Success Story : ఏకంగా 7 గోల్డ్ మెడల్స్ సాధించానిలా.. నా లక్ష్యం ఇదే..
గొడ్ల చావిడిలో పశువుల ఆలనా పాలనా స్త్రీలు చూసినప్పుడు వాటికి వైద్యం మేమెందుకు చేయలేము అంటున్నారు నేటి యువతులు. నేడు వీరు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పశువైద్యానికి సంబంధించిన ఏకైక యూనివర్సిటీ.. శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. జూలై 22వ తేదీన జరిగిన 12వ స్నాతకోత్సవంలో ‘బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’ (బి.వి.ఎస్.సి) కోర్సులో ఒకరు ఏడు స్వర్ణాలు, మరొకరు ఐదు స్వర్ణాలు సాధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసలు అందుకున్నారు. ఒకప్పుడు పశు వైద్యంలో మగవారే 90 శాతం ఉండేవారు. నేడు అరవై నుంచి డెబ్బయి శాతం అమ్మాయిలే ఉంటున్నారు.
సీట్లు తక్కువే అయినా..
బి.వి.ఎస్.సిలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 200 పై చిలుకు సీట్లు ఉంటే వాటిలో ప్రతి ఏటా అమ్మాయిలే ఎక్కువ సీట్లు ΄పొందుతున్నారు. తిరుపతి, పోద్దుటూరు, గన్నవరం, గరివిడిలలో ఉన్న నాలుగు కాలేజీలు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కిందకే వస్తాయి. సీట్లు తక్కువే అయినా వాటిని ΄పొందుతున్న అమ్మాయిలు ఎక్కువ. ఈ రంగంలో మాకు ఆసక్తి ఉంది. చేయగల సామర్థ్యం ఉంది. అవకాశాల పట్ల ఎరుక ఉంది’ అంటున్నారు వాళ్లు. 7 స్వర్ణాలు సాధించిన ప్రత్యూష, 5 స్వర్ణాలు సాధించిన హేమనయని సక్సెస్ స్టోరీలు మీకోసం..
ఈ మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం..
మనుషులకు వైద్యం చేసే డాక్టర్లు మనుషులకు మాత్రమే చేస్తారు. కాని మేము భిన్న జంతు జీవాలకు వైద్యం చేస్తాం. కుక్క, పిల్లి, ఆవు, గేదె, గుర్రం, గొర్రె... ఒక్కోదానికి ఒక్కో రీతిన వైద్యం చేయాలి. నేడు పశువైద్యం చదివితే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ భద్రత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. లేదంటే కొద్దిపాటి పెట్టుబడితో పెట్ క్లినిక్ పెట్టుకుంటే మంచి ఉపాధి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఎన్నో ఉపాధి అవకాశాలు వెటర్నరీ డాక్టర్లకు ఉండటం వల్ల, రిజర్వేషన్ ప్రయోజనం అదనంగా జతై నేడు ఎక్కువ మంది అమ్మాయిలు పశువైద్యం చదువుతున్నారు.
NEET 2023 Rankers: నీట్‌లో అదరగొట్టిన గొర్రెల కాపర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డబ్బులు లేకపోవడంతో...
నా లక్ష్యం ఇదే..
నేను కూడా ఆ అవగాహనతోనే పోద్దుటూరు వెటర్నరీ కాలేజీలో బి.వి.ఎస్.సి చేశాను. నాకు 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొండమంచిలి గ్రామం. నాన్న నా చిన్న వయస్సు నుంచే గల్ఫ్ దేశాలకు వెళ్లారు. నేను బాగా చదవడానికి మా అక్క, అమ్మ ముఖ్య కారకులు. అక్కయ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని నాకు అండగా ఉంటోంది.
ఇంటర్ వరకు పాలకొల్లులో చదివాను. ఇంటర్ బై.పి.సిలో 987 మార్కులు సాధించి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాను. జంతువుల పట్ల ప్రేమతో ఎలాగైనా వెటర్నరీ డాక్టర్ కావాలని ఎంసెట్ రాసి 1499 ర్యాంకును సాధించాను. ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని తపన పడేదానిని. రోజుకు సుమారు 4 నుంచి 6 గంటలు చదివాను. సెలవురోజులలో కళాశాలలో ఉన్న లైబ్రరీలను, ల్యాబ్‌లను సందర్శించి ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్‌ను అర్ధం చేసుకుని చదివాను. కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం వెటర్నరీ పీజి చేయాలని ప్రవేశ పరీక్ష రాశాను. భవిష్యత్తులో పశువైద్య అధ్యాపకురాలుగా రాణించాలని ఉంది.
– తీర్థాల హేమనయని, బి.వి.ఎస్.సి, 5 బంగారు పతకాల గ్రహీత, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ,ప్రోద్దుటూరు.
పశు వ్యాధులను శోధించే సైంటిస్ట్ అవుతాను..నేనిప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో ‘ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’లో పిజి సీటు సాధించి వెటర్నరీ మైక్రోబయాలజీ చేస్తుండటం వల్ల మొన్నటి స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోయాను. కాని 7 గోల్డ్ మెడల్స్ సాధించడం మాత్రం సంతోషంగా ఉంది. చదువులో బాగా రాణించాలని రోజుకు ఆరు గంటలు చదివాను. సీనియర్లు, అధ్యాపకులు బాగాప్రోత్సహించారు. బి.వి.ఎస్.సిలో ఐదు సంవత్సరాల్లో 18 సబ్జెక్ట్స్ చదువుతాము. వాటిలో దాదాపు 17 గోల్డ్‌మెడల్స్ ఉంటే నాకు 7 వచ్చాయి. మాది అనంతపురం. మా నాన్న గవర్నమెంట్ టీచర్. నేను తిరుపతి కాలేజీలో బి.వి.ఎస్.సి చేశాను.
ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కావాలని ఇంటర్‌లో బై.పి.సి చదివి 969 మార్కులు సాధించాను. నీట్‌లో సీట్ రాకపోయినా బాధపడలేదు. ఎంసెట్‌లో 1248వ ర్యాంకు సాధించి వెటర్నరీ కళాశాలలో బి.వి.ఎస్.సి డిగ్రీలో చేరాను. మనుషులకు వైద్యం చేసే డాక్టరైనా పశువులకు వైద్యం చేసే డాక్టరైనా డాక్టరే. చిన్నప్పటి నుంచి నాకు మూగజీవాలంటే ఇష్టం. ఆడవాళ్లు పశువుల ఆలనా పా లనా బాగా చూస్తారు. వైద్యం కూడా బాగా చేయగలరని నా నమ్మకం.
NEET 2023 Ranker: కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో పశు వైద్యానికి సంబంధించిన ఇన్‌ఫ్రా తక్కువే ఉంది. కాని ఇటీవల పెట్స్‌కు డిమాండ్ పెరిగింది. అయితే రేబిస్ వంటి ఏ ఒకటి రెండు వ్యాక్సిన్ల గురించి మాత్రమే కాకుండా పశువులకు సంబంధించిన ఎన్నో వ్యాక్సిన్ల గురించి తగినంత చైతన్యం రావాలి. నాకైతే పశువులకు వచ్చే వ్యాధుల గురించి పరిశోధించే సైంటిస్ట్ కావాలని ఉంది. వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా ఇవి పశువులకు ఎలా జబ్బులు కలిగిస్తాయో పరిశోధనలు కొనసాగుతూ ఉంటే పశువులను కాపా డటమే కాదు వాటి వల్ల మనుషులకు వచ్చే జబ్బులను కూడా నిరోధించి మనుషులనూ కాపాడవచ్చు.
– లొడుగు ప్రత్యూష, బి.వి.ఎస్.సి, ఏడు బంగారు పతకాల గ్రహీత, ఎస్.వి. వెటర్నరీ కళాశాల