Police officer clears NEET UG: డ్యూటీ చేస్తూనే సొంత ప్రిపరేషన్‌తో మెడికల్ సీటు సాధించా... నా సక్సెస్ జర్నీ సాగిందిలా
తమిళనాడులోని ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలోని ముదుగపట్టి గ్రామంలో దినసరి కూలీలు మాణిక్యం, ఇంద్రవల్లి దంపతులకు శివరాజ్ జన్మించారు. ముగ్గురు తోబుట్టువులలో శివరాజ్ చివరివారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం కావడంతో ఉన్నంతలో పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాడు మాణిక్యం.
శివరాజ్ కు చిన్నప్పటి నుంచి డాక్టరవ్వాలనేది కోరిక. తన కోరికను సాకారం చేసుకునేందుకు కష్టపడి చదివేవాడు. 2016లో 12వ తరగతి పరీక్షలో 1200 మార్కులకు 915 మార్కులు సాధించాడు. అయితే మెడికల్ ర్యాంకుమిస్‌కావడంతో అయిష్టంగానే కరూర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు.
NEET 2023 Rankers: నీట్‌లో అదరగొట్టిన గొర్రెల కాపర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డబ్బులు లేకపోవడంతో...
డిగ్రీ పూర్తయిన తర్వాత పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీస్ రిక్రూట్ మెంట్ బోర్డు(Tamil Nadu Uniformed Service Recruitment Board) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న శివరాజ్.. ఉద్యోగం కూడా సాధించాడు. శిక్షణ అనంతరం 2020లో అవడి బెటాలియన్(Avadi Battalion)లో పోస్టింగ్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచి గ్రేడ్-2 పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
తన డ్రీమ్ కలగానే మిగిలిపోయిందనుకున్న సమయంలో శివరాజ్‌కు తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మళ్లీ ఆశలు చిగురించేలా చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులకి నీట్‌లో 7.5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2020లో తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కుటుంబ పరిస్థితుల కారణంగా డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరిన శివరాజ్ మళ్లీ తన కలను సాకారం చేసుకోవాలనుకుని ఫిక్సయ్యాడు. నీట్ కు ప్రిపేర్ కావాలని బలంగా నిర్ణయించుకున్నాడు. స్నేహితుల సహాయంతో పుస్తకాలు, ఆన్లైన్ మెటీరియల్ సేకరించుకున్నాడు. సొంతంగా సన్నద్ధమవుతూ 2022లో తొలి ప్రయత్నంలో 268 మార్కులు సాధించాడు. ఆ మార్కులవల్ల ఉపయోగం లేకపోయినా శివరాజ్‌లో ఆత్మవిశ్వసం పెంచింది.
రెండో సారి మరింత కష్టపడి చదివాడు. ఈ సారి 720 మార్కులకు 400 మార్కులు సాధించి కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాడు ఈ 24ఏళ్ల పోలీస్. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, పరీక్షకు సొంతంగా సన్నద్ధమై నీట్ ర్యాంకు సాధించిన కానిస్టేబుల్ శివరాజ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు.
NEET 2023 Ranker: కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ
సీటు సాధించిన తర్వాత శివరాజ్ మాట్లాడుతూ తనకు తన తమ్ముడే ఆదర్శమని చెప్పాడు. 7.5 శాతం రిజర్వేషన్ ద్వారా తన తమ్ముడు కూడా మెడికల్ సీటు సాధించి తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడని.. అతనిని ఆదర్శంగా తీసుకునే తాను మళ్లీ నీట్‌కు ప్రిపేరయ్యాయని కానిస్టేబుల్ చెబుతున్నాడు.