Skip to main content

Govt Junior Colleges: కాలేజీలకు కొత్త హంగులు

New trends for Govt colleges

విశాఖ విద్య: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా నాణ్యమైన చదువులు అందించేలా చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా అవసరమైన వనరులు సమకూరుస్తొంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెత్తనం చేసిన కార్పొరేట్‌ శక్తుల నిర్వాకం కారణంగా జిల్లాలోని జూనియర్‌ కాలేజీలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. చిన్నపాటి మరమ్మతులు చేయాలన్నా, నాటి పాలకులు చిల్లిగవ్వ కూడా ఇవ్వని పరిస్థితులు ఉండేవి. విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోన్న ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జూనియర్‌ కాలేజీలను సైతం అభివృద్ధి చేసేలా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ‘నాడు – నేడు’ కింద జిల్లాలోని 8 జూనియర్‌ కాలేజీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.7.97 కోట్లు మంజూరు చేసింది. సకల సౌకర్యాలు కల్పించేలా పనులు చేపట్టడంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు సరికొత్త హంగులు సంతరించుకుంటున్నాయి.

సకల సౌకర్యాలు కల్పించేలా నిధులు
జిల్లాలో పది జూనియర్‌ కాలేజీలు ఉండగా జిల్లా అధికారుల నివేదికల మేరకు ఎనిమిది కాలేజీలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ‘నాడు – నేడు’ కింద నిధులు మంజూరు చేసింది. ఇందులో భీమునిపట్నం కళాశాలకు రూ.1.26 కోట్లు, అగనంపూడికి రూ.61.42 లక్షలు, ఇస్లాంపేటకు (పెదగంట్యాడ) రూ.53.65 లక్షలు, పెందుర్తికి రూ.1.79కోట్లు, విశాఖపట్నం రూరల్‌కి రూ.48.46 లక్షలు, విశాఖపట్నం బాలికల జూనియర్‌ కాలేజీకి రూ.1.42 కోట్లు, వీఎస్‌ కృష్ణ ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీకి రూ.62.56 లక్షలు, డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ కాలేజీకి రూ.1.24 కోట్లు చొప్పున మంజూరు చేశారు.

Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రిన్సిపాళ్లు బాధ్యత తీసుకోవాలి
భవిష్యత్‌ అవసరాల మేరకు కాలేజీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా పనులు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. లక్ష్య సాధనకు కాలేజీల ప్రిన్సిపాళ్లు బాధ్యత తీసుకోవాలి. పనుల ప్రగతి నివేదికలను సకాలంలో వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
– రాయల సత్యనారాయణ, ఆర్‌ఐవో, ఉమ్మడి విశాఖ జిల్లా

నెలాఖరుకు పనులు పూర్తి
2023 – 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యాబోధనకు ఆటంకం లేకుండా పనుల్లో వేగం పెంచారు. ఈ నెలాఖరునాటికి పనులు పూర్తి చేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రాయల సత్యనారాయణ రోజూ కాలేజీల వారీగా పనుల పురోగతిపై సమీక్షిస్తూనే, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా నిర్వాహకులను అప్రమత్తం చేస్తున్నారు.
 

Published date : 03 Aug 2023 05:02PM

Photo Stories