప్పుడు నెదర్లాండ్స్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఆర్ధిక మాద్యం, అన్నీ రంగాల్లో లేఆఫ్స్ కారణంగా కొత్త ఉద్యోగం సంపాదించడం కష్టంగా మారింది. అయితే తన కొడుకు భవిష్యత్ కోసం ఇక్కడే ఉండాలని అనుకుంటున్నానని.. ఒక వేళ ఉద్యోగం దొరక్కపోతే ఇండియాకు తిరిగి వచ్చేస్తానంటూ ఆమె నెటిజన్లతో పంచుకుంది.